Share News

ఆ కుటుంబంలో భాగమైనందుకు సిగ్గుపడుతున్నా: కవిత

ABN , Publish Date - Apr 25 , 2026 | 10:44 AM

తెలంగాణ రాష్ట్ర సేన పేరుతో కల్వకుంట్ల కవిత కొత్త పార్టీని ప్రకటించారు. కష్టపడి సాధించుకున్న తెలంగాణలో నూతన రాజకీయ శక్తిగా రాబోతున్నామని కవిత అన్నారు. ఇది తన జీవితంలో మర్చిపోలేని రోజని చెప్పుకొచ్చారు.

ఆ కుటుంబంలో భాగమైనందుకు సిగ్గుపడుతున్నా: కవిత
Kalvakuntla Kavitha

హైదరాబాద్, ఏప్రిల్ 25: తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. కల్వకుంట్ల కవిత తన కొత్త రాజకీయ పార్టీని ప్రకటించారు. ‘తెలంగాణ రాష్ట్ర సేన (TRS)’ పేరుతో పార్టీ పేరును ప్రకటించిన కవిత.. పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్ అధ్యక్షురాలు మాట్లాడుతూ.. తెలంగాణలో కొత్త విప్లవానికి నాంది మొదలైందని అన్నారు. కష్టపడి సాధించుకున్న తెలంగాణలో నూతన రాజకీయ శక్తిగా రాబోతున్నామన్నారు. ఇది తన జీవితంలో మర్చిపోలేని రోజని తెలిపారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం అందరి భాగస్వామ్యం అవసరమని పిలుపునిచ్చారు. తెలంగాణ కోసం ఎన్నో కష్టాలు పడి పిడికిలి బిగించి కొట్లాడామని.. ఉద్యమంలో ఎంతో మంది ప్రాణాలు అర్పించారని గుర్తుచేశారు.


ఉద్యమంలో బతుకమ్మను ఎత్తుకుని ఊరూరా తిరిగానని.. బతుకమ్మ వచ్చిన తర్వాత ఉద్యమానికి ఊపొచ్చిందని కవిత అన్నారు. తెలంగాణ ఏర్పడి 12 ఏళ్లైనా ప్రజల కలలు నెరవేరలేదని విమర్శించారు. కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ ఉద్యమ రథం దారితప్పిందని వ్యాఖ్యానించారు. బానిస సంకెళ్లు పోతాయనుకుంటే పేదలకు దెబ్బలు పడ్డాయన్నారు. తెలంగాణ ఉద్యమంలో జాగృతి కీలకపాత్ర పోషించిందని చెప్పుకొచ్చారు. పదేళ్లు పాలించిన కుటుంబంలో తానూ భాగమైనందుకు సిగ్గుపడుతున్నానంటూ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. దానికి కేవలం క్షమాపణ చెబితే సరిపోదన్నారు. ప్రాయశ్చిత్తం కోసమే ప్రజల ముందుకు టీఆర్‌ఎస్‌తో వస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ ఆత్మను బీఆర్‌ఎస్ కోల్పోయిందన్నారు. తెలంగాణ ప్రజలకు ఒక అమ్మగా ఉండాలనుకుంటున్నానని అన్నారు. సామాజిక తెలంగాణ సాధన కోసం పనిచేస్తానని కవిత స్పష్టం చేశారు.


బీజేపీకి తెలంగాణ ఏర్పాటు ఇష్టం లేదని కవిత విమర్శించారు. తెలంగాణ విభజనను పాకిస్థాన్‌తో పోల్చారని మండిపడ్డారు. రాష్ట్ర బీజేపీ ఎంపీలు కేంద్రానికి బానిసలంటూ దుయ్యబట్టారు. ఏపీలో కలిపిన ఐదు గ్రామాలను తెలంగాణకు తీసుకురావాలని డిమాండ్ చేశారు. సామాజిక తెలంగాణను కేసీఆర్ సాధించలేకపోయారని విమర్శించారు. అప్పటి టీఆర్‌ఎస్‌కు తన రక్తాన్ని ధారపోశానని చెప్పుకొచ్చారు. కేసీఆర్ మర మనిషి.. మన మనిషి కాదని వ్యాఖ్యానించారు. ప్రజలకు కష్టం వస్తే కేసీఆర్ రారని అన్నారు. పేదల ఇళ్లు కూలుతుంటే కేసీఆర్ ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. ‘నాకు తండ్రి కావొచ్చు.. కానీ కేసీఆర్ రాజకీయ పరిణతి కోల్పోయారు’ అంటూ కవిత తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.


ఇవి కూడా చదవండి...

రాత్రంతా పోలీసుల విచారణ.. సహకరించని అనంతబాబు

ఏపీలో పెట్రోల్‌ బంకుల మూసివేతపై సీఎం చంద్రబాబు సమీక్ష

Read Latest Telangana News And Telugu News

Updated Date - Apr 25 , 2026 | 12:47 PM