Share News

ఇడ్లీ తినలేం! ఫోన్‌ కొనలేం.. యుద్ధం నేపథ్యంలో ఒక్కసారిగా ధరల మంట

ABN , Publish Date - Apr 22 , 2026 | 04:21 AM

మార్కెట్లో ధరల మంట మండుతోంది. పొద్దున్నే తినే ఇడ్లీ, దోశ వంటి అల్పాహారం నుంచి సెల్‌ఫోన్లు, టీవీలు, కుక్కర్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువుల దాకా అన్నింటి ధరలు అమాంతం పెరిగిపోయాయి.

ఇడ్లీ తినలేం! ఫోన్‌ కొనలేం.. యుద్ధం నేపథ్యంలో ఒక్కసారిగా ధరల మంట

  • నిత్యావసరాల నుంచి ఫోన్లు, టీవీలు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాల దాకా పెరుగుదల

  • ఫోన్లపై 15శాతం వరకు అదనపు భారం

  • రూ.6,500 ఉన్న టీవీ ఇప్పుడు రూ.10 వేలు

  • గతేడాది రూ.32 వేల ఏసీ ఇప్పుడు రూ.40 వేలు

  • మందులు, నిర్మాణ సామగ్రి ధరలదీ అదే తీరు

  • హోర్ముజ్‌ మూసివేతతో సరఫరా వ్యవస్థలకు దెబ్బ

  • రూపాయి విలువ పడిపోవడంతోనూ ప్రభావం

  • కనీసం 8 నుంచి 15శాతం వరకు అదనపు భారం

  • ధరాభారంతో విలవిల్లాడుతున్న సాధారణ జనం

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 21 (ఆంధ్రజ్యోతి): మార్కెట్లో ధరల మంట మండుతోంది. పొద్దున్నే తినే ఇడ్లీ, దోశ వంటి అల్పాహారం నుంచి సెల్‌ఫోన్లు, టీవీలు, కుక్కర్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువుల దాకా అన్నింటి ధరలు అమాంతం పెరిగిపోయాయి.. మందులు, నిర్మాణ సామగ్రి ధరలు కూడా చుక్కలను తాకుతున్నాయి. ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ తీసుకుని సరుకులు తెచ్చే బ్లింకిట్‌, జెప్టో వంటి ప్లాట్‌ఫామ్‌లలోనూ ఆరు నుంచి తొమ్మిది శాతం వరకు ధరలు పెరిగాయి. స్విగ్గీ, జొమాటో వంటి ఫుడ్‌ యాప్‌లలో ధరలు చూస్తేనే ఆకలి చచ్చిపోయేలా మారిపోయాయి. ఇదంతా కేవలం గత నెలరోజుల్లో వచ్చిన మార్పు. హోర్ముజ్‌ జలసంధి మూతపడటం, సరఫరా వ్యవస్థలకు ఆటంకాలు ఏర్పడడంతో ఒక్కసారిగా ధరలకు రెక్కలు వచ్చాయి. ఒకదానికి ఏర్పడిన కొరత, పెరిగిన ధర మరోదానిపై, ఇంకోదానిపై ఒక గొలుసులా ప్రభావం చూపుతూ.. అన్ని రకాల వస్తుసామగ్రి ధరలు పెరిగిపోయాయి. ఈ ధరాభారంతో సామాన్యులు విలవిల్లాడుతున్నారు. జీవన వ్యయం పెరిగిపోయి ఇబ్బందులు పడుతున్నారు. ఎలక్ట్రానిక్, గృహోపకరణాల తయారీ సంస్థలు ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు నాలుగు నెలల్లోనే మూడు సార్లు ధరలు పెంచాయి. రాగి, అల్యూమినియం ధరలు, విడిభాగాల వ్యయం పెరగడం, సెమీకండక్టర్‌ చిప్‌ల కొరత, ముడిసరకు ధరలు పెరగడం, పశ్చిమాసియా ఉద్రిక్తతలతో ఈ ప్రభావం పడింది. ఫోన్ల ధరలు 10-20 శాతం వరకు పెరిగాయి. గతంలో రూ.15వేలు ఉన్న ఫోన్‌ను ఇప్పుడు రూ.18 వేల వరకు విక్రయిస్తున్నారని వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒప్పో సంస్థ మోడళ్లను బట్టి రూ.2-3 వేలు ధరలు పెంచింది. వన్‌ప్ల్‌స, మోటోరోలా, నతింగ్‌, రెడ్‌మీ ఫోన్ల ధరలూ 15 శాతం వరకు పెరిగాయి. రియల్‌మీ సంస్థ రూ.500 నుంచి రూ.1,500 వరకు పెంచింది. మధ్యస్థాయి (రూ.15 వేల నుంచి రూ.30 వేలలోపు) ఫోన్ల ధరల పెరుగుదల ఎక్కువగా ఉందని.. ర్యామ్‌, మెమరీ చిప్‌ల ధరలు 50-60 శాతం పెరగడం ప్రభావం చూపిందని విక్రేతలు చెబుతున్నారు.


  • చాలా వరకు ఏసీలు ధరలు 7 నుంచి 15 శాతం వరకు పెరిగాయి. గత ఏడాది రూ.32-34వేల మధ్య లభించిన ఏసీలు ఇప్పుడు రూ.40 వేల వరకు చేరాయి. వాషింగ్‌ మెషీన్లు, రిఫ్రిజిరేటర్ల ధరలు 8-15 శాతం వరకు పెంచారు. కుక్కర్లు, గ్రైండర్లు, వంటగదిలో వినియోగించే ఇతర ఎలకా్ట్రనిక్‌ పరికరాలు 5 నుంచి 7 శాతం వరకు భారంగా మారాయి.

  • టీవీలపైనా 5 శాతం నుంచి 10 శాతం వరకు భారం పడింది. కొన్ని నెలల క్రితం 32 అంగుళాల టీవీలు రూ.6,500 నుంచి రూ.8,500 మధ్య లభించగా.. ఇప్పుడు రూ.10 వేల వరకు చెల్లించాల్సి వస్తోంది.

  • ప్రస్తుత ఇబ్బందులకు తోడు వేసవి డిమాండ్‌ తోడవడంతో ఎయిర్‌కూలర్ల ధరలు 15శాతానికిపైగా పెరిగాయి. మోటార్లు, ప్లాస్టిక్‌, రవాణా ఖర్చులు పెరగడమే దీనికి కారణమని తయారీ సంస్థలు చెబుతున్నాయి.

  • తాజాగా టెలికం సంస్థలు కూడా టారిఫ్‌లను 20శాతందాకా పెంచాయి. తక్కువ ధరకు అందుబాటులో ఉన్న కొన్ని రీచార్జి ప్లాన్లను తొలగించాయి.

760 రకాల మందుల ధరల్లో మార్పు

జాతీయ ఔషధ ధరల సంస్థ (ఎన్‌పీపీఏ) గణాంకాల ప్రకారం.. ఏప్రిల్‌ 1 నుంచి దేశంలో తరచూ ఉపయోగించే 760 రకాల మందుల ధరలు పెరిగాయి. పారాసిటమాల్‌, మెట్‌ఫార్మిన్‌, ఇన్సూలిన్‌ వంటి మధుమేహం, రక్తపోటు మందులతోపాటు యాంటీబయాటిక్స్‌ రేట్లు కూడా భారంగా మారాయి. అమోక్సిసిలిన్‌ ధర ఏకంగా 43శాతం పెరిగింది. పాట్‌క్లావ్‌ 32 శాతం, సెఫిక్సిమ్‌ 20 శాతం, సెఫ్ట్రియాక్సోన్ 32 శాతం, అజిత్రోమైసిన్‌ 15 శాతం, సిప్రొప్లొక్సాసిన్‌ 31 శాతం, రాబిప్రజోల్‌ 27 శాతం, డైక్లోఫెనాక్‌ 38 శాతం, పారాసిటమాల్‌ 92 శాతం, గ్లిజరిన్‌ 43 శాతం పెరిగాయి. చాలావరకు మందుల తయారీకి అవసరమైన ముడిసరుకు పెట్రోలియం ఉత్పత్తుల నుంచే వస్తుందని.. ఇప్పుడా ముడిసరుకు రవాణాకు ఇబ్బందులతో భారాన్ని కొనుగోలుదారులపై వేస్తున్నారని మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి. మందుల సీసాలు, అల్యూమినియం ఫాయిల్స్‌, ప్లాస్టిక్‌ ప్యాకేజీ ధరలు 80-100 శాతం వరకు పెరగడం కూడా మందుల ధరలపై ప్రభావం చూపినట్టు పేర్కొంటున్నాయి.


నిర్మాణం.. మరింత ప్రియం

నిర్మాణ సామాగ్రి ధరలు పెరగడం వల్ల ఇళ్ల నిర్మాణం మరింత భారంగా మారిందని రియల్టర్లు వాపోతున్నారు. గత ఏడాదితో పోల్చితే ఉక్కు ధర 15-35 శాతం వరకు, సిమెంట్‌ ధర 10 శాతం వరకు పెరిగాయని చెబుతున్నారు. యూపీవీసీ, రెడీ మిక్స్‌ కాంక్రీట్‌ ధరలు 25శాతం వరకు భారంగా మారాయి. బీరువాలు, టేబుళ్లు, మంచాలు, ఇతర ఫర్నిచర్‌ ధరలు 10శాతానికిపైగా పెరగడం గమనార్హం.

గ్యాస్‌ దెబ్బతో తిండికీ ధరాభారం

పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో దేశంలో వంటగ్యాస్‌ (ఎల్పీజీ)కి కొరత ఏర్పడింది. అవసరమైన స్థాయిలో సరఫరా లేక చాలా వరకు హోటళ్లు, చిరుతిళ్ల వ్యాపారులు వారంలో కొన్ని రోజులే నడిపిస్తున్నారు. గ్యాస్‌ కొరతను కొందరు డీలర్లు, డెలివరీ బాయ్స్‌ సొమ్ము చేసుకుంటున్నారు. హోటళ్లు, రెస్టారెంట్లు, కేటరింగ్‌ యూనిట్లు, మెస్‌లకు బ్లాక్‌లో అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ఒక్కో వాణిజ్య సిలిండర్‌కు రూ.3 వేల నుంచి రూ.5వేల వరకు వసూలు చేస్తున్నారు. అదే సమయంలో నేరుగా ప్రయత్నించే వారికి మాత్రం సిలిండర్లు స్టాక్‌ లేవని చెబుతున్నారు. దీనితో చాలా మంది వ్యాపారులు అడ్డగోలు ధరకు గ్యాస్‌ కొనుగోలు చేయాల్సి వస్తోందంటూ.. ఆహారం ధరలు పెంచేశారు. గతంలో రూ.120 ఉన్న ఒక ప్లేటు భోజనం ధరను రూ.130కు, రూ.40 ఉన్న ప్లేట్‌ ఇడ్లీని రూ.50కి, రూ.45 ఉన్న దోశ ధరను రూ.60కి పెంచారు. మిర్చీలు, బజ్జీలు వంటి వాటి ధరలూ ప్లేటుకు రూ.10 పెంచేశారు. దీనితో సాధారణ వినియోగదారులపై భారం పడుతోంది. వాణిజ్య సిలిండర్ల సరఫరాపై పౌర సరఫరాల శాఖ అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతోనే కొందరు డీలర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.

Updated Date - Apr 22 , 2026 | 06:22 AM