Share News

హడలెత్తించిన ‘లష్కరే తాయిబా’ మెయిల్‌

ABN , Publish Date - Nov 23 , 2026 | 05:33 AM

లష్కరే తాయిబా పేరుతో వచ్చిన ఒక ఈ-మెయిల్‌ ఆదివారం హైదరాబాద్‌ పోలీసులను హడలెత్తించింది.

హడలెత్తించిన ‘లష్కరే తాయిబా’ మెయిల్‌

  • నకిలీ మెయిల్‌గా తేల్చిన పోలీసులు

హైదరాబాద్‌ సిటీ, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): లష్కరే తాయిబా పేరుతో వచ్చిన ఒక ఈ-మెయిల్‌ ఆదివారం హైదరాబాద్‌ పోలీసులను హడలెత్తించింది. కశ్మీర్‌లో లతీఫ్‌ భట్‌ సహా తమ నాయకులను సైన్యం హతమార్చినందుకు ప్రతీకారంగా కాచిగూడ రైల్వేస్టేషన్‌, టూరిస్టు ప్లాజా హోటల్‌ను పేల్చేస్తామని, ముంబైలో మాదిరిగా మారణ హోమం సృష్టించి 300 మందిని చంపేస్తామని ఆ మెయిల్‌లో పేర్కొన్నారు. దీంతో అన్ని పోలీస్‌స్టేషన్‌ల ఎస్‌హెచ్‌వోలు, ఏసీపీలు, డీసీపీలు, టాస్క్‌ఫోర్స్‌, ట్రాఫిక్‌ విభాగాల సిబ్బందిని అధికారులు అప్రమత్తం చేశారు. కాచిగూడ రైల్వే స్టేషన్‌, హోటల్‌ టూరిస్ట్‌ ప్లాజా వద్ద భద్రతను కట్టుదిట్టం చేయాలని ఆదేశించారు.


రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు, హోటళ్లు, ప్రార్థనా మందిరాలు, రద్దీ ప్రాంతాలు, ప్రభుత్వ సంస్థల వద్ద నిఘా పెంచాలని సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు, నిర్లక్ష్యంగా వదిలివెళ్లిన వస్తువులు, వాహనాలు, అసాధారణ కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. దీనితో పోలీసులు అప్రమత్తమై విస్తృతంగా సోదాలు, తనిఖీలు జరిపారు. కానీ చివరికి అది నకిలీ మెయిల్‌ అని తేలడంతో ఊపిరి పీల్చుకున్నారు. కాగా, ఈ-మెయిల్‌ నకిలీదని తేలినా నిర్లక్ష్యం చేయడానికి వీల్లేదని డీజీపీ సీవీ ఆనంద్‌ ఎక్స్‌ వేదికగా తెలిపారు. భద్రతా చర్యల్లో భాగంగా హైదరాబాద్‌ పరిధిలో వాహనాల తనిఖీలను విస్తృతం చేసినట్టు తెలిపారు. ఈ క్రమంలో కొంత అసౌకర్యం కలిగే అవకాశం ఉందని.. ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.


ఈ వార్తలూ చదవండి

పార్టీకి నష్టపరిచేలా మాట్లాడితే చర్యలు.. సీఎం స్ట్రాంగ్ వార్నింగ్

పది లక్షల పుస్తకాల సేకరణే లక్ష్యం!

Updated Date - Nov 23 , 2026 | 05:33 AM