‘హథీరాంజీ’కి ఏంటీ గతి?
ABN , Publish Date - Apr 25 , 2026 | 07:42 AM
తిరుపతి అర్బన్, రూరల్ ప్రాంతాల్లో హథీరాంజీ మఠానికి చెందిన భూములను కళ్ల ముందే కబ్జా చేస్తున్నారు. ఇదేదో గుట్టుగా జరుగుతున్న వ్యవహారం కాదు. ఎకరాల కొద్దీ భూములను బహిరంగంగానే ఆక్రమిస్తున్నారు.
తిరుపతిలో యథేచ్ఛగా ఆక్రమణలు
పేరూరులో రూ.20 కోట్ల భూమి అమ్మకానికి సిద్ధం
ఆటో డ్రైవర్ కబ్జాలో రూ.20 కోట్ల భూమి
తుమ్మలగుంటలో 165 ఎకరాలకు ఎసరు
అక్రమాలపై స్పందించని యంత్రాంగం
గత ప్రభుత్వంలోనూ, ఇప్పుడూ ఇదే దుస్థితి
(తిరుపతి-ఆంధ్రజ్యోతి)
తిరుపతి అర్బన్, రూరల్ ప్రాంతాల్లో హథీరాంజీ మఠానికి చెందిన భూములను కళ్ల ముందే కబ్జా చేస్తున్నారు. ఇదేదో గుట్టుగా జరుగుతున్న వ్యవహారం కాదు. ఎకరాల కొద్దీ భూములను బహిరంగంగానే ఆక్రమిస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలోనూ స్వాహా చేశారు. ఇప్పుడూ చేస్తున్నారు. అనుమతుల్లేకుండా నిర్మాణాలూ చేపడుతున్నారు. మఠం భూముల్లోకి చొరబడి కబ్జాలు చేస్తున్న అక్రమార్కులకు ప్రభుత్వం పట్ల ఎలాంటి భయం కనిపించడం లేదు. జిల్లా అధికార యంత్రాంగం ఉదాసీనత, నిర్లక్ష్యమే ఇందుకు కారణాలు. మఠం భూములను దొడ్డిదారిలో అమ్మి కోట్లు గడిస్తున్న అక్రమార్కులు ఏ స్థాయిలోనైనా ప్రలోభపెట్టే పరిస్థితి నెలకొంది. ప్రలోభాల కారణంగా ఎవరు ఫిర్యాదు చేసినా అధికార యంత్రాంగం స్పందించడం లేదన్న ఆరోపణలున్నాయి. గత వైసీపీ ప్రభుత్వంలో కబ్జాలను అడ్డుకున్న దాఖలాలు లేవు. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలోనూ యంత్రాంగం తీరు మారలేదు. ఓవైపు ప్రభుత్వ భూముల జోలికొస్తే ఖబడ్దార్ అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరిస్తుండగా.. మరోవైపు జిల్లా యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంది.

ఎండోమెంట్ కమిషనర్ లేఖ రాసినా..
గత వైసీపీ ప్రభుత్వంలో మఠం భూములు చాలా అన్యాక్రాంతం అయ్యాయి. అప్పట్లో దేవదాయ శాఖ అధికారులు ఫిర్యాదు చేసినా జిల్లా యంత్రాంగం ఏమాత్రం స్పందించలేదు. 2024 మార్చి 20న స్వయంగా దేవదాయ శాఖ కమిషనర్.. జిల్లా కలెక్టర్, ఎస్పీలకు లేఖ రాశారు. నవీన్, కె.రజనీకాంత్ అనే వ్యక్తులు మఠం భూములు కబ్జా చేస్తున్నారని స్పష్టంగా పేర్కొన్నారు. భూముల కబ్జాను అడ్డుకున్న మఠం ఉద్యోగులపై వారిద్దరూ దాడికి పాల్పడ్డారని తెలిపారు. జిల్లా స్థాయి ఇంటర్ డిపార్ట్‌మెంటల్ ఎండోమెంట్స్ ల్యాండ్ ప్రొటెక్షన్ కమిటీ చైర్మన్ హోదాలో కలెక్టర్ స్పందించాలని.. నవీన్, కె.రజనీకాంత్ అనే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే ఎండోమెంట్ కమిషనర్ లేఖపై అప్పటి కలెక్టర్, ఎస్పీలు ఎలాంటి చర్యా తీసుకోలేదు.
మఠం ఉద్యోగులను నిర్బంధించి..
తిరుపతి రూరల్ మండలం అవిలాల సర్వే నంబరు 147లో మఠం భూమిని ఎం.నరసింహారెడ్డి, పి.లింగమూర్తి, శ్రీదేవి, గుర్రమ్మ తదితరులు 2024 జూన్ 9న జేసీబీలతో చదును చేయిస్తుండగా మఠం ఉద్యోగులు అడ్డుకున్నారు. మరుసటి రోజు మళ్లీ పనులు చేస్తుండగా మఠం ఉద్యోగులు తిరిగి అడ్డుకున్నారు. అప్పటికే అక్కడ అక్రమార్కుల తరఫున సుమారు వంద మంది రౌడీలు మోహరించారు. వారంతా కలసి మఠం ఉద్యోగులను గదిలో నిర్బంధించారు. వారిని కర్రలతో తీవ్రంగా బెదిరించి దుస్తులు కూడా ఊడదీయించారు. సమాచారమందుకున్న అప్పటి మఠం ఫిట్ పర్సన్ రమేశ్ నాయుడు ఉద్యోగులకు కబ్జాదారుల నుంచి ప్రాణహాని ఉందంటూ రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయినా కబ్జాదారులపై చర్యలు తీసుకోలేదు.
2500 కోట్ల భూముల కబ్జాపై ఫిర్యాదు చేసినా..
కూటమి ప్రభుత్వంలో అక్రమార్కులు మరింత దూకుడు పెంచారు. తిరుపతి రూరల్, తిరుపతి అర్బన్ మండలాల్లో కలిపి 244ఎకరాల మఠం భూములు కబ్జా అవుతున్నాయని హథీరాంజీ మఠం ఫిట్ పర్సన్ రమేశ్ నాయుడు జిల్లా యంత్రాంగానికి ఫిర్యాదుచేసి ఏడాదన్నర దాటింది. ఇంతవరకూ ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. తిరుపతి రూరల్ అవిలాల గ్రామం చెంచులక్ష్మి కాలనీ వద్ద సర్వే నంబర్లు 364, 368-1లలో 26ఎకరాలు, అదే గ్రామం సర్వే నంబరు 145లో 6.56 ఎకరాలు, 147-1లో 36.60 ఎకరాలు, తుమ్మలగుంటలో 69, 70, 72, 80 తదితర సర్వే నంబర్లలో 154 ఎకరాలు, తిరుచానూరు రోడ్డులో సర్వే నంబరు 54లో 11 ఎకరాలు, తిరుపతి అర్బన్ మండలం బైరాగిపట్టెడ సమీపంలో సర్వే నంబరు 242-బీలో 9.89 ఎకరాలు చొప్పున మొత్తం 244.05 ఎకరాలు ఆక్రమణలకు గురవుతున్నాయని ఆయన 2024 జూలై 2న కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ భూముల ప్రస్తుత విలువ రూ.2562 కోట్లు.
పీడీ యాక్ట్ ప్రయోగిస్తేనే..
తిరుపతిలో మఠం భూములు కాజేస్తున్న అక్రమార్కులు క్రిమినల్ కేసులను ఏమాత్రం ఖాతరు చేయడం లేదు. హథీరాంజీ మఠం ఏవో టి.బాపిరెడ్డి గతేడాది జూన్ 3న అవిలాల గ్రామం సర్వే నంబర్లు 145, 147-1లలో కొనసాగుతున్న ఆక్రమణలను ఆపాలని ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఎన్.నరసింహారెడ్డి అనే వ్యక్తి దాఖలు చేసిన రిట్ పిటిషన్ నంబరు 14096-2025లో హైకోర్టు గతేడాది మే 29న జారీ చేసిన ఉత్తర్వుల్లో జాయింట్ సర్వే నిర్వహించే దాకా ఇరుపక్షాలూ స్టేటస్ కో పాటించాలని ఆదేశించిందని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. స్టేటస్ కో అమల్లో ఉన్నా మఠం భూముల్లో ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నాయని, వాటిని ఆపాలని కోరారు. అయినా అప్పటి ఎస్పీ స్పందించలేదు. మఠం ఏవో టి.బాపిరెడ్డి గతేడాది జూన్ 25న ఎమ్మార్‌పల్లి పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌వోకు ఫిర్యాదు చేశారు. అయినా చర్యలు లేవు. విషయం సీఎం దృష్టికి వెళ్లడంతో ఎట్టకేలకు జిల్లా యంత్రాంగం కదిలింది. గతేడాది జూలై 12న 145, 147-1 సర్వే నంబర్లలోని మఠం భూముల్లో జరుగుతున్న అక్రమ నిర్మాణాలను అడ్డుకున్న అధికారులు వాటిని కూల్చివేయించారు. అయినా మళ్లీ అక్కడ అక్రమ నిర్మాణాలు యథావిధిగా కొనసాగుతునే ఉన్నాయి. పీడీ యాక్ట్ కింద కేసులు పెడితేనే అక్రమార్కులు భయపడతారన్న వాదన బలంగా వినిపిస్తోంది.
ఏ కేసులోనూ కోర్టు నుంచి అనుమతుల్లేవు
మఠం భూములు ఆక్రమించుకున్న వ్యక్తులు పదేపదే హైకోర్టులో రిట్ పిటిషన్లు దాఖలు చేస్తున్నారు. ఒకరిద్దరు కబ్జాదారులు కొన్నేళ్లుగా 35 రిట్ పిటిషన్లు దాఖలు చేశారు. ఇంచుమించు అన్నింటినీ వారంతకు వారే విత్‌డ్రా చేసుకున్నారు. ఇప్పటికీ పలు పిటిషన్లు హైకోర్టులో పెండింగులో ఉన్నాయి. ఏ కేసులోనూ హైకోర్టు నుంచి మఠం భూముల్లో నిర్మాణాలకు అనుమతుల్లేవు. పిటిషనర్లకు అనుకూలంగా ఎలాంటి ఆదేశాలూ లేవు. రెండు కేసుల్లో స్టేటస్ కో మెయింటైన్ చేయాలని ఇవ్వగా, మిగిలిన వాటిల్లో ఎలాంటి ఉత్తర్వులూ లేవు.
పేరూరులో చదును చేసేశారు
తిరుపతి రూరల్ మండలం పేరూరు గ్రామంలో సర్వే నంబరు 87-1లో 2.66 ఎకరాలు, సర్వే నంబరు 87-2లో 1.80 ఎకరాలు చొప్పున మొత్తం 4.46 ఎకరాల భూమి హథీరాంజీ మఠానికి చెందినది. పూతలపట్టు-నాయుడుపేట జాతీయ రహదారికి ఆనుకుని ఉంది. మార్కెట్ విలువ ప్రకారం ఈ భూమి ధర రూ.20 కోట్లు. ఇటీవలే కొందరు బడా వ్యక్తులు ఈ భూములపై కన్నేశారు. లే అవుట్ వేసేందుకు భూమిని చదును చేశారు. చుట్టూ ఫెన్సింగ్ వేసేశారు. ఈ భూమిని మఠం బహిరంగ వేలం నిర్వహించి సాగు కోసం రైతులకు కౌలుపై కేటాయిస్తుంటుంది. భూమిని గతంలో సాగు చేసిన వారి నుంచీ అధికార పార్టీకి చెందిన కొందరు నేతలు బెదిరించి గుంజుకున్నట్టు సమాచారం. వారికి అడ్వాన్స్ పేరిట స్వల్ప మొత్తంలో నగదు ముట్టజెప్పి ప్లాట్లు వేసి విక్రయించాక మరికొంత చెల్లిస్తామంటూ బేరం కుదుర్చుకున్నట్టు ఆరోపణలున్నాయి. ఈ భూములను అమ్మకానికి సిద్ధం చేస్తున్నారు.
తుమ్మలగుంటలో ఆక్రమణల జోరు
తిరుపతి రూరల్ మండలం తుమ్మలగుంటలో హథీరాంజీ మఠానికి 165ఎకరాల భూమి ఉంది. గతంలో ఈ భూములను రైతులకు కౌలుకు కేటాయించేది. తర్వాత కౌలు రద్దు చేసినా భూములను మాత్రం మఠానికి స్వాధీనం చేయలేదు. మఠం సిబ్బందిని భూముల్లో అడుగుపెట్టనివ్వకుండా దౌర్జన్యం చేసేవారు. దశాబ్దాలుగా డీబీసీ రిజిష్టర్‌లో ఎంట్రీలు లేవు. డిమాండ్, కలెక్షన్స్, బ్యాలెన్స్ వివరాలు నమోదుకాలేదు. దీంతో భూములపై మఠం పట్టుకోల్పోయింది. ఈ భూముల్లో అక్రమ నిర్మాణాలు వెలిశాయి. కొన్నింటిని మఠం అధికారులు గతంలో కూల్చివేయించగా కొందరు నేతలు అడ్డుపడ్డారు. స్థలాలను అక్రమంగా విక్రయించిన వారే నేతల వెంట వచ్చి ఆందోళనల్లో పాల్గొన్నారు. ప్రభుత్వం అండ లేకుండా ఆక్రమణలు తొలగించడం మఠం యంత్రాంగానికి సవాల్‌గా మారింది. ఈ స్థలాలు 22ఏ జాబితాలో ఉన్నందున స్టాంప్ పేపర్ల మీదే అమ్ముతున్నారు. కొందరు ఒకే స్థలాన్ని పలువురికి విక్రయిస్తున్నారు.
ఆటో డ్రైవర్ నిర్వాకం
ఓ ఆటో డ్రైవర్ కబ్జాలో రూ.20 కోట్ల విలువైన మఠం భూమి చిక్కుకుంది. తిరుపతి రూరల్ మండలం అవిలాల సర్వే నంబరు 147-1లో మొత్తం 25 ఎకరాలకు గానూ 2.16 ఎకరాలు గురుస్వామిరెడ్డి అనే వ్యక్తికి మఠం లీజుకు కేటాయించింది. ఆ భూమిని తనకు విక్రయించాల్సిందిగా కౌలు రైతు (3211-2005 రిట్ పిటిషన్ నంబరు) కోర్టును ఆశ్రయించారు. అయితే ఆయనకు భూమి విక్రయించడం కుదరదంటూ కోర్టు పిటిషన్ కొట్టివేసింది. 2009లో ఆ భూమిని కౌలు రైతు నుంచి మఠం స్వాధీనం చేసుకుంది. అయితే ఈ కౌలు రైతు నుంచి కొనుగోలు చేసినట్టు ఓ ఆటో డ్రైవర్ డాక్యుమెంట్లు సృష్టించి 2021లో కోర్టుకెళ్లాడు. అవి అన్ రిజిష్టర్డ్ పత్రాలు కావడంతో వాస్తవాలు దాచి పిటిషన్ వేశాడంటూ 2023 జూలై 27న కోర్టు ఆ పిటిషన్‌ను కొట్టివేసింది. అయితే ఇప్పటికీ ఆ భూమి ఆటో డ్రైవర్ కబ్జాలో ఉంది. అక్కడ పలు భవనాలు, షెడ్లు నిర్మించారు.