సముద్ర వనరుల సుస్థిర వినియోగంతో ఆర్థికాభివృద్ధి
ABN , Publish Date - Aug 23 , 2026 | 06:31 AM
సముద్ర వనరులను సుస్థిరంగా వినియోగించుకోవడంతోపాటు సముద్ర పర్యావరణ పరిరక్షణకు సమాన ప్రాధాన్యం ఇచ్చినప్పుడే భవిష్యత్ ఆర్థికాభివృద్ధి సాధ్యమవుతుందని బెంగళూరులోని..
ఎన్‌ఐఏఎస్ డైరెక్టర్ శైలేశ్ నాయక్
గుంటూరు విద్య, ఆగస్టు 22(ఆంధ్రజ్యోతి): సముద్ర వనరులను సుస్థిరంగా వినియోగించుకోవడంతోపాటు సముద్ర పర్యావరణ పరిరక్షణకు సమాన ప్రాధాన్యం ఇచ్చినప్పుడే భవిష్యత్ ఆర్థికాభివృద్ధి సాధ్యమవుతుందని బెంగళూరులోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ స్టడీస్(ఎన్‌ఐఏఎస్) డైరెక్టర్ శైలేశ్ నాయక్ తెలిపారు. వడ్లమూడిలోని విజ్ఞాన్స్ యూనివర్సిటీలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆన్ బ్లూ ఎకానమీని శనివారం ఆయన ప్రారంభించారు. ఈ కేంద్రం ద్వారా మెరైన్ రిసోర్సెస్, కోస్టల్ సస్టెయినబిలిటీ, ఓషన్ టెక్నాలజీస్, బ్లూ గ్రోత్, పాలసీ అండ్ గవర్నన్స్ తదితర రంగాల్లో పరిశోధనలు, సాంకేతిక పరిష్కారాలు, నైపుణ్యాభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాలను చేపట్టనున్నారని శైలేశ్ నాయక్ తెలిపారు. బ్లూ ఎకానమీని కేవలం వాణిజ్య కార్యకలాపాలకే పరిమితం చేయకుండా వాతావరణ మార్పులు, పర్యావరణ సమతుల్యత, జీవనోపాధితో అనుసంధానించాలన్నారు. కేంద్ర భూవిజ్ఞాన మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీనివాస కుమార్ తుమ్మల మాట్లాడుతూ మత్స్యరంగం, షిప్పింగ్, పవన శక్తి, తరంగ శక్తి, పర్యాటకం, లాజిస్టిక్స్ తదితర రంగాల ద్వారా బ్లూ ఎకానమీకి విస్తృత అవకాశాలు ఉన్నాయన్నారు. విజ్ఞాన్ విద్యాసంస్థల అధ్యక్ష, ఉపాధ్యక్షులు లావు రత్తయ్య, లావు శ్రీకృష్ణదేవరాయలు, వీఎస్ హెగ్డే, వెల్లంకి శేషగిరిరావు, కె.హనుమంతరావు, మేఘన కూరపాటి, కేవీ కృష్ణకిశోర్, పీఎంవీ రావు పాల్గొన్నారు.