జగిత్యాల ఎపిసోడ్‌కు పుల్‌స్టాప్.. ఒక్కటైన నేతలు, కాంగ్రెస్ అధిష్టానం కీలక నిర్ణయం!
ABN , Publish Date - Feb 15 , 2026 | 05:37 PM
జగిత్యాల కాంగ్రెస్‌లో గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. మాజీ మంత్రి జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వర్గాల మధ్య నెలకొన్న విభేదాలను పరిష్కరించేందుకు ఏఐసీసీ రంగంలోకి దిగడంతో ఈ వివాదానికి పుల్‌స్టాప్ పడినట్టైంది.
హైదరాబాద్/జగిత్యాల, ఫిబ్రవరి 15: గత కొద్ది రోజులుగా జగిత్యాల కాంగ్రెస్ రాజకీయాల్లో సెగలు పుట్టించిన అంతర్గత విభేదాలు ఎట్టకేలకు సద్దుమణిగాయి. ఏఐసీసీ సెక్రటరీ విశ్వనాథన్ సవాంగ్ రంగప్రవేశం చేసి, ఇరు వర్గాల నేతలతో జరిపిన చర్చలు సఫలమయ్యాయి. దీంతో జగిత్యాల ఎపిసోడ్‌కు ముగింపు పడినట్లు అయింది.
నేతలతో సవాంగ్ భేటీ.. క్లాస్ పీకిన అధిష్టానం
ఏఐసీసీ సెక్రటరీ సవాంగ్.. ఎమ్మెల్యే సంజయ్ కుమార్, మాజీ మంత్రి జీవన్ రెడ్డితో విడివిడిగా, అనంతరం కలిసి చర్చలు జరిపారు. పార్టీ అంతర్గత విషయాలను రోడ్డుపైకి తీసుకురావడం వల్ల కేడర్‌లో అయోమయం నెలకొంటుందని ఆయన సున్నితంగా హెచ్చరించారు. క్రమశిక్షణే ముఖ్యమని, పార్టీ తీసుకునే తుది నిర్ణయానికి ఇరువురు నేతలు కట్టుబడి ఉండాలని సవాంగ్ స్పష్టం చేశారు. ఐక్యత చాటాలని, రాబోయే ఎన్నికలు, పార్టీ బలోపేతం దృష్ట్యా నేతలు కలిసి పనిచేయాలని సూచించారు.
జెండా మోసిన వారికే పట్టం!
ఈ భేటీలో అత్యంత కీలకమైన నిర్ణయం పదవుల కేటాయింపుపై జరిగింది. పార్టీ కోసం కష్టపడి, జెండా మోసిన నిజమైన కార్యకర్తలకు, పాత తరం నాయకులకే మున్సిపల్ చైర్మన్ వంటి కీలక పదవులు ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించింది. ఇది జీవన్ రెడ్డి వర్గానికి కొంత ఊరటనిచ్చే అంశంగా కనిపిస్తోంది.
జీవన్ రెడ్డి డిమాండ్లపై సానుకూలత?
తొలి నుంచి జీవన్ రెడ్డి వాదిస్తున్నట్లుగా.. పార్టీని నమ్ముకుని ఉన్న వారికే ప్రాధాన్యత ఇవ్వాలన్న సూచనను ఏఐసీసీ పరిగణనలోకి తీసుకున్నట్లు సమాచారం. సంజయ్ కుమార్ కూడా పార్టీ ప్రయోజనాల దృష్ట్యా సర్దుకుపోయేందుకు అంగీకరించినట్లు తెలుస్తోంది.
ఎపిసోడ్‌కు పుల్‌స్టాప్..
ఈ భేటీతో జగిత్యాల కాంగ్రెస్‌లో నెలకొన్న అనిశ్చితి తొలిగిపోయింది. నేతలు ఇద్దరూ కలిసి పనిచేస్తామని హామీ ఇవ్వడంతో కార్యకర్తలు ఊపిరి పీల్చుకుంటున్నారు. పదవుల పంపకంలో 'విధేయత'కే పెద్దపీట వేయాలని నిర్ణయించడం ద్వారా పార్టీ కేడర్‌లో కొత్త ఉత్సాహం నింపే ప్రయత్నం చేస్తోంది కాంగ్రెస్ అధిష్టానం.
ప్రజాభవన్‌లో జగిత్యాల పంచాయితీ..
ఈ ఉదయం హైదరాబాద్ ప్రజాభవన్‌కు తన వర్గం కౌన్సిలర్లతో ఏఐసీసీ సెక్రటరీని కలిశారు జీవన్ రెడ్డి. ఈ సందర్భంగా కాంగ్రెస్ హైకమాండ్.. జగిత్యాల నాయకుల ముందు రెండు ప్రతిపాదనలు ఉంచినట్టు తెలుస్తోంది. ఒకటి.. చైర్మన్ పీఠం సంజయ్ వర్గానికి, వైస్ చైర్మన్ పదవి జీవన్ వర్గానికి. రెండో ప్రతిపాదనగా చెరో రెండున్నరేళ్లు చైర్మన్ పీఠం పంచుకునేలా ఇరు వర్గాలకు సూచించినట్టు సమాచారం. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి.. కాంగ్రెస్ జెండా మోసిన వారికే చైర్మన్ పీఠం ఇవ్వాలని డిమాండ్ చేశారు. తన వర్గంతో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని కోరారు.
ఈ వార్తలు కూడా చదవండి..
శివరాత్రి పూజలో పాల్గొన్న ఏబీఎన్ డైరెక్టర్స్ అనూష, భాను ప్రకాష్
ఎన్టీఆర్ ట్రస్ట్ అంటే భరోసా, నమ్మకం: మంత్రి లోకేశ్