హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు..
ABN , Publish Date - Apr 10 , 2026 | 08:53 PM
హైదరాబాద్‌లోని మెహిదీపట్నం రైతుబజార్, బస్ స్టాప్ ప్రాంతంలో జరుగుతున్న స్కైవాక్ నిర్మాణ పనులను వేగవంతం చేసే క్రమంలో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే..
హైదరాబాద్, ఏప్రిల్ 10: మెహిదీపట్నం రైతుబజార్, బస్ స్టాప్ ప్రాంతంలో జరుగుతున్న స్కైవాక్ (Skywalk) నిర్మాణ పనులను వేగవంతం చేసే క్రమంలో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ట్రాఫిక్ రద్దీని నివారించడానికి, ప్రయాణీకుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ వారాంతంలో ట్రాఫిక్ మళ్లింపులను అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. వాహనల రాకపోకలకు ఇబ్బంది కలగకుండా ఈ ఆంక్షలు 10,11 ఏప్రిల్ అర్ధరాత్రి 12 గంటల నుంచి శనివారం ఉదయం 6 గంటల వరకు అమలులో ఉంటాయి. మాసబ్ ట్యాంక్, ఎన్ఎండిసి, ఎస్.డి కంటి ఆసుపత్రి వైపు నుంచి రేతిబౌలి-నానల్ నగర్ వైపు వెళ్లే వాహనాలను అజీజియా మసీదు వద్ద గల పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్‌వే పిల్లర్ నెం. 2,3 వద్ద మళ్లిస్తారు. ప్రత్యామ్నాయ మార్గంగా మళ్లించిన వాహనాలు మెరాజ్ కేఫ్ వద్ద కుడి వైపునకు తిరిగి, మెహిదీపట్నం పిల్లర్ నెం.15 వద్ద తిరిగి ప్రధాన మార్గంలోకి చేరుకోవాల్సి ఉంటుంది.
ప్రయాణీకులకు విజ్ఞప్తి:
ఈ మేరకు నగరవాసులకు జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్, ట్రాఫిక్ డి. జోయల్ డేవిస్ పలు సూచనలు చేశారు. ‘ఎప్పటికప్పుడు తాజా ట్రాఫిక్ సమాచారం కోసం హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ అధికారిక ఫేస్‌బుక్ పేజీ లేదా ఎక్స్ (ట్విట్టర్) హ్యాండిల్ @HYDTP ను అనుసరించాలి. ప్రయాణంలో ఏదైనా సమస్య ఎదురైనా లేదా అత్యవసర సహాయం కావాలన్నా ట్రాఫిక్ హెల్ప్‌లైన్ నంబర్: 9010203626కు కాల్ చేయవచ్చు. నగర ప్రజలు, వాహనదారులు ఈ తాత్కాలిక మళ్లింపులను గమనించి, పోలీసులకు సహకరించాలి. స్కైవాక్ నిర్మాణ పనుల వల్ల సామాన్య ప్రజలకు కలిగే అసౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని, వాహనదారులు తమ గమ్య స్థానాలకు త్వరగా చేరుకోవడానికి వీలుగా ప్రత్యామ్నాయ మార్గాలను ప్లాన్ చేసుకోండి’ అని సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి
భోగాపురం విమానాశ్రయం.. ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారు
వైసీపీ నేతలది గుంట నక్కల రాజకీయం: కేంద్ర మంత్రి రామ్మోహన్