Share News

హైదరాబాద్‌లో నీటి వృథాకు చెక్.. ‘పానీ’ యాప్ ప్రారంభించిన మంత్రి పొన్నం

ABN , Publish Date - Oct 29 , 2026 | 05:28 PM

భాగ్యనగరంలో తాగునీటి దుర్వినియోగాన్ని అరికట్టేందుకు రూపొందించిన ‘పానీ’ యాప్‌ను జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఆవిష్కరించారు. తాగునీటి సంరక్షణ కోసం హైదరాబాద్‌ జలమండలి ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఈ మేరకు నగర పౌరులను భాగస్వాములను చేస్తూ ‘పానీ’ పేరుతో యాప్‌ను సిద్ధం చేసింది.

హైదరాబాద్‌లో నీటి వృథాకు చెక్.. ‘పానీ’ యాప్ ప్రారంభించిన మంత్రి పొన్నం
Pani App

హైదరాబాద్‌: భాగ్యనగరంలో తాగునీటి దుర్వినియోగాన్ని అరికట్టేందుకు రూపొందించిన ‘పానీ’ యాప్‌ను జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఆవిష్కరించారు. తాగునీటి సంరక్షణ కోసం హైదరాబాద్‌ జలమండలి (HMWSSB) ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఈ మేరకు నగర పౌరులను భాగస్వాములను చేస్తూ ‘పానీ’ పేరుతో యాప్‌ను సిద్ధం చేసింది. దీనిని నేడు (గురువారం) జలమండలి కార్యాలయంలో మంత్రి పొన్నం, జలమండలి ఎండీ అశోక్‌ రెడ్డి ప్రారంభించారు.


ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్‌ మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో నీటి దుర్వినియోగాన్ని అరికట్టేందుకే ‘పానీ’ యాప్‌ను రూపొందించినట్లు తెలిపారు. కేవలం జలమండలి అధికారులు, సిబ్బంది ద్వారానే అన్ని ప్రాంతాల్లో నీటి సంరక్షణ సాధ్యం కాదని పేర్కొన్నారు. అందుకే ప్రజలనూ భాగస్వాములను చేస్తున్నట్లు చెప్పారు. నీటి సంరక్షణపై ఆసక్తి ఉన్న ప్రతి పౌరుడు ఇందులో ‘సేవ్ వాటర్ వాలంటీర్‌’గా నమోదు చేసుకునే అవకాశాన్ని కల్పించినట్లు మంత్రి తెలిపారు. ఈ యాప్‌లో ప్రతి పౌరుడు నమోదు చేసుకుని, వాలంటీర్‌గా ఫిర్యాదు చేయాలని పొన్నం సూచించారు.


మరోవైపు, మహా నగరంలో భారీ వర్షాలు పడినప్పుడు నీటిని సంరక్షించడంపై ప్రజలు తగిన శ్రద్ధ చూపడం లేదని మంత్రి పేర్కొన్నారు. భూగర్భ జలాలను పెంచాల్సిన అవసరం ఉందని, ఈ బాధ్యత అందరిపైనా ఉందన్నారు. ఇందుకు ప్రతి ఇంటి ఆవరణలోనూ ఇంకుడుగుంత ఏర్పాటు చేసి వర్షపు నీటిని ఒడిసిపట్టాలని పిలుపునిచ్చారు. నగర ప్రజలపై జరిమానాలు విధించడం ప్రభుత్వ ఉద్దేశం కాదని, నీటి పొదుపుపై అవగాహన కల్పించడానికే ప్రాధాన్యం ఇస్తున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి

కరవును చంద్రబాబు బాగా మేనేజ్‌ చేశారు.. కేటీఆర్ ప్రశంసలు

నిమ్స్‌లో అవినీతిపై ఉక్కుపాదం.. ఏసీబీ అధికారుల ముమ్మర తనిఖీలు

Updated Date - Oct 29 , 2026 | 05:47 PM