లిక్కర్ షాపుల్లో భారీ కుంభకోణం.. రంగంలోకి ఐటీ అధికారులు
ABN , Publish Date - May 12 , 2026 | 09:42 AM
హైదరాబాద్ చందా నగర్‌లో బినామీ పేరుతో లిక్కర్ షాపు నడుస్తున్నట్లు ఐటీ శాఖ తాజాగా గుర్తించింది. ఈ నేపథ్యంలో తెలంగాణలో లిక్కర్ షాపుల్లో భారీ కుంభకోణం జరిగినట్లు ఐటీ శాఖ భావిస్తోంది.
హైదరాబాద్, మే12: నగరంలోని చందా నగర్‌లో ఎస్సీలకు కేటాయించిన లిక్కర్ షాపు బినామీ పేరుతో నడుపుతున్నట్లు ఐటీ శాఖ తాజాగా గుర్తించింది. ఈ నేపథ్యంలో తెలంగాణలో లిక్కర్ షాపుల్లో భారీ కుంభకోణం జరిగినట్లు ఐటీ శాఖ భావిస్తోంది. దాంతో రాష్ట్రంలో ఎస్సీలకు కేటాయించిన లిక్కర్ షాపులపై ఐటీ శాఖ దృష్టి సారించింది. దీంతో చందా నగర్ తరహాలో మల్కాజిగిరి, సరూర్ నగర్, యాదాద్రిలోని మద్యం షాపుల్లో ఈ కుంభకోణం జరిగినట్లు ఐటీ శాఖ కనుక్కొంది. ఎస్సీలకు రిజర్వ్ చేసిన లిక్కర్ షాపులను థర్డ్ పార్టీ ప్రైవేట్ వ్యక్తులు బయటి నుంచి అంతా తామై నడిపుతున్నట్లు ఐటీ శాఖ అధికారుల పరిశీలనలో వెల్లడైంది.
ఈ దర్యాప్తులో పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. లిక్కర్ షాపు కార్యకలాపాలు మొత్తం సిండికేట్ వ్యక్తులే పర్యవేక్షిస్తున్నట్లు ఐటీ శాఖ గుర్తించింది. పేరుకు మాత్రమే ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి లిక్కర్ షాపు యజమానిగా ఉన్నట్లు కనుక్కొంది. మద్యం షాపుల ద్వారా వచ్చే ఆదాయంపై ఇన్‌కమ్ ట్యాక్స్ కూడా ఫైల్ చేయలేదని ఐటీ శాఖ తన దర్యాప్తులో నిర్ధారించింది. మల్కాజిగిరిలో 20 రిజర్వ్డ్ లైసెన్స్ షాపుల్లో 10 బినామిలే నడుపుతున్నట్లుగా గుర్తించింది.
మేడ్చల్‌లో 17 రిజర్వ్డ్ లైసెన్స్ లిక్కర్ షాపుల్లో 14 షాపు ఓనర్ల ఆదాయం రూ.10 లక్షలు కంటే తక్కువ ఉన్నట్లు ఐటీ శాఖ గుర్తించింది. అలాగే యాదాద్రిలో 29 షాపుల్లో 21 ఎస్సీలకు బదులు థర్డ్ పార్టీ వ్యక్తులే కార్యకలాపాలు సాగిస్తున్నట్లు ఐటీ శాఖ దర్యాప్తులో బహిర్గతమైంది. రూ. లక్షల్లో ఉన్న లైసెన్స్ ఫీజులు చెల్లించి ఈ మద్యం షాపులు దక్కించుకోవడంతో ఐటీ శాఖ సందేహించింది.
హైదరాబాద్‌లో లిక్కర్ షాపు పేరుతో నడుస్తున్న బినామీ బిజినెస్‌ను ఐటీ శాఖ సోమవారం గుట్టు రట్టు చేసింది. చందానగర్‌లో శ్రీ భవానీ వైన్స్‌లో ఐటీ శాఖ అధికారులు సోదాలు చేపట్టారు. ఈ సందర్భంగా ఈ షాపు బినామీ పేరుతో నడుస్తున్నట్లు వారు గుర్తించారు. ఎస్సీ రిజర్వేషన్ కోటాలో సురేష్ అనే వ్యక్తి ఈ లిక్కర్ షాపు దక్కించుకున్నాడు. అతడు.. తన ఆదాయాన్ని రూ.4 నుంచి రూ.5 లక్షలు చూపి.. లిక్కర్ లైసెన్స్ ఫీజు రూ.21 లక్షలు చెల్లించాడు.
అయితే ఒక్క నెలలోనే ఈ షాపు రూ. 4.3 కోట్లు ఆదాయాన్ని రాబట్టింది. దీంతో రంగంలోకి దిగిన ఐటీ శాఖ సోదాలు చేపట్టింది. ఈ వ్యవహారంలో ప్రైవేట్ వ్యక్తులకు సురేష్ బినామీగా ఉన్నట్టు గుర్తించింది. కేవలం పేరు మాత్రమే సురేష్‌దిగా ఉన్నా..అతడికి ఎలాంటి సంబంధం లేకుండా లావాదేవీలు జరిగినట్లు ఐటీ శాఖ గుర్తించింది. దీంతో ఈ వైన్ షాపును బినామీ ప్రొహిబిషన్ యాక్ట్ కింద ఐటీ అధికారులు సీజ్ చేసిన సంగతి తెలిసిందే.
ఈ వార్తలు కూడా చదవండి..
చిత్తూరులో గంగమ్మ జాతర వేడుకలు ప్రారంభం
పీఎంజే జ్యువెలరీ చోరీ.. పోలీసుల అదుపులో నిందితులు
For More TG News And Telugu News