Parade Ground: కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ ప్రారంభం
ABN , Publish Date - Jan 13 , 2026 | 03:40 PM
సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో కైట్స్ అండ్ స్వీట్స్ ఫెస్టివల్ మంగళవారం వైభవంగా ప్రారంభమైంది. ఈ ఫెస్టివల్ గురువారంతో ముగియనుంది. దాదాపు 19 దేశాలకు చెందిన కైట్ ఫ్లయర్స్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
హైదరాబాద్, జనవరి13: కనువిందు చేసే కైట్లు, నోరూరించే స్వీట్లతో.. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ వేదికగా జరుగుతున్న ఇంటర్నేషనల్ స్వీట్స్ అండ్ కైట్స్ ఫెస్టివల్ మంగళవారం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమం నగర వాసులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. తెలంగాణా పర్యాటక శాఖ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోన్న ఈ గ్రాండ్ ఈవెంట్‌కు దాదాపు 19 దేశాల నుంచి కైట్ ఫ్లయర్స్ హాజరయ్యారు. ఇక దేశంలోని వివిధ నగరాలకు చెందిన దాదాపు 50 మంది నేషనల్ కైట్ ఫ్లయర్స్, జంట నగరాలతో పాటు పరిసర ప్రాంతాలకు చెందిన యువత సైతం భారీగా ఈ పంతగులు ఎగురవేసే కార్యక్రమానికి హాజరైంది.
చిన్న స్థాయి నుంచి భారీ గాలి పటాలను పరేడ్ గ్రౌండ్స్ నుంచి ఎగురవేస్తున్నారు. థాయ్‌లాండ్, ఇండోనేషియా, ఆస్ట్రేలియా, నైజీరియా, కెనడా, జపాన్, ఫ్రాన్స్, ఇటలీ, రష్యా, స్విట్జర్లాండ్, మలేషియా తదితర దేశాలకు చెందిన కైట్స్‌తో స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఇవి ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటున్నాయి. మరోవైపు స్వీట్ ఫెస్టివల్‌లో భాగంగా 60 స్టాల్స్ ఏర్పాటు చేశారు. దాదాపు 200 మంది పోలీసులతో పటిష్ఠమైన బందోబస్తు ఏర్పాటుచేశారు.
ఈ కైట్ ఫెస్టివల్ మూడు రోజుల పాటు అంటే.. జనవరి 13 నుంచి 15 వ తేదీ వరకు జరగనుంది. ఉదయం 10:00 నుంచి రాత్రి 9:00 గంటల వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఇక హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్‌ను హైదరాబాద్ శివార్లలోని మూడు ప్రదేశాలలో నిర్వహిస్తున్నారు. ఉదయం, సాయంత్రం పరేడ్ గ్రౌండ్స్‌లో వీటిని ఏర్పాటు చేయనున్నారు. జనవరి 16 నుంచి 19వ తేదీ వరకు సాయంత్రం 4:00 నుంచి రాత్రి 9:00 గంటల వరకు వీటిని నిర్వహించనున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
బెట్టింగ్ యాప్ బారిన పడి యువకుడి బలి
సంక్రాంతి వేడుకల్లో సీఎం చంద్రబాబు.. ప్రజలతో మమేకమై..
Read Latest AP News And Telugu News