గుండు గీయించుకుని పూజారిగా మారాడు.. కట్ చేస్తే పెద్ద క్రైమ్ లిస్టే బయటపడింది!
ABN , Publish Date - May 29 , 2026 | 09:27 AM
అతడు హత్యలు, హత్యాయత్నం, వంటి 21 కేసుల్లో నిందితుడు. 16 ఏళ్ల క్రితం అన్నను చంపి జైలుకెళ్లాడు. తర్వాత పెరోల్‌పై బయటకు వచ్చి పోలీసులకు దొరక్కుండా పేరు, ఊరు మార్చేసి హంతకుడు, రౌడీషీటర్ కాస్తా పూజారి అవతారం ఎత్తాడు. ఇళ్లలో వ్రతాలు, పూజలు నిర్వహిస్తూ హత్యలు చేసిన చేతులతోనే..
అన్నను చంపి జైలుకు.. పెరోల్‌పై వచ్చి పూజారి వేషం
14 ఏళ్లుగా తప్పించుకు తిరుగుతున్న రౌడీషీటర్‌ను అదుపులోకి తీసుకున్న సుల్తాన్‌బజార్ పోలీసులు
21 కేసుల్లో ప్రధాన నిందితుడిగా గుర్తింపు
హైదరాబాద్: అతడు హత్యలు, హత్యాయత్నం, వంటి 21 కేసుల్లో నిందితుడు. 16 ఏళ్ల క్రితం అన్నను చంపి జైలుకెళ్లాడు. తర్వాత పెరోల్‌పై బయటకు వచ్చి పోలీసులకు దొరక్కుండా పేరు, ఊరు మార్చేసి హంతకుడు, రౌడీషీటర్ కాస్తా పూజారి అవతారం ఎత్తాడు. ఇళ్లలో వ్రతాలు, పూజలు నిర్వహిస్తూ హత్యలు చేసిన చేతులతోనే ఆశీర్వాదాలు ఇస్తూ చెలామణి అవుతున్నాడు. 14 ఏళ్లుగా పోలీసుల కళ్లుగప్పి తప్పించుకు తిరుగుతున్న ఆ నేరస్థుడిని హైదరాబాద్ పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన వైష్ణవ్ కిషన్‌దాస్ అలియాస్ వైష్ణవ్ గణేశ్ మహరాజ్ 30 ఏళ్ల క్రితం బతుకుదెరువు కోసం హైదరాబాద్‌కు వచ్చాడు. తరచూ గొడవలు, కొట్లాటలు, భౌతిక దాడులకు పాల్పడుతున్న అతడిపై సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్‌లో 1999 నుంచి రౌడీషీట్ కొనసాగుతోంది. 2003లో నమోదైన హత్యాయత్నం, భౌతిక దాడుల కేసుల్లోనూ అతడు పరారీలో ఉన్నాడు. 2010లో తన సొంత అన్నను హత్యచేశాడు. తర్వాత అదే సంవత్సరం నాంపల్లి కోర్టులో లొంగిపోయి జైలుకెళ్లాడు.
2012లో పెరోల్‌పై వచ్చిన వైష్ణవ్ కిషన్ దాస్. అప్పుడే ప్రారంభమవుతున్న ఆధార్ కార్డులో తన పేరును వి. గణేశ్ మహరాజ్‌గా మార్చుకున్నాడు. మలక్‌పేటలో ఓ కొత్త చిరునామాతో ఆధార్ కార్డు తీసుకున్నాడు. ఫోన్ నంబర్లూ మార్చేశాడు. తర్వాత గుండు చేయించుకొని పూజారి అవతారం ఎత్తాడు. ఇళ్లలో పూజలు, సత్యనారాయణ వ్రతాలు చేస్తూ హత్యలు చేసిన చేతులతోనే ఆమాయకులకు ఆశీర్వాదాలు అందిస్తున్నాడు. ఓ హత్య కేసులో 14 ఏళ్లుగా తప్పించుకు తిరుగుతున్న కిషన్ దాస్‌ను మలక్‌పేటలో నిఘా పెట్టి గురువారం అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఆధార్ కార్డు, ఇతర పత్రాల్లో తన పేరు, ఊరును ఉద్దేశపూర్వకంగా మార్చుకున్నట్లు దర్యాప్తులో తేలింది. నిందితుడిని న్యాయస్థానంలో హాజరుపరిచిన పోలీసులు అనంతరం రిమాండ్‌కు తరలించారు. కేసును ఛేదించిన ఖైరతాబాద్ డీసీపీ శిల్పవల్లి, ఏసీపీ మట్టయ్య, సుల్తాన్ బజార్ ఇన్‌స్పెక్టర్ నరేశ్ బృందాన్ని హైదరాబాద్ సీపీ సజ్జనార్ అభినందించారు.
Also Read:
ఘోర ప్రమాదం.. వంతెన కూలి ఐదుగురి మృతి..
ఏఐ షార్ట్‌ఫిల్మ్ అతడి జీవితాన్నే మార్చేసింది.. హాలీవుడ్‌లో అవకాశం..