‘ఫ్రెండ్ యాప్’లో పరిచయం.. పుస్తెలతాడుతో ఉడాయింపు
ABN , Publish Date - Nov 24 , 2026 | 05:45 AM
ఫ్రెండ్ యాప్ ద్వారా పరిచయమైన మహిళను మాయమాటలతో బుట్టలో వేసుకుని, పుస్తెలతాడుతో ఉడాయించిన మోసగాడిని హైదరాబాద్‌లోని అల్లాపూర్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు.
కోటీశ్వరుడినంటూ మాయమాటలతో వల
అల్లాపూర్ పోలీసుల చేతికి చిక్కిన పాత నేరస్థుడు
హైదరాబాద్ సిటీ, అల్లాపూర్, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): ఫ్రెండ్ యాప్ ద్వారా పరిచయమైన మహిళను మాయమాటలతో బుట్టలో వేసుకుని, పుస్తెలతాడుతో ఉడాయించిన మోసగాడిని హైదరాబాద్‌లోని అల్లాపూర్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. ఖమ్మం జిల్లా భద్రాచలానికి చెందిన వసంత్(25) అనే నిందితుడిని పట్టుకుని అతడి నుంచి కారు, సెల్‌ఫోన్, బంగారు గొలుసు స్వాధీనం చేసుకున్నారు. అల్లాపూర్‌లోని పర్వత్ నగర్‌లో నివాసముంటున్న ఓ మహిళకు నిందితుడు ‘ఫ్రెండ్ యాప్’లో పరిచయమయ్యాడు.వీడియోకాల్స్ చేస్తూ స్నేహంగా ఉంటూ ఆమె నమ్మకాన్ని పొందాడు.
ఈ క్రమంలో మహిళ మెడలోని పుస్తెలతాడుపై కన్నేసి పథకం రచించాడు. తనకు లగ్జరీ కారు, పెద్ద ఫ్లాట్ ఉన్నాయని నమ్మించాడు. తనతో స్నేహం చేయాలంటే నిజాయితీ నిరూపించుకోవాలని, మెడలోని బంగారు గొలుసును ఒకరోజు తనకిస్తేనే స్నేహం కొనసాగిస్తానని చెప్పాడు. మాయమాటలు నమ్మి ఆమె పుస్తెల తాడు ఇవ్వగా, నిందితుడు పరారయ్యాడు. ఫోన్ చేస్తే రేపు, మాపు అంటూ చివరకు ఫోన్ స్విచ్ఛాఫ్ చేశాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. కాగా, నిందితుడు గతంలోనూ ఇలాగే మహిళలను మోసం చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఈ వార్తలనూ చదవండి:
ఎన్విడియా చిప్స్ స్మగ్లింగ్ వెనుక చైనా వ్యాపారవేత్త స్కెచ్
భారత్‌లోని వైవిధ్యం ఇతర దేశాలకు కూడా ఆదర్శం: పుతిన్