Share News

జాతీయ విపత్తును నివారించిన రోజు

ABN , Publish Date - Apr 18 , 2026 | 05:04 AM

లోక్‌సభలో 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోవడంపై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ నాయకత్వంలో, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ....

జాతీయ విపత్తును నివారించిన రోజు

  • నల్ల బిల్లులను అడ్డుకునేందుకు ఐక్యంగా పోరాడిన ప్రతిపక్షాలు: రేవంత్‌

  • చరిత్రలో కీలక ఘట్టం: పొంగులేటి

  • ఎన్నికల్లో లబ్ధి కోసమే బిల్లులు: పొన్నం

  • బీజేపీ కుట్రల్ని అడ్డుకున్నాం: మహేశ్‌గౌడ్‌

హైదరాబాద్‌/న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 17 (ఆంధ్రజ్యోతి): లోక్‌సభలో 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోవడంపై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ నాయకత్వంలో, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆధ్వర్యంలో అన్ని ప్రజాస్వామిక శక్తులు, ప్రతిపక్ష నాయకులు ఐక్యంగా నిలిచి ఒక జాతీయ విపత్తును నివారించారని అన్నారు. ఈ రోజు చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోయే రోజు అని ‘ఎక్స్‌’లో రేవంత్‌ పేర్కొన్నారు. ఈ నల్ల బిల్లులను ఓడించేందుకు అగ్నిపరీక్ష లాంటి పరిస్థితుల్లోనూ ఐక్యంగా నిలిచి పోరాడిన వివిధ మిత్రపక్షాల నాయకులకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని చెప్పారు. ఎంకే స్టాలిన్‌, మమతా బెనర్జీ, అఖిలేష్‌ యాదవ్‌, శరద్‌ పవార్‌, ఉద్దవ్‌ ఠాక్రే, లాలూప్రసాద్‌ యాదవ్‌, హేమంత్‌ సోరెన్‌, ఫరూక్‌ అబ్దుల్లా, నవీన్‌ పట్నాయక్‌, అరవింద్‌ కేజ్రీవాల్‌, కమ్యూనిస్టు పార్టీల నేతలకు రేవంత్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. కాగా, 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోవడం ప్రజాస్వామ్య చరిత్రలో కీలక ఘట్టంగా నిలిచిపోతుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడే శక్తులు ఏకమైతే ఎలాంటి దురుద్దేశపు చట్టాలనైనా అడ్డుకోవచ్చని ఈ పరిణామం రుజువు చేసిందని శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మహిళా రిజర్వేషన్‌ బిల్లును అమలు చేయాలనే చిత్తశుద్ధి బీజేపీ ప్రభుత్వానికి లేదని మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. ఫలితంగానే పార్లమెంట్‌లో మహిళా బిల్లు వీగిపోయిందన్నారు. మహిళా రిజర్వేషన్‌లో ఓబీసీ రిజర్వేషన్‌ అమలు చేయాలని తమ పార్టీ డిమాండ్‌ చేసిందని చెప్పారు. సంపన్నులే కాకుండా సామాన్య మహిళలు రాజకీయాల్లోకి రావాలనేదే కాంగ్రెస్‌ పార్టీ ఉద్దేశమన్నారు. కానీ, తమ డిమాండ్లను పట్టించుకోకుండా కేంద్రం మొండిగా వ్యవహరించిందని ఆరోపించారు. పశ్చిమ బెంగాల్‌, తమిళనాడు ఎన్నికల్లో రాజకీయ లబ్ధి కోసమే బీజేపీ ఈ బిల్లులు తెరపైకి తెచ్చిందన్నారు.


బీజేపీ కపటనీతి బట్టబయలు..

మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు డీలిమిటేషన్‌ అంశాన్ని జోడించి బీజేపీ కుట్రపూరిత రాజకీయం చేసిందని మంత్రి సీతక్క ఆరోపించారు. పార్లమెంటులో శుక్రవారం జరిగిన పరిణామాలు బీజేపీ కపటనీతిని బట్ట బయలుచేశాయన్నారు. ఎలాంటి షరతులు లేకుండా తక్షణమే మహిళా రిజర్వేషన్లను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. కాగా, లోక్‌సభలో 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోవడం ప్రజాస్వామ్య రాజ్యాంగ విజయమని టీపీసీసీ అధ్యక్షుడు బి.మహేశ్‌కుమార్‌గౌడ్‌ తెలిపారు. చట్టవిరుద్ధంగా డీ లిమిటేషన్‌ బిల్లును తేవడానికి బీజేపీ చేసిన కుట్రలను కాంగ్రెస్‌ అడ్డుకుందన్నారు. ఉత్తరాది రాష్ట్రాలకు ఎక్కువ సీట్లు పెంచుకొని రాజకీయ లబ్ధి పొందడానికి వేసిన ఎత్తుగడ దెబ్బతిన్నదని, బీజేపీ ప్రభుత్వ నియంత పోకడలకు అడ్డుకట్ట పడిందని పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా కులగణన చేసిన తర్వాత చట్ట సవరణ చేయాలనే కాంగ్రెస్‌ డిమాండ్‌ నెగ్గిందన్నారు. 2023లో ఆమోదం పొందిన మహిళా బిల్లు అమలు కోసం బీజేపీపై ఒత్తిడి తెచ్చేందుకు కాంగ్రెస్‌ ఉద్యమిస్తుందని తెలిపారు.

Updated Date - Apr 18 , 2026 | 05:04 AM