మురిపిస్తున్నావ్ బంగారం!
ABN , Publish Date - Nov 22 , 2026 | 06:26 AM
బిడ్డ పెళ్లి ఏర్పాట్లలో ఉన్న సామాన్యుడిలో కంగారు, ఆందోళనలు తగ్గాయి. మీ అమ్మాయికి ఎంత బంగారం పెడుతున్నారేంటి? అని ఎవరైనా అడిగితే.. అనుకున్నదానికంటే కాస్త ఎక్కువే పెడుతున్నాను అని గర్వంగా చెబుతున్నాడు..
బాగా దిగొస్తున్న పసిడి ధరలు..
ఒక్కరోజులోనే రూ.5,120 తగ్గుదల
10గ్రాముల ధర రూ.1,25,570
హైదరాబాద్ సిటీ/సికింద్రాబాద్/బంజారాహిల్స్, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి): బిడ్డ పెళ్లి ఏర్పాట్లలో ఉన్న సామాన్యుడిలో కంగారు, ఆందోళనలు తగ్గాయి. మీ అమ్మాయికి ఎంత బంగారం పెడుతున్నారేంటి? అని ఎవరైనా అడిగితే.. అనుకున్నదానికంటే కాస్త ఎక్కువే పెడుతున్నాను అని గర్వంగా చెబుతున్నాడు ‘బంగారం కొద్దీ సింగారం’ అనే మాట ఉండనే ఉంది కదా.. అటు పెళ్లి కూతురులోనూ సంతోషం! తాను సరిపడా నగలు ధరించి పందిట్లో వధువుగా ధగధగ మెరిసిపోతానని! ధరల రెక్కలతో ఇన్నాళ్లూ పైపైకి పోతూ చివరికి అందనంత ఎత్తుకు చేరి మిడిసిపడిన పసిడి దిగొస్తోంది. రోజురోజుకు ధరలు పడిపోతుండటంతో సామాన్యుల ముఖాలూ స్వర్ణకాంతులతో వెలిగిపోతున్నాయి! గుర్తుందా? ఈ ఏడాది ఒకదశలో పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.1.85 లక్షలకు చేరింది.
వామ్మో.. ఇవేం ధరలు? ఇంకా బంగారమేం కొంటాం? అంటూ అప్పట్లో సామాన్యులు గుండెలు పట్టుకున్నారు. ’ఇప్పుడే ఏం చూశారు.. మున్ముందు బంగారం రూ.3లక్షల దాకా పోవొచ్చు’ అంటూ నిపుణుల అవతారంలో కొందరు చెప్పేసరికి ఆ టెన్షన్ మనలో ఇంకా పెరిగింది. అయితే కొంతకాలం రూ.1.50 లక్షలకు కాస్త అటూ ఇటూ స్థిరంగానే ఉన్న బంగారం ధరలు నాలుగైదు రోజులుగా బాగా తగ్గుతున్నాయి. శుక్రవారం ఒక్కరోజే ఏకంగా రూ.5,120 తగ్గడంతో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.1,25,570కి చేరింది. నగల రూపంలో బంగారమైతే 10 గ్రామల ధర రూ. 1.15,110గా ఉంది. ఈ ధరలకు జీఎస్టీ, వ్యాట్ వంటివి అదనంగా ఉంటాయనుకోండి! మొత్తానికి ఇన్నాళ్లు బోసిపోయినట్లుగా కనిపించిన బంగారం దుకాణాలు కాస్త సందడిగా మారాయి. కార్తీకమాసంతో పెళ్లిళ్ల సీజన్ మొదలవ్వడంతో శుభకార్యాల కోసం బంగారం, నగలు కొనేందుకు ప్రజలు ఆ షాపులకు వెళుతున్నారు. పంజాగుట్ట, జూబ్లీహిల్స్, తదితర ప్రాంతాల్లోని బంగారు ఆభరణాల దుకాణాల్లో కాస్తా సందడి కనిపించింది.
ధరల మెరుపు ఎందుకు తగ్గినట్టు?
మరి.. బంగారం రేట్లు ఎందుకు తగ్గుతున్నాయి? అంటే ఆర్థిక నిపుణులు వివిధ కారణాలు చెబుతున్నారు. వారి వివరాల ప్రకారం అమెరికా డాలర్ బలపడటం, ట్రెజరీ బాండ్ ఈల్డ్‌లు పెరగడం వల్ల అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు తగ్గుతున్నాయి. అలాగే ద్రవ్యోల్బణం ఆందోళనల నేపథ్యంలో అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను మరింత పెంచవచ్చునన్న అంచనాలు బలపడుతున్నాయి. ఫలితంగా వడ్డీ రాల్చని బంగారం కన్నా ఆ వడ్డీ వచ్చే బాండ్లు, ఇతర ఆస్తులవైపు పెట్టుబడుదారులు మొగ్గుచూపుతున్నారు. ఈ వారంలో అంతర్జాతీయంగా బంగారం ధరలు సుమారు 8 శాతం తగ్గినట్లు వ్యాపారులు తెలిపారు. మన ఆర్బీఐ కూడా వడ్డీ రేట్ల పెంపు దిశగా అడుగులు వేయడమూ ప్రభావం చూపుతోంది.
కొనలా.. వద్దా?
బంగారం ధరలు భారీగా తగ్గడంతో పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాల కోసం తక్షణం అవసరమైన వాళ్లలో సహజంగానే ఆనందం వ్యక్తమవుతోంది. అయితే పెట్టుబడి కోసం అన్నట్టుగా కొని పెట్టుకోవాలనుకున్నవారిలో కొందరు ఇంకా ధరలు తగ్గొచ్చేమోనని వేచిచూసే ధోరణిలో ఉన్నారు. ఈ కారణం వల్లే కాబోలు సికింద్రాబాద్‌లో శుక్రవారం బంగారం దుకాణాలు బోసిపోయాయి. 50శాతం కొనుగోళ్లు తగ్గాయని వ్యాపారులు చెప్పారు. పెళ్లిళ్ల సీజన్ కావడంతో ఆ కస్టమర్లు మాత్రమే వస్తున్నారు. ధరలు పడిపోతుండటంతో మరింత తగ్గుతాయేమోనన్న ఆశతోనే కస్టమర్లు రావడం లేదని వ్యాపారులు చెబుతున్నారు.
వడ్డీ రేట్లు పెరిగితే ధర ఇంకా తగ్గొచ్చు
2012లో దాదాపు ఇలాంటి పరిస్థితి ఉంది. ఆ సమయంలో బంగారం ధరలు బాగా తగ్గాయి. కొవిడ్ సమయంలో కూడా బంగారం ధరలు పడిపోయాయి. ఐదు నెలల క్రితం రూ.1,85,000 ధర ఉన్న బంగారం క్రమేణా తగ్గుతూ రూ.1,45,000 వచ్చింది. ఆ తర్వాత మళ్లీ పుంజుకుని రూ.1,60,000 పెరిగింది. తిరిగి ప్రస్తుతం రూ.1,27,000కు పడిపోయింది. ఇంటర్నేషనల్ ఫెడరల్ బ్యాంక్ వడ్డీ రేట్లు పెరిగితే బంగారం ధరలు ఇంకా కొద్దిగా తగ్గే అవకాశముంది.
- మానేపల్లి గోపికృష్ణ, మానేపల్లి జువెలరీస్ అధినేత
ఈ వార్తలనూ చదవండి:
హెలికాప్టర్ల నుంచి తూటాల వర్షం.. కరుడుగట్టిన గ్యాంగ్‌స్టర్ అరెస్టు
పారిశ్రామిక విప్లవం కంటే ఏఐ విప్లవమే పెద్దది.. ఆంథ్రోపిక్ ఐపీఓపై ట్రంప్ ప్రశంసలు..