Share News

హైదరాబాద్ వాహనదారులకు అలర్ట్.. ట్రాఫిక్ మళ్లింపు..

ABN , Publish Date - Jul 18 , 2026 | 09:32 PM

భాగ్యనగరంలో శనివారం నుంచి నాలుగు రోజుల పాటు పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. నల్గొండ ఎక్స్ రోడ్స్-ఒవైసీ జంక్షన్ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ పనులను వేగవంతం చేసేందుకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు అమలు చేస్తున్నారు.

హైదరాబాద్ వాహనదారులకు అలర్ట్.. ట్రాఫిక్ మళ్లింపు..
Hyderabad Traffic Restrictions

హైదరాబాద్: భాగ్యనగరంలో శనివారం నుంచి నాలుగు రోజుల పాటు పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. నల్గొండ ఎక్స్ రోడ్స్-ఒవైసీ జంక్షన్ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ పనులను వేగవంతం చేసేందుకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు అమలు చేస్తున్నారు. ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ పనుల కారణంగా సైదాబాద్, చంచల్‌గూడ, చంద్రాయణగుట్ట, ఐఎస్ సదన్ పరిసరాల్లో వాహనాల రాకపోకలపై పరిమితులు విధించారు. దీంతో వాహనదారులు ముందస్తుగా ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని పోలీసులు సూచించారు.


ట్రాఫిక్ ఆంక్షల్లో భాగంగా సైదాబాద్ వై జంక్షన్ నుంచి యాదగిరి థియేటర్ వైపు వెళ్లే రోడ్డును ఒకవైపు మూసివేశారు. నల్గొండ ఎక్స్ రోడ్ నుంచి ఒవైసీ ఆస్పత్రి వైపు ప్రయాణించవద్దని అధికారులు స్పష్టం చేశారు. నల్గొండ ఎక్స్ రోడ్ నుంచి చంద్రాయణగుట్ట వైపు వెళ్లే నాలుగు చక్రాల వాహనాలు, ఆర్టీసీ బస్సులు, భారీ వాహనాలను సైదాబాద్ వై జంక్షన్ వద్ద మళ్లిస్తున్నారు. ఈ వాహనాలు డీసీపీ ఈస్ట్ జోన్ కార్యాలయం, శంకేశ్వర్ బజార్, సింగరేణి కాలనీ మీదుగా చంపాపేట్ వైపు వెళ్లాల్సి ఉంటుంది. అదేవిధంగా చంద్రాయణగుట్ట నుంచి నల్గొండ ఎక్స్ రోడ్ వైపు వచ్చే నాలుగు చక్రాల వాహనాలు, ఆర్టీసీ బస్సులు, భారీ వాహనాలను డీఎంఆర్‌ఎల్ జంక్షన్ వద్ద దారి మళ్లిస్తున్నారు. ఈ వాహనాలు లక్ష్మారెడ్డి గార్డెన్, చంపాపేట్, ఐఎస్ సదన్, శంకేశ్వర్ బజార్, చంచల్‌గూడ మీదుగా గమ్యస్థానాలకు చేరుకోవాల్సి ఉంటుంది.


ఎంజీబీఎస్, చాదర్‌ఘాట్ ప్రాంతాల నుంచి ఐఎస్ సదన్, చంపాపేట్ వైపు వెళ్లే జిల్లా ఆర్టీసీ బస్సులు, భారీ వాహనాలను కూడా నల్గొండ ఎక్స్ రోడ్ వద్ద మళ్లిస్తున్నారు. ఈ వాహనాలు మలక్‌పేట్ గంజ్, మూసారాంబాగ్, దిల్‌సుఖ్‌నగర్, కొత్తపేట్, ఎల్బీనగర్ చౌరస్తా మీదుగా ప్రయాణించాలని సూచించారు. ద్విచక్ర, త్రిచక్ర వాహనాల సౌకర్యార్థం చంచల్‌గూడ-సైదాబాద్ వై జంక్షన్ మధ్య ఎడమవైపు రహదారిని తాత్కాలికంగా టూ-వేగా మార్చారు. యాదగిరి థియేటర్ రోడ్డును వినియోగించి, అక్కడి నుంచి ఉప రహదారుల ద్వారా గమ్యస్థానాలకు చేరుకోవాలని పోలీసులు సూచించారు. రద్దీని దృష్టిలో ఉంచుకుని సూచించిన లేన్లలోనే వాహనదారులు ప్రయాణించాలని, ఆంక్షల అమలుకు సహకరించాలని ట్రాఫిక్ పోలీసులు విజ్ఞప్తి చేశారు. ప్రయాణానికి ముందు మార్గాలను పరిశీలించి, అవసరమైతే ప్రత్యామ్నాయ రూట్లను ఎంచుకోవడం వల్ల సమయం ఆదా కావడంతో పాటు ట్రాఫిక్ ఇబ్బందులు తగ్గుతాయని పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి

దేశ అంతరిక్ష కలలకు చిరునామాగా తెలంగాణ: సీఎం రేవంత్ రెడ్డి

గంజాయి పండిస్తున్న సాధువు.. అరెస్ట్ చేసిన పోలీసులు

Updated Date - Jul 18 , 2026 | 09:37 PM