Share News

మూసాపేట, కోకాపేట భూముల వేలానికి స్పందన కరువు

ABN , Publish Date - Nov 28 , 2026 | 04:28 AM

అత్యంత విలువైన ప్రాంతాల్లో ఉన్నా కోకాపేట, మూసాపేట భూముల వేలానికి తగిన స్పందన రాలేదు. శుక్రవారం హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో ఆన్‌లైన్‌లో ఈ-వేలం నిర్వహించారు.

మూసాపేట, కోకాపేట భూముల వేలానికి స్పందన కరువు

  • హుడా హైట్స్‌లోని ప్లాట్ల పరిస్థితీ ఇదే

  • ఆసక్తి చూపని డెవలపర్లు, నిర్మాణ సంస్థలు

  • కోర్టు వివాదాల నేపథ్యంలో వేలంపై ప్రభావం

  • రాజకీయ ఆందోళనలతోనూ ఇబ్బంది

హైదరాబాద్‌ సిటీ, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): అత్యంత విలువైన ప్రాంతాల్లో ఉన్నా కోకాపేట, మూసాపేట భూముల వేలానికి తగిన స్పందన రాలేదు. శుక్రవారం హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో ఆన్‌లైన్‌లో ఈ-వేలం నిర్వహించారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు కోకాపేట నియోపోలీసు లేఅవుట్‌లోని 4.59 ఎకరాలకు, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు మూసాపేటలోని 3.15 ఎకరాలకు వేలం చేపట్టగా ఒక్క బిడ్‌ కూడా దాఖలు కాలేదు. నిజానికి కోకాపేట, మూసాపేట భూములు మల్టీపర్పస్‌ జోన్‌లో ఉండటం, బహుళ అంతస్తుల భవనాలకు అనువుగా ఉండటంతో పోటీ ఉంటుందని అధికారులు భావించారు. కానీ అందుకు భిన్నంగా ఏమాత్రం స్పందన రాలేదు.


రెండు రోజుల క్రితం బంజారాహిల్స్‌లోని ఎమ్మెల్యే కాలనీకి అనుకొని ఉన్న హుడా హైట్స్‌లోని 8 ప్లాట్లను వేలం వేసినా.. డెవలపర్లు, నిర్మాణ సంస్థలు కొనుగోళ్లకు ముందుకు రాలేదు. మూసాపేట భూములను వేలం వేయవద్దంటూ బీఆర్‌ఎస్‌, వామపక్షాల నేతలు ఆందోళనలు చేస్తున్నారు. వేలాన్ని ఆపాలని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు హైకోర్టులో పిటిషన్‌ వేశారు. కానీ హెచ్‌ఎండీఏకు అనుకూలంగా తీర్పు వచ్చింది. దాంతో హెచ్‌ఎండీఏ అధికారులు మూసాపేట భూములకు ఈ వేలం నిర్వహించారు.


కానీ ప్రతిపక్షాల ఆందోళనలతోపాటు కోర్టు కేసులు ప్రభావం చూపాయి. స్థానిక ఎమ్మెల్యే వ్యతిరేకిస్తున్న వేలంలో భూములు కొనుగోలు చేస్తే భవిష్యత్తులో ఇబ్బందులు రావచ్చని రియల్‌ ఎస్టేట్‌ వర్గాలో చర్చ సాగింది. దానికితోడు కొనుగోలు చేశాక న్యాయపరమైన చిక్కులు ఎదురైతే ఇబ్బంది తప్పదనే ఆందోళన కూడా కనిపిస్తోంది. మరోవైపు కోకాపేటలోని నియోపోలీసు లేఅవుట్‌లో భూములకు ఎకరాకు రూ.120 కోట్లు కనీస ధరగా నిర్ణయించడంతో, ధర ఎక్కువగా ఉందన్న ఉద్దేశంతో కొనుగోళ్లకు ఎవరూ ముందుకు రాలేదని రియల్‌ ఎస్టేట్‌ వర్గాల్లో చర్చ జరుగుతోంది.


ఈ వార్తలు కూడా చదవండి...

సర్పంచ్ ఎన్నికలు.. రెబల్ అభ్యర్థులకు సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్

అటవీ ప్రాంతాల్లో నిఘా, గస్తీ మరింత పటిష్ఠం చేయాలి: పవన్ కల్యాణ్

Updated Date - Nov 28 , 2026 | 04:28 AM