రోడ్లకు ‘ఐ-పేవ్’ స్కానింగ్
ABN , Publish Date - Nov 20 , 2026 | 05:10 AM
మ్యాగ్నటిక్ రెసోసెన్స్ ఇమేజ్ (ఎంఆర్‌ఐ).. మానవ శరీరంలోని అంతర్గత అవయవాల స్థితి, పనితీరును గుర్తించేందుకు నిర్వహించే పరీక్ష..
అధునాతన సాంకేతికతతో రహదారుల నాణ్యత గుర్తింపు
ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్ సదస్సులో ఏఆర్‌ఆర్‌బీ సిస్టమ్స్ ప్రత్యేక స్టాల్
దేశంలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే 1,000 కి.మీల రోడ్లకు పరీక్షలు
రోడ్ల నాణ్యత గుర్తింపుతో ప్రజాధనం ఆదా: ఏఆర్‌ఆర్‌బీ ప్రతినిధి ఆనంద్‌కుమార్
హైదరాబాద్ సిటీ, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): మ్యాగ్నటిక్ రెసోసెన్స్ ఇమేజ్ (ఎంఆర్‌ఐ).. మానవ శరీరంలోని అంతర్గత అవయవాల స్థితి, పనితీరును గుర్తించేందుకు నిర్వహించే పరీక్ష. ఇదే తరహాలో రోడ్ల పరిస్థితిని తెలుసుకునే అధునాతన సాంకేతిక పరిజ్ఞానం మనదేశంలో అందుబాటులోకి వచ్చింది.. అదే ఇంటెలిజెంట్ పేవ్‌మెంట్ అసె్‌సమెంట్ వెహికిల్ (ఐ-పేవ్). ఇది రహదారి ఉపరితలం నుంచి లోపలి ప్రతి పొర స్థితి, పటిష్టతను గుర్తిస్తుంది. అడ్వాన్స్‌డ్ డాప్లర్ లేజర్ సెన్సార్లు, ఇతర పరికరాలతో కూడిన వాహనం రోడ్డుపై ప్రయాణిస్తూ ఆ రహదారి సమగ్ర స్వరూపాన్ని అంచనా వేస్తుంది. ఇండియన్ రోడ్ కాంగ్రెస్ (ఐఆర్‌సీ) 85వ వార్షిక సదస్సులో స్టాల్ ఏర్పాటు చేసిన ఏఆర్‌ఆర్‌బీ సిస్టమ్స్ ప్రతినిధులు.. ఐ-పేవ్ పనితీరును వివరించారు.
ఐ-పేవ్‌ను బహుళ ప్రయోజనకరంగా ఉపయోగించుకోవచ్చు. ఇప్పటికే ఉన్న రహదారుల స్థితిని మాత్రమే కాకుండా.. కొత్తగా నిర్మిస్తున్న రోడ్ల నాణ్యతను కూడా దీనితో పరీక్షించవచ్చు. రహదారి నిర్మాణంలో ఐఆర్‌సీ ప్రమాణాల ప్రకారం మెటీరియల్ వినియోగించారా..? నాణ్యత ఎలా ఉంది? అనే అంశాలను ఈ వాహనం గుర్తిస్తుంది. కొత్తగా నిర్మించిన రోడ్లపై ప్రస్తుతం 500 మీటర్లకు ఒక చోట నమూనా సేకరించి నాణ్యతా పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే, అధికారులు, కాంట్రాక్టర్లు కుమ్మక్కై ఎక్కడ నమూనాలు తీసుకోవాలో ముందే నిర్ధారించి.. ఆ ప్రాంతంలో కొంత నాణ్యతతో నిర్మాణ పనులు చేపడుతున్నారు.
ఇంజనీరింగ్ అధికారులు, కొన్ని థర్ట్ పార్టీ ఏజెన్సీలు నమూనాలు సేకరించి ఇస్తున్న క్వాలిటీ కంట్రోల్ నివేదికలపైనా అనుమానాలున్నాయి. ఐ-పేవ్ స్కానింగ్‌తో ఈ అవకతవకలకు ఆస్కారం ఉండదు. ఈ సాంకేతికతతో గుర్తించిన అంశాల ఆధారంగా కృత్రిమ మేధ ద్వారా అప్పటికప్పుడు నివేదిక సిద్ధమవుతుంది. మానవ ప్రమేయం లేకుండా రూపొందే ఈ నివేదికను సంబంధిత విభాగాలకు అందజేస్తారు. దీని ఆధారంగానే కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిస్తే.. పనుల్లో నాణ్యత, ఎక్కువ కాలం మన్నికగా ఉంటాయని సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు.
వెయ్యి కిలోమీటర్ల నమూనా సర్వే..
కేంద్ర రోడ్డు రవాణా శాఖ సూచన మేరకు ఏఆర్‌ఆర్‌బీ దేశంలోని ఐదు రీజియన్లలో ఒక్కోచోట 200 కిలోమీటర్ల చొప్పున 1,000 కి.మీల మేర రహదారుల సమగ్ర డేటాను సేకరించింది. ఢిల్లీ- ఆగ్రా, ఢిల్లీ-వడోదరా, నాగ్‌పూర్, ఆంధ్రప్రదేశ్, ఒడిశాలలోని పలు జాతీయ రహదారులపై సర్వే చేసినట్టు సంస్థ తెలిపింది. రోడ్ల స్థితి, లోపాలు, వాటి జీవిత కాలాన్ని నిర్ధారిస్తూ కేంద్రానికి నివేదిక సమర్పించింది. దీనిని సర్టిఫై చేసే బాధ్యతను సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (సీఆర్‌ఆర్‌ఐ)కు కేంద్ర రోడ్డు రవాణా శాఖ అప్పగించింది.
రోడ్ల నాణ్యత గుర్తింపులో కీలకం
రహదారుల పూర్తి డేటా ప్రభుత్వ విభాగాల వద్ద ఉండటం కీలకం. రోడ్ల నాణ్యత, జీవితకాలం, మరమ్మతు చేయాల్సిన అవసరాన్ని ఐ-పేవ్ ద్వారా ఎప్పటికప్పుడు గుర్తించవచ్చు. ఐ-పేవ్ వాహనం గంటకు 80 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ కూడా రోడ్డు నాణ్యతను గుర్తిస్తుంది. దీనివల్ల సాధారణ ట్రాఫిక్‌కు ఇబ్బంది ఉండదు. ఆసియా ఖండం మొత్తానికి సంబంధించి మేము హైదరాబాద్‌లో కార్యాలయం ప్రారంభించాం. ఇక్కడే గ్లోబల్ డేటా సెంటర్ కూడా ఏర్పాటు చేస్తాం. తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. దేశంలో 6.5 లక్షల కిలోమీటర్ల మేర జాతీయ, రాష్ట్ర రహదారులున్నాయి. వీటి నిర్మాణం, నిర్వహణ మెరుగుపర్చడం ద్వారా కోట్లాది రూపాయల ప్రజాధనం ఆదా అవుతుంది.
- ఆనంద్‌కుమార్,
చీఫ్ బిజినెస్ ఆఫీసర్,
ఏఆర్‌ఆర్‌బీ సిస్టమ్స్
ఇవి కూడా చదవండి...
‘క్రమశిక్షణ ముందు అందరూ సమానమే’.. రాజ్‌గోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై మహేశ్ రియాక్షన్
నాపై ఆరోపణలు చేసేవారు చట్టాన్ని ఎదుర్కోవాల్సిందే: వీసీ సజ్జనార్
Read latest Telangana News And Telugu NEws