జనసేన తెలంగాణ రాష్ట్ర కార్యాలయ ప్రారంభోత్సవం.. పార్టీ జెండా ఆవిష్కరించిన పవన్
ABN , Publish Date - Jun 19 , 2026 | 06:47 PM
హైదరాబాద్ మణికొండలో నూతనంగా నిర్మించిన జనసేన తెలంగాణ రాష్ట్ర కార్యాలయ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ జనసేన జెండాను ఆవిష్కరించి కార్యాలయంలోకి ప్రవేశించారు. ప్రత్యేక పూజల అనంతరం తెలంగాణ తల్లికి నమస్కరించి, రాష్ట్ర నాయకులతో ముచ్చటించారు.
హైదరాబాద్, జూన్ 18: ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో ఘనవిజయం సాధించి, కూటమి ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా మారిన జనసేన పార్టీ.. ఇప్పుడు పొరుగు రాష్ట్రమైన తెలంగాణపై తన రాజకీయ దృష్టిని కేంద్రీకరించింది. రాష్ట్రంలో పార్టీ విస్తరణ, సంస్థాగత బలోపేతమే లక్ష్యంగా సరికొత్త వ్యూహాలతో దూకుడు పెంచింది. ఇందులో భాగంగానే హైదరాబాద్‌లోని మణికొండ (మల్కం చెరువు సమీపంలో) నూతనంగా నిర్మించిన జనసేన తెలంగాణ రాష్ట్ర కార్యాలయం శుక్రవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలతో అధికారికంగా ప్రారంభమైంది. జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయ ప్రారంభోత్సవం సందర్భంగా పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ జనసేన జెండాను ఆవిష్కరించి కార్యాలయంలోకి అడుగుపెట్టారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం తెలంగాణ తల్లి చిత్రపటానికి నమస్కరించి, రాష్ట్ర నాయకులతో ముచ్చటించారు.
గ్రేటర్ ఎన్నికలే తొలి లక్ష్యం!
రాబోయే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) ఎన్నికల్లో జనసేన పార్టీ బరిలోకి దిగుతుందని పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఇప్పటికే స్పష్టం చేశారు. ఒంటరిగానైనా సరే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేస్తామని, క్షేత్రస్థాయిలో పార్టీకి బలం పెంచేందుకు త్వరలోనే తానే స్వయంగా తెలంగాణ వ్యాప్తంగా పర్యటిస్తానని ఆయన ప్రకటించారు. ఈ క్రమంలోనే గ్రేటర్ ఎన్నికలను ఓ సవాల్‌గా తీసుకుని క్యాడర్‌ను సమాయత్తం చేసేందుకు ఈ నూతన కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.

సంస్థాగత నిర్మాణం - చేరికలపై ఫోకస్
హైదరాబాద్‌లో ఇప్పటికే జనసేన పార్టీకి కార్యాలయం ఉన్నప్పటికీ.. తెలంగాణలో పార్టీ ఉనికిని మరింత బలంగా చాటేందుకు ఈ కొత్త ఆఫీస్‌ను అందుబాటులోకి తెచ్చారు. రాష్ట్రంలో పార్టీ చేరికలను ప్రోత్సహించేందుకు వీలుగా త్వరలోనే ఒక ప్రత్యేక 'జాయినింగ్స్ కమిటీ'ని కూడా ఏర్పాటు చేయనున్నారు. ఈ కార్యాలయం కేంద్రంగానే తెలంగాణలో సంస్థాగత నిర్మాణం, కమిటీల ఏర్పాటు, ఇతర రాజకీయ వ్యూహాలపై జనసేన నాయకత్వం దృష్టి సారించనుంది.
ఇటీవలి కాలంలో పవన్ కల్యాణ్ హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్ పెట్టడం, ఢిల్లీ వేదికగా జరిగిన 'సేన ప్రస్థానం' కార్యక్రమంలో తెలంగాణ రాజకీయాల గురించి ప్రస్తావించడం, అలాగే హనుమకొండలో తన అభిమాని నిరంజన్‌ను కలవడం వంటి వరుస పరిణామాలు జనసైనికుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. ఆంధ్రప్రదేశ్‌లో సాధించిన విజయ ఉత్సాహంతో తెలంగాణలోనూ జనసేనను ఓ బలమైన ప్రత్యామ్నాయ శక్తిగా నిలబెట్టాలని పవన్ భావిస్తున్నారు. ఈ నూతన కార్యాలయం ప్రారంభోత్సవంతో తెలంగాణ రాజకీయాల్లో జనసేన తన తదుపరి పొలిటికల్ రోడ్ మ్యాప్‌ను ఎలా సిద్ధం చేసుకోబోతోందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ఇవి కూడా చదవండి...
హోటల్స్, రెస్టారెంట్లలో ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు.. షాకింగ్ విషయాలు వెలుగులోకి
వాన్‌పిక్ ఆస్తుల వ్యవహారం.. హైకోర్టులో ఈడీ పిటిషన్ డిస్మిస్
Read Latest Telangana News And Telugu News