Share News

కిడ్నాప్ చేశారంటూ ప్రియురాలికి ప్రాంక్ మెసేజ్.. చివరికి ఏమైందంటే..

ABN , Publish Date - Aug 23 , 2026 | 08:27 AM

ప్రియురాలికి సరదాగా పంపిన ప్రాంక్‌ మెసేజ్‌ ఓ యువకుడి క్రికెట్‌ బెట్టింగ్‌ వ్యవహారాన్ని బట్టబయలు చేసింది. మద్యం మత్తులో తనను కొందరు కిడ్నాప్‌ చేశారంటూ ప్రియురాలికి మెసేజ్‌ పంపడంతో ఆమె భయాందోళనకు గురై పోలీసులకు సమాచారం ఇచ్చింది. దీంతో పోలీసులు హుటాహుటిన ఫ్లాట్‌కు చేరుకుని తనిఖీలు చేయగా రూ.30 లక్షలు బయటపడ్డాయి.

కిడ్నాప్ చేశారంటూ ప్రియురాలికి ప్రాంక్ మెసేజ్.. చివరికి ఏమైందంటే..
Hyderabad Cricket Betting

హైదరాబాద్‌: ప్రియురాలికి సరదాగా పంపిన ప్రాంక్‌ మెసేజ్‌ ఓ యువకుడి క్రికెట్‌ బెట్టింగ్‌ వ్యవహారాన్ని బట్టబయలు చేసింది. మద్యం మత్తులో తనను కొందరు కిడ్నాప్‌ చేశారంటూ ప్రియురాలికి మెసేజ్‌ పంపడంతో ఆమె భయాందోళనకు గురై పోలీసులకు సమాచారం ఇచ్చింది. దీంతో పోలీసులు హుటాహుటిన ఫ్లాట్‌కు చేరుకుని తనిఖీలు చేయగా రూ.30 లక్షలు బయటపడ్డాయి. నగదుకు సంబంధించి పొంతనలేని సమాధానాలు చెప్పడంతో వారిని అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు.


హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ ఇండిస్‌ వన్‌ సిటీలో సుమంత్‌, మనోజ్‌, గౌతమ్‌ కలిసి ఓ ఫ్లాట్‌లో నివాసం ఉంటున్నారు. వీరంతా ఆంధ్రప్రదేశ్‌లోని చంద్రగిరి పరిసర గ్రామాలకు చెందిన వారు. అయితే, ముగ్గురూ కలిసి విందు చేసుకుంటుండగా.. మద్యం మత్తులో ఉన్న సుమంత్‌ తనను కిడ్నాప్‌ చేశారంటూ ప్రియురాలికి ప్రాంక్‌ మెసేజ్‌ పంపాడు. కంగారు పడిన యువతి నిజంగానే ఏదో ప్రమాదం జరిగిందని భావించి 112కు ఫోన్‌ చేసింది. యువతి సమాచారంతో హుటాహుటిన కేపీహెచ్‌బీలోని యువకుల ఫ్లాట్‌కు పోలీసులు చేరుకున్నారు. అనంతరం ముగ్గురు యువకులను ప్రశ్నించి, ఫ్లాట్‌లో తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ఓ సూట్‌కేసులో రూ.30 లక్షల నగదును గుర్తించారు. ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని యువకులను పోలీసులు ఆరా తీశారు.


అయితే, వారంతా పొంతన లేని సమాధానాలు చెప్పడంతో అనుమానం వచ్చిన పోలీసులు ముగ్గురి ఫోన్లను పరిశీలించారు. దీంతో క్రికెట్‌ బెట్టింగ్‌ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. సుమంత్‌ క్రికెట్‌ బెట్టింగ్‌కు పాల్పడుతున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. అనంతరం వారిని అదుపులోకి తీసుకున్నారు. ఆ రూ.30లక్షలకు బెట్టింగ్‌తో ఏమైనా సంబంధం ఉందా? లేక హవాలా మార్గంలో తరలిస్తున్న డబ్బా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. కాగా, యువకుల్లో మనోజ్‌ అసిస్టెంట్‌ ఫిల్మ్‌ డైరెక్టర్‌గా పనిచేస్తుండగా.. గౌతమ్‌ ఎలక్ట్రికల్‌ కాంట్రాక్టర్‌, సుమంత్‌ క్రికెట్‌ బెట్టింగ్‌ వ్యవహారంలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి

సముద్ర వనరుల సుస్థిర వినియోగంతో ఆర్థికాభివృద్ధి

ప్రజా భద్రతలో సైబరాబాద్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ కీలకం

Updated Date - Aug 23 , 2026 | 08:36 AM