Share News

లంగర్ హౌస్‌లో అక్రమంగా గ్యాస్ రీఫిల్లింగ్.. ఆరుగురి అరెస్ట్!

ABN , Publish Date - Nov 17 , 2026 | 06:05 PM

హైదరాబాద్‌లో గ్యాస్ అక్రమ రీఫిల్లింగ్ దందాపై గోల్కొండ టాస్క్‌ఫోర్స్ పోలీసులు కొరడా ఝళిపించారు. లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలో బాపూఘాట్ సమీపంలోని ఓ స్క్రాప్ షాప్‌పై మంగళవారం దాడి చేశారు.

లంగర్ హౌస్‌లో అక్రమంగా గ్యాస్ రీఫిల్లింగ్..  ఆరుగురి అరెస్ట్!

హైదరాబాద్, నవంబర్17: నగరంలోని గ్యాస్ అక్రమ రీఫిల్లింగ్ దందాపై గోల్కొండ టాస్క్‌ఫోర్స్ పోలీసులు కొరడా ఝళిపించారు. లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలో బాపూఘాట్ సమీపంలోని ఓ స్క్రాప్ షాప్‌పై మంగళవారం దాడి చేశారు. ఈ దాడుల్లో గృహ వినియోగ సిలిండర్ల నుంచి చిన్న సిలిండర్లలోకి గ్యాస్‌ను అక్రమంగా నింపుతున్న ఆరుగురిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 46 నిండు HP గ్యాస్ సిలిండర్లు, 3 కిలోల సామర్థ్యం ఉన్న 35 ఖాళీ సిలిండర్లు, 5 కిలోల సామర్థ్యం కలిగిన సిలిండర్, 7 గ్యాస్ రీఫిల్లింగ్ కిట్లు, ఓ వెయింగ్ మెషిన్, రెండు ట్రాలీ ఆటోలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. వీటి విలువ సుమారు రూ.4 లక్షలు ఉంటుందని తెలిపారు. ఈ ఘటనపై లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు చెప్పారు.


అరెస్టయిన వారిలో రవి అనే వ్యక్తి గతంలో కూడా ఇదే తరహా కేసులో అరెస్టయినట్లు పోలీసులు వెల్లడించారు. ఎలాంటి భద్రతా చర్యలు తీసుకోకుండా ప్రమాదకరంగా గ్యాస్ రీఫిల్లింగ్ చేస్తూ, చిన్న సిలిండర్లను బ్లాక్ మార్కెట్‌లో విక్రయిస్తున్నట్లు తమ విచారణలో వెల్లడించారని వివరించారు. అనుమతులు లేకుండా గ్యాస్ రీఫిల్లింగ్ చేయడం అత్యంత ప్రమాదకరమని, ఇలాంటి చర్యల వల్ల అగ్నిప్రమాదాలు, పేలుళ్లు సంభవించి ప్రాణనష్టం జరిగే అవకాశం ఉందని హెచ్చరించారు. అక్రమ గ్యాస్ రీఫిల్లింగ్‌పై ఉక్కుపాదం మోపినట్లు పోలీసులు స్పష్టం చేశారు. టాస్క్‌ఫోర్స్ బృందం, లంగర్ హౌస్ పోలీసులు, మెహిదీపట్నం సర్కిల్ ACSO అధికారులు సంయుక్తంగా ఈ దాడులు నిర్వహించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

అక్వాన్ తుపాను.. ఏపీ, ఒడిశాలకు ఆరెంజ్ అలర్ట్: వాతావరణ శాఖ

అక్వాన్ తుపాను ఎఫెక్ట్.. ఎన్టీఆర్ జిల్లాలో విద్యుత్ శాఖ కంట్రోల్ రూమ్ ఏర్పాటు

Updated Date - Nov 17 , 2026 | 07:06 PM