ఉచితంగా 2.5 లక్షల విలువైన ఔషధం
ABN , Publish Date - Nov 20 , 2026 | 05:05 AM
కండరాల క్షీణతకు కారణమయ్యే అలన్-హెర్న్‌డన్-డడ్లీ సిండ్రోమ్ అనే జన్యుపరమైన సమస్యతో బాధపడుతున్న ఏడుగురు చిన్నారులకు ఖరీదైన ఔషధాన్ని ఉచితంగా అందించేందుకు పలువురు వైద్యులు, దాతలు ముందుకొచ్చారు.
ఏడుగురు చిన్నారులకు నెలకోసారి ఇచ్చేందుకు ఏర్పాట్లు
దాతల నుంచి నిధులు సేకరించిన హైదరాబాదీడాక్టర్ శివరంజని
అలన్-హెర్న్‌డన్-డడ్లీ సిండ్రోమ్‌తో బాధపడుతున్న చిన్నారులు
నెదర్లాండ్స్ నుంచి భారత్‌కు టిరాట్రికాల్ ఔషధం
హైదరాబాద్ సిటీ, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): కండరాల క్షీణతకు కారణమయ్యే అలన్-హెర్న్‌డన్-డడ్లీ సిండ్రోమ్ అనే జన్యుపరమైన సమస్యతో బాధపడుతున్న ఏడుగురు చిన్నారులకు ఖరీదైన ఔషధాన్ని ఉచితంగా అందించేందుకు పలువురు వైద్యులు, దాతలు ముందుకొచ్చారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఝార్ఖండ్ రాష్ట్రాలకు చెందిన ఈ చిన్నారులకు ఈ ఔషధాన్ని నెదర్లాండ్స్‌కు చెందిన ఫార్మాస్యూటికల్ అకౌంటబిలిటీ ఫౌండేషన్ (పీఏఎఫ్) సహాయంతో అందిస్తున్నట్లు హైదరాబాద్‌కు చెందిన చిన్నపిల్లల వైద్యురాలు డాక్టర్ శివరంజని సంతోష్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఝార్ఖండ్ చిన్నారులకు శుక్రవారం అందిస్తామని, తెలంగాణకు చెందిన ఇద్దరికి ఈ నెల 30 ఇస్తామని చెప్పారు. నిజానికి ఈ సమస్యను పూర్తిగా నయం చేసే ఔషధం ప్రపంచంలో ఎక్కడా లేదు.
కానీ, దాని లక్షణాలను నియంత్రించే టిరాట్రికాల్ అనే ఔషధం నెదర్లాండ్స్‌లో లభిస్తోంది. జర్మనీకి చెందిన ఒక కంపెనీ కూడా ఈ సమస్యను నియంత్రించే మందును తయారుచేస్తోంది. జర్మనీలో తయారయ్యే ఔషధం ఖరీదు ఒక్క డోసుకు రూ.12 లక్షలు అని డాక్టర్ శివరంజని తెలిపారు. ఈ మందును నెలకు ఒకసారి ఇవ్వాల్సి ఉంటుంది. ఇటీవల ఒక కుటుంబం రూ.12 లక్షలు వెచ్చించి జర్మనీ నుంచి ఒక డోసు తెప్పించింది. ఖరీదైన ఔషధం కావటంతో బాధితులు దాతల సహాయం కోరారు. దీంతో శివరంజని సంతోష్ చొరవతో పలువురు దాతలు ముందుకొచ్చి నిధులు అందించారు. అనంతరం పీఏఎఫ్ ద్వారా నెదర్లాండ్స్ ఔషధ తయారీ కంపెనీతో చర్చించి ఒక్కో డోసును రూ.2.5 లక్షలకు సరఫరా చేసేలా ఒప్పించారు. దాతలు ఇచ్చిన నిధులు ఈ ఏడుగురు చిన్నారులకు ఆరు నెలలపాటు ఈ ఔషధం ఇచ్చేందుకు సరిపోతాయని డాక్టర్ శివరంజని తెలిపారు. అలన్-హెర్న్‌డన్-డడ్లీ సిండ్రోమ్‌తో బాధపడే పిల్లల మెదడులోకి థైరాయిడ్ హార్మోన్ వెళ్లదు. దీంతో మెదడు అభివృద్ధిలో జాప్యం ఏర్పడుతుంది.
ఇవి కూడా చదవండి...
సిరాజ్‌ను ఎందుకు పక్కన పెట్టారు?.. టీమిండియా ఎంపికపై గావస్కర్
హైదరాబాద్‌లో డ్రగ్స్ కింగ్‌పిన్ అరెస్ట్.. 51 గ్రాముల ఎమ్‌డీఎమ్‌ఏ స్వాధీనం
Read latest Telangana News And Telugu NEws