Share News

ఏఐ షార్ట్‌ఫిల్మ్ అతడి జీవితాన్నే మార్చేసింది.. హాలీవుడ్‌లో అవకాశం..

ABN , Publish Date - May 29 , 2026 | 08:02 AM

చైనాకు చెందిన ఓ యువకుడు ఏఐ సాయంతో.. అది కూడా తక్కువ ఖర్చుతో ఓ షార్ట్ ఫిల్మ్ చేశాడు. ఆ షార్ట్ ఫిల్మ్ ఆ యువకుడి జీవితాన్నే మార్చేసింది. హాలీవుడ్‌లో సినిమాలు చేసే అవకాశాన్ని కల్పించింది.

ఏఐ షార్ట్‌ఫిల్మ్ అతడి జీవితాన్నే మార్చేసింది.. హాలీవుడ్‌లో అవకాశం..
AI short film

ఇంటర్‌నెట్ డెస్క్: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) చేస్తున్న అద్భుతాలకు కొదువ లేదు. అన్ని రంగాల్లో ఏఐ ఓ అత్యవసరం అయిపోయింది. మరీ ముఖ్యంగా ఏఐ వచ్చిన తర్వాత ఫిల్మ్ మేకింగ్‌కు అర్థమే మారిపోయింది. లక్షలు, కోట్లు పెట్టి సినిమాలు తీయాల్సిన అవసరం లేకుండా పోతోంది. వేల రూపాయల ఖర్చుతో కూడా హాలీవుడ్ లెవెల్ అవుట్‌పుట్ వచ్చేలా సినిమాలు చేయడానికి ఏఐ ఎంతగానో ఉపయోగపడుతోంది. సినిమా అవకాశాలు రావటం లేదని బాధపడేవారికి ఏఐ ఓ వరంలా మారింది. తాజాగా, చైనాకు చెందిన ఓ యువకుడు ఏఐ సాయంతో.. అది కూడా తక్కువ ఖర్చుతో ఓ షార్ట్ ఫిల్మ్ చేశాడు.


ఆ షార్ట్ ఫిల్మ్ ఆ యువకుడి జీవితాన్నే మార్చేసింది. హాలీవుడ్‌లో సినిమాలు చేసే అవకాశాన్ని కల్పించింది. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ తెలిపిన వివరాల మేరకు.. యున్నాన్ ప్రావిన్స్‌కు చెందిన లి జియు అనే 29 ఏళ్ల యువకుడు గతంలో లోకో పైలట్‌గా పని చేశాడు. అతడికి సినిమాలు అంటే పిచ్చి. సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే నెల రోజుల క్రితం ‘జాంబీ స్కావెంజర్’ పేరుతో ఓ షార్ట్ ఫిల్మ్ చేశాడు. అది కూడా ఏఐ సాయంతో ఆ షార్ట్ ఫిల్మ్ చేశాడు. 3 వేల యువాన్ల( రూ. 42 వేలు) బడ్జెట్‌తో 10 రోజులు కష్టపడి తీసిన ఆ షార్ట్ ఫిల్మ్‌ను రెండు వారాల క్రితం సోషల్ మీడియాలో రిలీజ్ చేశాడు.


హాలీవుడ్ సినిమాకు ఏమాత్రం తీసి పోని అవుట్‌పుట్‌తో ఉన్న ఆ షార్ట్ ఫిల్మ్ సోషల్ మీడియా సంచలనంగా మారింది. అమెరికాకు చెందిన హాలీవుడ్ ఏఐ ఫిల్మ్ మేకర్ పీజే అసెట్టురో దృష్టికి కూడా వెళ్లింది. లి జియు తీసిన ఆ షార్ట్ ఫిల్మ్ పీజేకు ఎంతగానో నచ్చింది. లి జియుకు తనతో పాటు పని చేసే అవకాశం కూడా ఇచ్చాడు. అయితే, ఇంగ్లీష్ రాకపోవటం, అమెరికాకు వెళ్లాలన్న ఉద్దేశ్యం లేకపోవటంతో లి జియు ఆ ఆఫర్‌ను తిరస్కరించాడు. ఆఫర్‌ను తిరస్కరించినప్పటికీ పీజే టీమ్‌తో లి జియు టచ్‌లో ఉన్నాడు.


లి జియు మాట్లాడుతూ.. ‘తక్కువ సమయంలో విజయం సాధించటం నాకు నచ్చదు. నేను నిత్యం నేర్చుకుంటూనే ఉంటాను. ప్రస్తుతం నా తర్వాతి ప్రాజెక్ట్ గురించి ఆలోచిస్తున్నాను. అది కూడా జనాలకు నచ్చుతుందని అనుకుంటున్నాను’ అని అన్నాడు. లి జియు తీసిన షార్ట్ ఫిల్మ్ ఐపీఆర్ రైట్స్ చైనాకు చెందిన ఓ సినిమా కంపెనీ దక్కించుకుంది. ఇక, ప్రపంచ వ్యాప్తంగా ‘జాంబీ స్కావెంజర్’ షార్ట్ ఫిల్మ్‌కు 60 మిలియన్ల వ్యూస్ వచ్చాయి.


ఇవి కూడా చదవండి

‘జన్మభూమి’.. రోజూ ఆలస్యమే !

సైనిక చర్యలు, ఆర్థిక ఒత్తిళ్లే ఇరాన్‌ను చర్చల ముందుకు తెచ్చాయి.. అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్

Updated Date - May 29 , 2026 | 09:30 AM