Share News

కాంగ్రెస్‌ నాయకులను తరిమికొట్టండి

ABN , Publish Date - Apr 18 , 2026 | 05:06 AM

మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ల కోసం కేంద్రం ప్రవేశపెట్టిన రాజ్యాంగ సవరణ బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్‌కు వారి ...

కాంగ్రెస్‌ నాయకులను తరిమికొట్టండి

  • మహిళలకు రాంచందర్‌రావు పిలుపు

  • కాంగ్రెస్‌ వక్రబుద్ధి మరోసారి బయటపడింది: కిషన్‌రెడ్డి

  • ప్రజాస్వామ్యానికి చీకటి రోజు: బండి సంజయ్‌

హైదరాబాద్‌, న్యూఢిల్లీ, కరీంనగర్‌, ఏప్రిల్‌ 17 (ఆంధ్రజ్యోతి): మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ల కోసం కేంద్రం ప్రవేశపెట్టిన రాజ్యాంగ సవరణ బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్‌కు వారి ఉసురు తగిలి తీరుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రాంచందర్‌రావు స్పష్టం చేశారు. లోక్‌సభలో శుక్రవారం జరిగిన ఘటన చరిత్రలో బ్లాక్‌ డేగా మిగిలిపోతుందన్నారు. ఈ సవరణ బిల్లును వ్యతిరేకించినందుకుగాను రాష్ట్ర మహిళలు కాంగ్రెస్‌ నాయకులను తరిమికొట్టాలని రాంచందర్‌రావు పిలుపునిచ్చారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని మోదీ సామాన్య మహిళలకు రాజకీయ అధికారం కల్పించేందుకు ప్రయత్నం చేస్తే కాంగ్రెస్‌ పార్టీ వ్యతిరేకించి వారికి అన్యాయం చేసిందని మండిపడ్డారు. ఇందుకుగాను మహిళలు ఆ పార్టీని శిక్షించాలని విజ్ఞప్తి చేశారు. ముస్లిం మహిళలకు రిజర్వేషన్‌ లేదన్న కారణంతో మహిళా రిజర్వేషన్‌ బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు రాహుల్‌ ప్రకటించడం దారుణమని అన్నారు. మహిళా బిల్లును అడ్డుకోవడం ద్వారా కాంగ్రెస్‌ మరోసారి తన వక్రబుద్ధిని బయట పెట్టుకుందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. ‘‘దేశ ప్రజాస్వామ్య చరిత్రలో ఇది చీకటి రోజు... దేశ ప్రయోజనాలు, ముఖ్యంగా మహిళా సాధికారత విషయంలో భేదాభిప్రాయాలను పక్కనపెట్టి, కలసికట్టుగా ముందుకు సాగాల్సిన సందర్భంలో.. కాంగ్రెస్‌ పార్టీ, వారి మిత్రులంతా కలిసి స్వార్థపూరిత వైఖరితో గొప్ప లక్ష్యాన్ని నీరు గార్చారు.. కాంగ్రెస్‌ పార్టీ తన నిజ స్వరూపాన్ని, దేశ అభివృద్ధికి, మహిళా సాధికారతపై తన వ్యతిరేకతను మరోసారి బట్టబయలు చేసుకుంది.. తమ సాధికారతకు మోకాలడ్డుతున్న తీరుకు మహిళలు కచ్చితంగా తగిన బుద్ధి చెబుతారు’’ అని పేర్కొన్నారు. భారత ప్రజాస్వామ్యానికి ఏప్రిల్‌ 17 చీకటి రోజు అని కేంద్ర మంత్రి బండి సంజయ్‌కుమార్‌ తెలిపారు. దేశంలోని ప్రతి తల్లి, అక్కాచెల్లెళ్లు, కుమార్తెలకు అవమానం జరిగిన రోజని ఆవేదన వ్యక్తం చేశారు.


మహిళా బిల్లును అడ్డుకున్న పార్టీలన్నీ కుటుంబ పార్టీలే అన్నారు. డూప్లికేట్‌ గాంధీ, స్టాలిన్‌, అఖిలేష్‌ కుటుంబాల మహిళలకు మాత్రమే పదవులుండాలా... అని ప్రశ్నించారు. కాగా రిజర్వేషన్ల అమలు వల్ల మహిళలు ఆత్మగౌరవంతో, ఆత్మ విశ్వాసంతో రాజకీయాల్లో రాణించగలరని బీజేపీ ఎంపీ డీకే అరుణ అన్నారు. శుక్రవారం లోక్‌సభలో 131వ బిల్లులపై చర్చ సందర్భంగా డీకే అరుణ మాట్లాడారు. చట్టసభల్లోకి మహిళలు రావడం దేశ ప్రగతికి అవసరమని అన్నారు. చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లకు రాజ్యాంగ సవరణ బిల్లును విపక్షాలు అడ్డుకోవడం వారి హక్కులపై గొడ్డలిపెట్టు అని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌ స్పష్టం చేశారు. ‘‘రాజకీయ లబ్ధి కోసమే ఈ బిల్లును అడ్డుకున్నారు. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షా సమాధానాలను విపక్షాలు పట్టించుకోలేదు. వచ్చే ఎన్నికల్లో ఇండి కూటమికి మహిళలు గుణపాఠం చెప్పడం ఖాయం.’’ అని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

నేడు సీఎం రేవంత్‌ ఇంటి వద్ద బీజేపీ నిరసన

మహిళా రిజర్వేషన్లను కాంగ్రెస్‌ అడ్డుకున్నందుకు నిరసనగా శనివారం జూబ్లీహిల్స్‌లోని సీఎం రేవంత్‌ రెడ్డి నివాసం వద్ద ఆందోళన చేపట్టనున్నట్లు బీజేపీ ప్రకటించింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావుతో పాటు నాయకులు, కార్యకర్తలు నిరసనలో పాల్గొంటారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.

Updated Date - Apr 18 , 2026 | 05:07 AM