రెచ్చిపోయిన కారు రేసర్లు.. అర్ధరాత్రి వేళ హంగామా..
ABN , Publish Date - May 24 , 2026 | 10:28 AM
హైదరాబాద్ రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో కారు రేసర్లు రెచ్చిపోయారు. శనివారం అర్ధరాత్రి నాలెడ్జ్ సిటీ వద్ద రేసింగ్ నిర్వహించారు. అడ్డుకోబోయిన పోలీసులపైకి కార్లతో దూసుకెళ్లారు.
హైదరాబాద్: రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో కారు రేసర్లు రెచ్చిపోయారు. నిన్న (శనివారం) అర్ధరాత్రి నాలెడ్జ్ సిటీ వద్ద రేసింగ్ నిర్వహించారు. భారీగా సౌండ్ వచ్చేలా కార్లకు సైలెన్సర్లు ఏర్పాటు చేసి హంగామా సృష్టించారు. అడ్డుకోబోయిన పోలీసులపైకి కార్లతో దూసుకెళ్లారు. ఈ ఘటనలో ఓ కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడి తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ఒక రేసర్‌ని అరెస్టు చేయగా.. మిగతా వారంతా పరారైనట్లు పోలీసులు వెల్లడించారు.
వీకెండ్ వస్తే చాలు సిటీ సరిహద్దు ప్రాంతాల నుంచి రేసింగ్‌ల కోసం యువత హైదరాబాద్ నడిబొడ్డుకు వస్తున్నారు. టీ హబ్, ఐక్య, మై హోమ్ భుజ రోడ్లపైకి రేసింగ్ పేరుతో నానా హంగామా సృష్టిస్తున్నారు. ఇదే తరహాలో నిన్న అర్ధరాత్రి మరోసారి రెచ్చిపోయారు. ర్యాష్ డ్రైవింగ్ చేసి స్థానికులను భయాందోళనకు గురి చేశారు. వారిని పట్టుకునేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించారు. అయితే, కార్లతో పోలీసులపైకి రేసర్లు దూసుకెళ్లగా.. కానిస్టేబుల్ రమేశ్ చేతికి గాయాలు అయ్యాయి.
ఈ సందర్భంగా రేసింగ్‌కు పాల్పడిన రేహాన్(19 ) అనే యువకుడిని రాయదుర్గం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి హోండా సిటీ కారు, మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు రావడంతో మరి కొంతమంది రేసర్లు అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మరోవైపు టీ హబ్ ఏరియాలో రేసింగ్‌లు చేయకూడదని హెచ్చరిస్తున్నా యువత పెడచెవిన పెడుతుండడంపై పోలీసులు ఆగ్రహిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
అర్జున్ కోసం సారా టెండూల్కర్ ఎమోషనల్ పోస్ట్
యాదగిరిగుట్టలో అధికారుల సమన్వయలోపంపై సీఎం రేవంత్‌రెడ్డి సీరియస్