Share News

25న ముంబైలో జమ్నాలాల్‌ అవార్డుల ప్రదానోత్సవం

ABN , Publish Date - Nov 18 , 2026 | 06:45 AM

గాంధేయ సిద్ధాంతాలను ఆచరిస్తూ సమాజాభివృద్ధి, గ్రామీణ సంక్షేమం, మానవతా సేవ, మహిళా సాధికారత కోసం నిస్వార్థంగా కృషి చేస్తున్న వ్యక్తులను గౌరవించేందుకు జమ్నాలాల్‌ బజాజ్‌ ఫౌండేషన్‌ ప్రతిష్ఠాత్మక అవార్డులను ప్రదానం చేయనుంది.

25న ముంబైలో జమ్నాలాల్‌ అవార్డుల ప్రదానోత్సవం
Jamnalal Bajaj Awards 2026

  • గాంధేయ విలువల కోసం కృషి చేసిన వారికి పురస్కారాలు

  • అవార్డు గ్రహీతలకు రూ.20 లక్షల చొప్పున నగదు బహుమతి

  • ముఖ్యఅతిథిగా భూటాన్‌ యువరాణి సోనమ్‌ దేచెన్‌ వాంగ్‌చుక్‌

హైదరాబాద్‌, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి) : గాంధేయ సిద్ధాంతాలను ఆచరిస్తూ సమాజాభివృద్ధి, గ్రామీణ సంక్షేమం, మానవతా సేవ, మహిళా సాధికారత కోసం నిస్వార్థంగా కృషి చేస్తున్న వ్యక్తులను గౌరవించేందుకు జమ్నాలాల్‌ బజాజ్‌ ఫౌండేషన్‌ ప్రతిష్ఠాత్మక అవార్డులను ప్రదానం చేయనుంది. ఈ నెల 25న ముంబైలో 48వ జమ్నాలాల్‌ బజాజ్‌ అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమానికి భూటాన్‌ యువరాణి సోనమ్‌ దేచెన్‌ వాంగ్‌చుక్‌ ముఖ్య అతిథిగా హాజరై, ఎంపికైన వారికి పురస్కారాలను అందజేయనున్నారు. సమాజంలో పెద్దగా ప్రచారంలోకి రాకుండా, నిశ్శబ్దంగా సేవలందిస్తూ ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొస్తున్న వ్యక్తులను గుర్తించడం ఈ పురస్కారాల ప్రధాన ఉద్దేశం. ఈ కార్యక్రమానికి జమ్నాలాల్‌ బజాజ్‌ ఫౌండేషన్‌ చైర్మన్‌ శేఖర్‌ బజాజ్‌, నోబెల్‌ శాంతి బహుమతి గ్రహీత కైలాశ్‌ సత్యార్థి, డాక్టర్‌ ఆర్‌ఏ మషేల్కర్‌, మినాల్‌ బజాజ్‌ తదితర ప్రముఖులు హాజరుకానున్నారు.


మొత్తం నాలుగు విభాగాల్లో జమ్నాలాల్‌ బజాజ్‌ అవార్డులను అందజేయనున్నారు. వీటిలో మూడు జాతీయ స్థాయి అవార్డులు కాగా, ఒకటి అంతర్జాతీయ పురస్కారం. నిర్మాణాత్మక సేవలు, గ్రామీణాభివృద్ధికి సాంకేతిక పరిజ్ఞాన వినియోగం, మహిళల-బాలల సంక్షేమం, భారత్‌ వెలుపల గాంధేయ విలువల ప్రచారం విభాగాల్లో ఎంపికైన వారికి ప్రశంసాపత్రం, ట్రోఫీతోపాటు రూ.20 లక్షల నగదు అందజేస్తారు. అవార్డుల ప్రారంభం నుంచీ ఇప్పటివరకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి 7,229 నామినేషన్లు అందగా, విదేశాల నుంచి 790 నామినేషన్లు వచ్చినట్లు ఫౌండేషన్‌ వెల్లడించింది. ఇప్పటివరకు జాతీయ స్థాయిలో 143 మంది, అంతర్జాతీయ స్థాయిలో 37 మంది ఈ పురస్కారాలను అందుకున్నారు.


ఇవి కూడా చదవండి...

కోనసీమ జిల్లాలో భారీ శబ్దాలతో గ్యాస్ లీక్.. భయాందోళనలో ప్రజలు

కోనసీమ గ్యాస్ లీకేజీపై మంత్రి అచ్చెన్నాయుడు ఆరా.. అధికారులకు కీలక ఆదేశాలు

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 18 , 2026 | 06:45 AM