Share News

హైదరాబాద్‌లో భారీ సైబర్ మోసం.. ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరుతో రూ.12.31 కోట్లు స్వాహా..

ABN , Publish Date - Nov 14 , 2026 | 11:27 AM

హైదరాబాద్‌లోని కూకట్‌పల్లికి చెందిన ఓ యువ వ్యాపారవేత్తను సైబర్ నేరగాళ్లు బురిడీ కొట్టించారు. ఆన్‌లైన్ ట్రేడింగ్‌, అధిక లాభాల పేరుతో ఏకంగా రూ.12.31 కోట్ల మేర మోసానికి పాల్పడ్డారు.

హైదరాబాద్‌లో భారీ సైబర్ మోసం.. ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరుతో రూ.12.31 కోట్లు స్వాహా..
Hyderabad Cyber Fraud

హైదరాబాద్, నవంబర్ 14: కూకట్‌పల్లికి చెందిన ఓ యువ వ్యాపారవేత్తను సైబర్ నేరగాళ్లు బురిడీ కొట్టించారు. ఆన్‌లైన్ ట్రేడింగ్‌, అధిక లాభాల పేరుతో ఏకంగా రూ.12.31 కోట్ల మేర మోసానికి పాల్పడ్డారు. పోలీసుల వివరాల ప్రకారం.. ప్రగతినగర్‌కు చెందిన వ్యాపారవేత్త దిలీప్ తమ్మిరెడ్డి (35)కి మార్చి 2న అర్జున్ అనే వ్యక్తి వాట్సాప్ ద్వారా పరిచయమయ్యాడు. ఫేస్‌బుక్ మార్కెట్‌ప్లేస్ ద్వారా బాధితుడి వివరాలను సేకరించిన నిందితుడు.. తాను ఆన్‌లైన్ ట్రేడింగ్‌లో నిపుణుడినని, పెట్టుబడులపై భారీ లాభాలు సంపాదించవచ్చని నమ్మించాడు.


మొదట కేవలం రూ.10 వేలతో పెట్టుబడి పెట్టించిన కేటుగాడు.. కొంత లాభం వచ్చినట్లు చూపించి దిలీప్ నమ్మకాన్ని సంపాదించాడు. దీంతో అతడి మాటలు నమ్మిన బాధితుడు విడతలవారీగా పలు బ్యాంకు ఖాతాలకు భారీ మొత్తంలో నగదు బదిలీ చేశాడు. ఇలా మొత్తం రూ.12.31 కోట్లు పెట్టుబడి రూపంలో పంపించాడు. అయితే, తన పెట్టుబడితో పాటు లాభాలను వెనక్కి తీసుకునేందుకు ప్రయత్నించగా అసలు మోసం బయటపడింది. డబ్బులు విత్‌డ్రా చేసుకోవాలంటే మరింత పెట్టుబడి పెట్టాలని నిందితుడు ఒత్తిడి చేయడంతో తాను మోసపోయినట్లు బాధితుడు గుర్తించాడు. దీంతో వెంటనే తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB) అధికారులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. దిలీప్ ఫిర్యాదు ఆధారంగా భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్లు 318(4), 319(2), ఐటీ చట్టంలోని సెక్షన్ 66D కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.


ఈ సందర్భంగా ఆన్‌లైన్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. అధిక లాభాలు, వడ్డీ, స్టాక్ మార్కెట్, పెట్టుబడుల పేరుతో వచ్చే సందేశాలు, ఫోన్ కాల్స్ పట్ల జాగ్రత్త వహించాలని హెచ్చరిస్తున్నారు. అలాగే, అధిక లాభాల పేరుతో సోషల్ మీడియాలో కనిపించే ప్రకటనలను నమ్మవద్దని పేర్కొంటున్నారు. పెట్టుబడుల పేరుతో గుర్తుతెలియని వ్యక్తులు పంపే లింకులు, యాప్‌లు, బ్యాంకు ఖాతాలను నమ్మి డబ్బులు బదిలీ చేయవద్దని హెచ్చరిస్తున్నారు. సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

మేడ్చల్‌-అక్కంపేట్‌ సెక్షన్‌లో 12 రైళ్ల పునరుద్ధరణ

తెలంగాణకు కాంగ్రెస్ చేసిన ద్రోహానికి అంతులేదు.. కేటీఆర్ ఘాటు విమర్శలు

Updated Date - Nov 14 , 2026 | 11:45 AM