Share News

డ్రైఫ్రూట్స్ తింటున్నారా? ఓసారి ఇటు లుక్కేయండి.. జడుసుకుంటారు!

ABN , Publish Date - Mar 13 , 2026 | 09:57 PM

కాదేదీ కల్తీకి అనర్హం అన్నట్లుగా.. నేటి కాలంలో ప్రతీది కల్తీమయం అవుతోంది. వ్యాపారుల అత్యాశ ఫలితంగా.. ప్రతీది కల్తీ చేసేస్తున్నారు. వెరసి ప్రజల ఆరోగ్యం దెబ్బతింటోంది. అదీ, ఇదీ అనే తేడా లేకుండా.. అన్నీ కల్తీ చేస్తున్నారు. అందుకే..

డ్రైఫ్రూట్స్ తింటున్నారా? ఓసారి ఇటు లుక్కేయండి.. జడుసుకుంటారు!

హైదరాబాద్, మార్చి 13: కాదేదీ కల్తీకి అనర్హం అన్నట్లుగా.. నేటి కాలంలో ప్రతీది కల్తీమయం అవుతోంది. వ్యాపారుల అత్యాశ ఫలితంగా.. ప్రతీది కల్తీ చేసేస్తున్నారు. వెరసి ప్రజల ఆరోగ్యం దెబ్బతింటోంది. అదీ, ఇదీ అనే తేడా లేకుండా.. అన్నీ కల్తీ చేస్తున్నారు. అందుకే.. ఏం కొనాలన్నా.. ఏం తినాలన్నా భయపడిపోతున్నారు జనాలు. పైకి తమ ప్రోడక్ట్స్ స్వచ్ఛమైనవి.. నాణ్యమైనవి అని ప్రచారం చేస్తూ.. అంతర్గతంగా మాత్రం ఏమాత్రం నాణ్యత లేని, పాడైపోయిన వస్తువులు, ఆహార పదార్థాలు విక్రయిస్తుంటారు. తాజాగా ఇలాంటి వ్యవహారాన్నే బట్టబయలు చేశారు హైదరాబాద్ స్పెషల్ క్రైమ్ టీమ్(సీసీఎస్), ఆహార కల్తీ బృందం, బహదూర్‌పురా పోలీసులు.


పాడైపోయిన, అపరిశుభ్రమైన డ్రై ఫ్రూట్స్‌ని మంచి నాణ్యమైన, వినియోగానికి తగినవంటూ మోసం చేస్తూ విక్రయిస్తున్న వ్యాపారి అసవా మనీష్‌(42)ను అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. జెమ్ ఫుడ్స్(GEM Foods Exports and Imports) పేరుతో ఒక గోడౌన్ రన్ చేస్తున్నాడు మనీష్. తన గోడౌన్‌లో రోజుల తరబడి నిల్వ ఉంచిన, పాడైపోయిన, నాణ్యత లేని డ్రై ఫ్రూట్స్ విక్రయిస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. విశ్వసనీయ సమాచారం మేరకు అధికారుల బృందం మనీష్ గోడౌన్‌లో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో షాకింగ్ దృశ్యాలు కనిపించాయి. ఈ తనిఖీల్లో అధికారులు 30 కార్టన్ల బాక్స్‌ల డ్రై ఫ్రూట్స్‌ని స్వాధీనం చేసుకున్నారు. అవన్నీ చెడిపోయినట్లుగా, బూజు పట్టి, దుర్వాసన వస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అపరిశుభ్రమైన చోట నిల్వ చేశారని.. ఇవి మానవ వినియోగానికి సురక్షితం కాదని అధికారులు తెలిపారు.


ప్రజలకు గమనిక..

ఈ తనిఖీల నేపథ్యంలో ప్రజలకు అధికారులు కీలక అడ్వైజరీ జారీ చేశారు. ‘ఆహార పదార్థాలను, ముఖ్యంగా ప్యాక్ చేసిన లేదా బల్క్ డ్రై ఫ్రూట్స్‌ని కొనుగోలు చేసేటప్పుడు ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. వాటి నాణ్యత, వాసన, రూపాన్ని తనిఖీ చేయాలి. చెడిపోయిన, కల్తీ ఆహార ఉత్పత్తుల అమ్మకం జరిగితే సమీపంలోని పోలీస్ స్టేషన్‌లో లేదా ఆహార భద్రతా అధికారులకు ఫిర్యాదు చేయాలి.’ అని అధికారులు సూచించారు.


Also Read:

వాట్సాప్‌లో గ్యాస్ మెసేజ్ వచ్చిందా? క్లిక్ చేస్తే మీ ఖాతా ఖాళీ!

ఇండిగో షాక్.. ఇంధనం సర్‌చార్జి పేరుతో ప్రయాణికులపై అదనపు భారం

అరకు ఘాట్ రోడ్డు లోయలో బోల్తా పడిన బొలెరో వాహనం.. 10 మందికి గాయాలు

Updated Date - Mar 13 , 2026 | 09:58 PM