Share News

ప్రీమియం నగరంగా హైదరాబాద్‌!

ABN , Publish Date - Nov 20 , 2026 | 04:47 AM

రియల్‌ ఎస్టేట్‌ రంగం పరంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ ప్రీమియం నగరంగా మారుతోంది.

ప్రీమియం నగరంగా హైదరాబాద్‌!
Hyderabad Real Estate

  • లగ్జరీ, ప్రీమియం రియల్‌ ఎస్టేట్‌ ప్రాజెక్టులకే డిమాండ్‌

  • అమ్మకాలు తగ్గుతున్నా పెరుగుతున్న ధరలు

  • కొత్త ఇళ్లు, ఫ్లాట్‌ల ధరలన్నీ రూ.కోట్లల్లోనే

  • సీఆర్‌ఈ మ్యాట్రిక్స్‌ నివేదికలో వెల్లడి

హైదరాబాద్‌ సిటీ, నవంబరు19 (ఆంధ్రజ్యోతి): రియల్‌ ఎస్టేట్‌ రంగం పరంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ ప్రీమియం నగరంగా మారుతోంది. మహానగరంలో ఇటీవల అధికంగా నిర్మితమవుతున్న హైరైజ్డ్‌ భవంతుల తరహాలోనే ఇళ్లు, ఫ్లాట్ల ధరలు కూడా ఆకాశాన్ని తాకుతున్నాయి. ఆయా ఇళ్లు, ఫ్లాట్‌ల అమ్మకాలు ఆశాజనకంగా లేకున్నా ధరలు మాత్రం పెరుగుతుండడం గమనార్హం. కొనుగోలుదారుల డిమాండ్‌కు అనుగుణంగా ఆకాశహర్మ్యాలతో ప్రీమియం ప్రాజెక్టులు చేపడుతున్న బిల్డర్లు.. రూ.కోటి లోపు విక్రయించే ఇళ్ల నిర్మాణాన్ని తగ్గించేశారు. దాదాపు అన్ని సంస్థలు రూ.1.5 కోట్లు నుంచి రూ.3 కోట్లు విలువైన ఇళ్లను విక్రయించేలా ప్రీమియం ప్రాజెక్టులే చేపడుతున్నారు.


వెరసి హైదరాబాద్‌.. ప్రీమియం హైదరాబాద్‌గా మారుతోంది. హైదరాబాద్‌లో మారుతున్న ఈ తీరును ఈ ఏడాది మూడో త్రైమాసికానికి సంబంధించి సీఆర్‌ఈ మ్యాట్రిక్స్‌ సంస్థ విడుదల చేసిన నివేదిక స్పష్టం చేస్తోంది. ఈ ఏడాది జూలై- సెప్టెంబరు వరకు మూడో త్రైమాసికానికి సంబంధించి సీఆర్‌ఈ మ్యాట్రిక్స్‌ ఇచ్చిన నివేదిక ప్రకారం.. దేశంలోని ఇతర మెట్రోపాలిటన్‌ నగరాలతో పోలిస్తే అమ్మకాల్లో హైదరాబాద్‌ చివరి స్థానంలో నిలిచింది. గత త్రైమాసికంతో పోలిస్తే ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, చెన్నై, అహ్మదాబాద్‌, బెంగళూరు, పుణె నగరాలు అమ్మకాల్లో వృద్ధి సాధించాయి. కానీ హైదరాబాద్‌లో అమ్మకాలు 23.9శాతం పడిపోయాయి.


ఈ స్థాయిలో అమ్మకాలు పడిపోయినాధరలు పెరుగుతుండడం గమనార్హం. హైదరాబాద్‌లో కొత్త ఇల్లు లేదా ఫ్లాట్‌ సగటు ధర 9.6శాతం పెరిగింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో కొత్త ఇంటి సగటు ధర రూ.2.15కోట్లుగా( రెండో త్రైమాసికంలో ఇది రూ.1.96 కోట్లు) ఉందని సీఆర్‌ఈ మ్యాట్రిక్స్‌ నివేదిక పేర్కొంది. ఈ నివేదిక ప్రకారం ఈ ఏడాది మూడో త్రైమాసికంలో హైదరాబాద్‌లో 13,270ఇళ్లు అమ్ముడయ్యాయి. గతేడాదితో పోలిస్తే 13.5 శాతం, ఈ ఏడాది రెండో త్రైమాసికంతో పోలిస్తే 23.9శాతం అమ్మకాలు తగ్గాయి. మూడో త్రైమాసికంలో విక్రయించిన వాటి విలువ రూ.28,478కోట్లు. ఇక కొత్త ప్రాజెక్టుల్లో 15,904యూనిట్లు మాత్రమే లాంచ్‌ అయ్యాయి. ఈ ఏడాది రెండో త్రైమాసికంలోనే పెద్దఎత్తున కొత్త ప్రాజెక్టులు లాంచ్‌ అవ్వడంతో మూడో త్రైమాసికంలో లాంచ్‌లు తగ్గాయి. ఇక, 2024 చివరి త్రైమాసికం నుంచి హైదరాబాద్‌లో అమ్ముడుపోని ఫ్లాట్ల సంఖ్య పెరుగుతోంది. ఈ ఇళ్లన్నీ అమ్ముడుపోవడానికి రెండున్నరేళ్లు పట్టే అవకాశముంది.


వేచి చూస్తే ధరలు తగ్గవు..

హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌ మెరుగుపడుతుంది. సీఆర్‌ఈ నివేదికలో ఏమున్నా గతేడాదితో పోలిస్తే మార్కెట్‌లో అమ్మకాలు బాగున్నాయి. ఇక కొత్త ప్రాజెక్టుల లాంచ్‌ అనేది.. ఒక ప్రాజెక్టు తర్వాత.. మరో ప్రాజెక్టు వస్తుంది. రెండో త్రైమాసికంలో పెద్దఎత్తున లాంచ్‌లు జరగడంతో ఈ త్రైమాసికంపై ఆ ప్రభావం ఉంటుంది. సొంతిల్లు కొనుగోలుకు ఇదే తగిన సమయం. వేచి చూస్తే ధరలు తగ్గవు

- జగన్నాథరావు,

క్రెడాయ్‌ ప్రెసిడెంట్‌ (ఎలెక్ట్‌)


ఇవి కూడా చదవండి...

సిరాజ్‌ను ఎందుకు పక్కన పెట్టారు?.. టీమిండియా ఎంపికపై గావస్కర్

హైదరాబాద్‌లో డ్రగ్స్ కింగ్‌పిన్ అరెస్ట్.. 51 గ్రాముల ఎమ్‌డీఎమ్‌ఏ స్వాధీనం

Read latest Telangana News And Telugu NEws

Updated Date - Nov 20 , 2026 | 04:47 AM