పెరుగు తెచ్చిన లొల్లి.. వివాహిత అదృశ్యం..
ABN , Publish Date - Apr 18 , 2026 | 08:40 AM
హైదరాబాద్ కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు శంషిగూడలో ఓ కుటుంబం నివాసం ఉంటోంది. భార్య కొంచెం సన్నగా ఉండడం భర్తకు నచ్చలేదు. దీంతో బరువు పెరగాల్సిందిగా ఆమెను కోరాడు. అయితే..
హైదరాబాద్: నగరంలోని ఓ కుటుంబంలో పెరుగు చిచ్చుపెట్టింది. పెరుగు కారణంగా వివాహిత అదృశ్యం అయ్యింది. అదేంటని అనుకుంటున్నారా..?. మీరు విన్నది నిజమే.. భార్యాభర్తల మధ్య పెరుగు గురించి వచ్చిన వివాదం చివరికి ఆమెను ఇంటి నుంచి వెళ్లిపోయేలా చేసింది. దీంతో కూకట్‌పల్లి పోలీసులను భర్త ఆశ్రయించాడు. చిన్న విషయానికే మహిళ ఇంటి నుంచి వెళ్లిపోవడంతో పోలీసులు షాక్ అయ్యారు.
అసలేం జరిగిందంటే..
కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు శంషిగూడలో సదరు కుటుంబం కొన్నేళ్లుగా నివాసం ఉంటోంది. భార్యాభర్తలిద్దరికీ మూడేళ్ల కిందట వివాహం అయ్యింది. అయితే, భార్య కొంచెం సన్నగా ఉండడం భర్తకు నచ్చలేదు. దీంతో బరువు పెరగాల్సిందిగా ఆమెను కోరాడు. పెరుగు తింటే లావుగా అవుతారని సోషల్ మీడియాలో ఓ వీడియో చూసిన అతను అదే విషయాన్ని భార్యకు చెప్పాడు.
నిజానికి సదరు మహిళకు పాలు, పాల పదార్థాలు అంటే అస్సలు నచ్చదు. ఒక్క ముద్ద కూడా మింగుడు పడదు. ఆ విషయాన్నే అతనికి చెప్పింది. దీనిపై పలుమార్లు వారి మధ్య చిన్నపాటి మాటల యుద్ధం జరిగింది. ఇటీవల మరోసారి పెరుగు తినాల్సిందిగా ఆమెను భర్త కోరాడు. తీవ్ర మనస్తానం, ఆగ్రహానికి గురైన సదరు వివాహిత.. భర్త లేని సమయంలో ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఆఫీసు నుంచి భర్త ఇంటికి వచ్చిన తర్వాత ఆమె కనిపించలేదు. ఇంటి చుట్టుపక్కల ప్రాంతాలు వెతికినా జాడ తెలియలేదు.
చేసేదేమీ లేక అతను కూకట్‌పల్లి పోలీసులను ఆశ్రయించాడు. పెరుగు విషయంలో వివాదం వచ్చి ఇంటి నుంచి వెళ్లిపోయిందని చెప్పడంతో పోలీసులు సైతం కంగు తిన్నారు. బాధితుడి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే, పెరుగుతో ఇంతటి వివాదం చెలరేగడంతో చర్చనీయాంశంగా మారింది.
ఈ వార్తలు కూడా చదవండి
కాంగ్రెస్ నాయకులను తరిమికొట్టండి
30 లక్షల టన్నుల ఉప్పుడు బియ్యం సేకరించండి