Share News

హైదరాబాద్ వాసులకు ట్రాఫిక్ అలర్ట్.. నేడు ఆ మార్గాల్లో దారి మళ్లింపు..

ABN , Publish Date - Jun 26 , 2026 | 10:51 AM

మొహర్రం సందర్భంగా హైదరాబాద్ పాతబస్తీలో నేడు (శుక్రవారం) 'బీబీ కా ఆలం' ఊరేగింపు నిర్వహించనున్నారు. ప్రతి ఏటా లాగానే ఈ ఏడాదీ ‘బీబీ కా అలవా’ నుంచి ‘బీబీ కా ఆలం’ ఉరేగింపు మొదలవుతుంది. ఈ సందర్భంగా భాగ్యనగరంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

హైదరాబాద్ వాసులకు ట్రాఫిక్ అలర్ట్.. నేడు ఆ మార్గాల్లో దారి మళ్లింపు..
Hyderabad Traffic Diversions

హైదరాబాద్‌: మొహర్రం సందర్భంగా హైదరాబాద్ పాతబస్తీలో నేడు (శుక్రవారం) 'బీబీ కా ఆలం' ఊరేగింపు నిర్వహించనున్నారు. ప్రతి ఏటా లాగానే ఈ ఏడాదీ ‘బీబీ కా అలవా’ నుంచి ‘బీబీ కా ఆలం’ ఉరేగింపు మొదలవుతుంది. ఈ సందర్భంగా భాగ్యనగరంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. నగరవాసులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా దారి మళ్లింపు చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా ఈరోజు మధ్యాహ్నం 12:00 నుంచి రాత్రి 10:00 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు, దారి మళ్లింపులు ఉంటాయని పోలీసులు పేర్కొన్నారు. ఊరేగింపు సాగే మార్గాలను బట్టి ఆయా సమయాలు, ప్రాంతాల్లో వాహనాలను దారి మళ్లించనున్నారు.


ట్రాఫిక్ మళ్లింపు ప్రాంతాలివే..

బీబీ కా అలవా వైపునకు వాహనాల రాకపోకలను పోలీసులు నిషేధించారు. ఈ ట్రాఫిక్‌ను సునార్‌గల్లీ ‘టి’ జంక్షన్ వద్ద దబీర్‌పురా దర్వాజా, గంగా నగర్ నాలా, యాకుత్‌పురా వైపునకు మళ్లిస్తారు. షేక్ ఫైజ్ కమాన్ వైపునకు వాహనాల రాకపోకలకు అనుమతి లేదు. ఆ మార్గంలో వచ్చే వాహనాలను జబ్బార్ హోటల్ వద్ద అవసరాన్ని బట్టి దబీర్‌పురా దర్వాజా లేదా చంచల్‌గూడ వైపునకు మళ్లిస్తారు. ఏతేబార్ చౌక్ నుంచి బడా బజార్ వచ్చే వాహనాలను ఏతేబార్ చౌక్ వద్ద పరిస్థితిని బట్టి కోట్లా అలీజా లేదా పురాణీ హవేలీ వైపునకు మళ్లిస్తారు. ప్రధాన ఉరేగింపు గంగా నగర్ నాలా(యాకుత్‌పురా)కు చేరుకున్నప్పుడు పురాణీ హవేలీ నుంచి ఏతేబార్ చౌక్ వైపు వచ్చే వాహనాలను అనుమతించరు. ఈ ట్రాఫిక్‌ను పురాణీ హవేలీ వద్ద చత్తా బజార్, దబీర్‌పురా లేదా ఎస్‌జే రోటరీ వైపు పంపిస్తారు.


అలాగే మొఘల్‌పురా, వోల్టా హోటల్ నుంచి ఏతేబార్ చౌక్ వైపు వచ్చే వాహనాలను అనుమతించరు. ఈ ట్రాఫిక్‌ను బీబీ బజార్ చౌరస్తా వద్ద పారిస్ కేఫ్ లేదా తలాబ్ కట్ట వైపునకు మళ్లిస్తారు. బీబీ కా ఆలం ఊరేగింపు ఏతేబార్ చౌక్‌కు చేరుకున్నప్పుడు మిట్టీ కా షేర్, మదీనా నుంచి ఏతేబార్ చౌక్ వైపునకు వాహనాల రాకపోకలను నిషేధించారు. ఆ ట్రాఫిక్‌ను గుల్జార్ హౌజ్ వద్ద మదీనా లేదా మిట్టీ కా షేర్ వైపునకు పంపిస్తారు. ఉరేగింపు కోట్లా అలీజాకు చేరుకున్నప్పుడు మొఘల్‌పురా వాటర్ ట్యాంక్ నుంచి చౌక్ మైదాన్ ఖాన్ వైపు వెళ్లే వాహనాలను హాఫెజ్ డంకా మసీదు వద్ద పారిస్ కేఫ్ లేదా బీబీ బజార్ వైపునకు మళ్లిస్తారు.


ఉరేగింపు చార్మినార్‌కు చేరుకున్నప్పుడు శక్కర్‌కోట్ నుంచి గుల్జార్ హౌజ్ వైపు వచ్చే వాహనాలను మిట్టీ కా షేర్ జంక్షన్ వద్ద ఘాన్సీ బజార్ లేదా చేలాపురా వైపునకు మళ్లిస్తారు. అదే సమయంలో ఏతేబార్ చౌక్ వద్ద ఉన్న ట్రాఫిక్‌ను కోట్లా ఆలీజా లేదా పురాణీ హవేలీ వైపునకు పంపిస్తారు. నయాపూల్ నుంచి చార్మినార్ వైపు వచ్చే వాహనాలను మదీనా చౌరస్తా వద్ద సిటీ కాలేజ్ వైపునకు దారి మళ్లిస్తారు. ఊరేగింపు మీరాలం మండికి వచ్చినప్పుడు చాదర్‌ఘాట్ రోటరీ, నూర్ ఖాన్ బజార్, సాలార్ జంగ్ మ్యూజియం, శివాజీ బ్రిడ్జ్ నుంచి పురాణీ హవేలీ వైపు వచ్చే వాహనాలకు అనుమతి నిరాకరించారు. వీటిని సాలార్ జంగ్ రోటరీ వద్ద నయాపూల్, శివాజీ బ్రిడ్జ్, నూర్ ఖాన్ బజార్ వైపునకు మళ్లిస్తారు.


అలాగే చాదర్‌ఘాట్ రోటరీ నుంచి కాళీ ఖబర్ వైపు వెళ్లే వాహనాలను చాదర్‌ఘాట్ రోటరీ వద్ద బ్రిడ్జ్ మీదుగా రంగమహల్ లేదా కోటి వైపునకు మళ్లిస్తారు. గౌలిగూడ లేదా అఫ్జల్‌గంజ్ నుంచి సాలార్ జంగ్/శివాజీ బ్రిడ్జ్ వైపు వచ్చే వాహనాలను గౌలిగూడ వైపు ఉన్న సాలార్ జంగ్/శివాజీ బ్రిడ్జ్ ప్రవేశ ద్వారం వద్దే దారి మళ్లించి తిరిగి అఫ్జల్‌గంజ్, గౌలిగూడ వైపునకు మళ్లిస్తారు. ఊరేగింపు అలవా సర్తౌక్‌కు చేరుకున్నప్పుడు ఎస్‌జే రోటరీ వైపు వాహనాలను అనుమతించరు. ఈ ట్రాఫిక్‌ను నయాపూల్ వద్ద మదీనా వైపునకు మళ్లిస్తారు.


మరోవైపు ఏపీ, తెలంగాణ ఆర్టీసీ జిల్లా బస్సులను దారి మళ్లిస్తున్నారు. ఈరోజు ఉదయం 10:00 నుంచి రాత్రి 09:00 గంటల వరకు రంగమహల్, అఫ్జల్‌గంజ్ వైపునకు బస్సులను మళ్లిస్తారు. ఊరేగింపు ముగింపు స్థానానికి చేరుకునే వరకు ఈ బస్సులను కాళీ ఖబర్- మీరాలం మండి రోడ్డుపైకి అనుమతించరు. ఈ ట్రాఫిక్ ఆంక్షలను నగర పౌరులు, వాహనదారులు గమనించి, తమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ఈ మేరకు హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ డి.జోయల్ డేవిస్ ప్రకటన జారీ చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి

రాంగ్‌ రూట్‌లో వచ్చిన స్కూటీని ఢీకొన్న బుల్లెట్.. ఇద్దరి మృతి

భూ భారతి ఆపరేటర్లకు వేతన కష్టాలు

Updated Date - Jun 26 , 2026 | 12:34 PM