Share News

అక్వాన్ తుపాను.. ఏపీ, ఒడిశాలకు ఆరెంజ్ అలర్ట్: వాతావరణ శాఖ

ABN , Publish Date - Nov 17 , 2026 | 04:20 PM

బంగాళాఖాతంలో కొనసాగుతున్న 'అక్వాన్' తుపాను నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, దక్షిణ ఒడిశా తీరాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినట్లు భారత వాతావరణ శాఖ (IMD) మంగళవారం వెల్లడించింది.

అక్వాన్ తుపాను.. ఏపీ, ఒడిశాలకు ఆరెంజ్ అలర్ట్: వాతావరణ శాఖ

అమరావతి, నవంబర్ 17: బంగాళాఖాతంలో కొనసాగుతున్న 'అక్వాన్' తుపాను నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, దక్షిణ ఒడిశా తీరాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినట్లు భారత వాతావరణ శాఖ (IMD) మంగళవారం వెల్లడించింది. నవంబర్ 17 ఉదయం 8:30 గంటల సమయానికి 'అక్వాన్' తుపాను మచిలీపట్నానికి ఆగ్నేయంగా 660 కి.మీ., విశాఖపట్నానికి దక్షిణ - ఆగ్నేయంగా 670 కి.మీ., చెన్నైకి తూర్పున 610 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉందని తెలిపింది. ఈరోజు (నవంబర్ 17) సాయంత్రానికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో 'అక్వాన్' తీవ్ర తుపానుగా (Severe Cyclonic Storm) బలపడే అవకాశం ఉందని ప్రకటించింది.


నవంబర్ 19 ఉదయానికి ఇది మరింత బలపడి అతి తీవ్ర తుఫాన్‌గా (Very Severe Cyclonic Storm) మారనుందని పేర్కొంది. నవంబర్ 20వ తేదీ మధ్యాహ్నం నెల్లూరు - తుని మధ్య ఆంధ్రప్రదేశ్, యానాం తీరాలలో అతి తీవ్ర తుపానుగా దాటే అవకాశం ఉందని వివరించింది. తుపాను తీరం దాటే సమయంలో గంటకు 120 నుంచి 130 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని.. గరిష్టంగా 145 కి.మీ. వేగానికి చేరుకునే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.


వర్ష సూచన.. జిల్లాల వారీ హెచ్చరికలు..

  • తుపాను ప్రభావంతో రేపు (నవంబర్ 18) శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

  • నవంబర్ 19, 20 తేదీల్లో కాకినాడ, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, బాపట్ల జిల్లాలతోపాటు యానాంలో అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు (21 సెం.మీ. పైగా) కురిసే అవకాశం ఉందని వివరించింది.

  • నవంబర్ 19న విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.

  • నవంబర్ 20న విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, గుంటూరు, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది.

  • నవంబర్ 21న పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కొనసాగుతాయని పేర్కొంది.

  • నవంబర్ 18 నుంచి 21వ తేదీ వరకు కోస్తాంధ్రా, రాయలసీమ ప్రాంతాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది.


ఈదురుగాలులు.. సముద్ర ఉప్పెన హెచ్చరికలు..

  • ఈరోజు (నవంబర్ 17) కోస్తాంధ్రా, యానాం తీరం వెంబడి గంటకు 40 - 50 కి.మీ.(గరిష్టంగా 60 కి.మీ.) వేగంతో గాలులు వీస్తాయి.

  • రేపు (నవంబర్ 18) సాయంత్రం నుంచి కోస్తా తీరంలో గాలుల వేగం గంటకు 60 - 70 కి.మీ.(గరిష్టంగా 80 కి.మీ.) వరకు పెరుగుతుంది.

  • నవంబర్ 19 రాత్రి నుంచి 20వ తేదీ తీరం దాటే వరకు కోస్తాంధ్రా, యానాం తీరాల్లో గంటకు 120 - 130 కి.మీ.(గరిష్టంగా145 కి.మీ.) వేగంతో పెనుగాలులు వీస్తాయి.

  • తుపాను తీరం దాటే సమయంలో ప్రకాశం, బాపట్ల, కృష్ణా, పశ్చిమ గోదావరి, కోనసీమ, కాకినాడ జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాల్లో సాధారణ ఆటుపోట్ల కంటే 1.0 నుండి 2.0 మీటర్ల ఎత్తున సముద్రపు నీరు చొచ్చుకొచ్చే ప్రమాదం ఉంది.

  • ఇన్‌కాయిస్ అంచనా ప్రకారం మచిలీపట్నం (0.4-1.6 మీ.), రేపల్లె (0.7-1.4 మీ.), అవనిగడ్డ (0.5-1.3 మీ.), రాజోలు (0.5-1.0 మీ.) మండలాల్లో సముద్రపు అలల తాకిడి అధికంగా ఉండనుంది.


ఓడరేవులు, మత్స్యకారులు.. ముందస్తు జాగ్రత్తలు

  • విశాఖపట్నం, మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం ఓడరేవులలో రెండో నంబర్ ప్రమాద హెచ్చరిక (DW-II) జారీ.

  • గంగవరం, కాకినాడ, రామాయపట్నం, మూలపేట పోర్టులలో రెండో నంబర్ ప్రమాద హెచ్చరికతో పాటు సెక్షన్ సిగ్నల్ నంబర్ 4, 5 జారీ.

  • కళింగపట్నం, భీమునిపట్నం ఓడ రేవులకు తుపాను సమాచార సందేశాలు.

  • నవంబర్ 19 రాత్రి నుంచి సముద్రంలో అలలు 14 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తుకు ఎగిసిపడే అవకాశం ఉన్నందున నవంబర్ 20 వరకు మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లరాదని హెచ్చరిక.

  • తీర ప్రాంతాల్లోని పూరిళ్లు, రేకుల షెడ్లు, బలహీనమైన కట్టడాలకు భారీ నష్టం వాటిల్లే అవకాశం ఉన్నందున ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించింది.

  • పెనుగాలుల వల్ల విద్యుత్, టెలికాం స్తంభాలు, భారీ వృక్షాలు నేల కూలే ప్రమాదం ఉంది. అరటి, బొప్పాయి, మునగ, కొబ్బరి తోటలకు, ఉప్పు మడులకు తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు.

  • ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలు ఇళ్లలోనే సురక్షితంగా ఉండాలని, రైలు, రోడ్డు, విమాన రాకపోకలను పరిస్థితులకు అనుగుణంగా నియంత్రించాలని వాతావరణ శాఖ సూచించింది.


ఆక్వాన్ తీవ్ర తుపానుగా మారే అవకాశం: ప్రఖర్ జైన్

దక్షిణ, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అక్వాన్ తుపాను కేంద్రీకృతమైందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ, ఆర్టీజీఎస్ సీఈవో ప్రఖర్ జైన్ వెల్లడించారు. ప్రస్తుతానికి చెన్నైకి 600కి.మీ, మచిలీపట్నానికి 650 కి.మీ, విశాఖపట్నానికి 660 కి.మీ, ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు 780 కి.మీ దూరంలో కేంద్రీకృతమైందని వివరించారు. గడిచిన 6 గంటల్లో గంటకి 3 కిమీ వేగంతో ఈ తుపాను కదులుతోందని తెలిపారు. ఈ రోజు తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందన్నారు.

పశ్చిమ-వాయవ్య దిశలో ప్రయాణిస్తూ ఎల్లుండి ఉదయానికి అతి తీవ్ర తుపానుగా బలపడే అవకాశం ఉందని పేర్కొన్నారు. శుక్రవారం మధ్యాహ్నానికి నెల్లూరు - విశాఖ మధ్య తీరం దాటే అవకాశం ఉందని చెప్పారు. వ్యవసాయ పనుల్లో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని రైతులకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ సీఈవో ప్రఖర్ జైన్ సూచించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ప్రపంచస్థాయి ప్రెసిషన్ ఇంజినీరింగ్ హబ్‌గా హైదరాబాద్‌: మంత్రి శ్రీధర్ బాబు

ఉదయం నడక, సాయంత్రం నడక.. వీటిలో ఏది ఆరోగ్యానికి మేలు..?

Updated Date - Nov 17 , 2026 | 04:33 PM