Share News

హెచ్‌సీయూలో గంజాయి సరఫరా గుట్టురట్టు.. 23 మంది పేర్లు వెల్లడించిన నిందితుడు

ABN , Publish Date - Oct 30 , 2026 | 07:43 PM

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో గంజాయి సరఫరా గుట్టురట్టయింది. యూనివర్సిటీలో విద్యార్థులు, సిబ్బందికి మత్తు పదార్థాలు సరఫరా చేస్తున్న నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో తాను గంజాయి విక్రయించిన 23 మంది పేర్లను నిందితుడు వెల్లడించాడు.

హెచ్‌సీయూలో గంజాయి సరఫరా గుట్టురట్టు.. 23 మంది పేర్లు వెల్లడించిన నిందితుడు
Hyderabad Central University

ఇంటర్నెట్ డెస్క్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో గంజాయి సరఫరా గుట్టురట్టయింది. యూనివర్సిటీలో విద్యార్థులు, సిబ్బందికి మత్తు పదార్థాలు సరఫరా చేస్తున్న నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో తాను గంజాయి విక్రయించిన 23 మంది పేర్లను నిందితుడు వెల్లడించాడు. ఇటీవల సెంట్రల్ యూనివర్సిటీలో గంజాయి వ్యవహారంపై ఈగల్ ఫోర్స్ 1030 టోల్‌ఫ్రీ నంబర్‌కు సమాచారం అందింది. ఈ మేరకు 2026 ఆగస్టు 7న హెచ్‌సీయూకు చేరుకున్న పోలీసులు.. గంజాయి వినియోగం, సరఫరాపై దర్యాప్తు చేపట్టారు. ఈ సందర్భంగా సందేశ్ (24) అనే యువకుడిని అదుపులోకి తీసుకున్నారు.


సందేశ్‌కు యూరిన్ పరీక్ష నిర్వహించగా టీహెచ్‌సీ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో గంజాయి సరఫరా మూలాలను గుర్తించేందుకు ఈగల్ ఫోర్స్ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ మేరకు నిందితుడిని విచారించగా.. గంజాయి కొనుగోలు చేసిన 23 మంది పేర్లను వెల్లడించాడు. వారిలో ఏడుగురు విద్యార్థులు ఉండగా.. మిగతా వారంతా యూనివర్సిటీ హాస్టళ్లకు చెందిన వ్యక్తులు, హౌస్‌కీపింగ్, సెక్యూరిటీ, డెలివరీ, ట్రాన్స్‌పోర్ట్ సిబ్బంది ఉన్నారు. అలాగే, గచ్చిబౌలి, గోలిదొడ్డి, నానక్‌రామ్‌గూడ పరిసర ప్రాంతాల్లోనూ గంజాయి విక్రయాలు జరిగినట్లు ఈగల్ టీమ్ గుర్తించింది. అనంతరం సందేశ్‌ను గచ్చిబౌలి పోలీసులకు అప్పగించారు. ఎన్డీపీఎస్ చట్టంలోని 27(b) సెక్షన్ కింద కేసు నమోదు అయ్యింది.


విచారణలో బిస్వజిత్ కలిత (28) అనే మాజీ యూనివర్సిటీ విద్యార్థి గంజాయి సరఫరా చేసినట్లు సందేశ్ వెల్లడించాడు. దీంతో బిస్వజిత్‌ను అదుపులోకి తీసుకుని, 10 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అసోం ప్రాంతం నుంచి 200 నుంచి 300 గ్రాముల వరకు గంజాయిని సందేశ్ తీసుకొచ్చినట్లు పోలీసులు గుర్తించారు. 4 నుంచి 5 గ్రాముల చిన్న ప్యాకెట్లుగా తయారు చేసి, ఒక్కో ప్యాకెట్‌ను సుమారు రూ.500కు విక్రయించినట్లు తెలిపారు. మరోవైపు, తాను నవంబర్ 2025 నుంచి మత్తు పదార్థాలను అమ్ముతున్నట్లు సందేశ్ వాంగ్మూలం ఇచ్చాడు. వాటిని నిల్వ చేసేందుకు గోపన్‌పల్లిలో గదిని అద్దెకు తీసుకున్నట్లు వెల్లడించాడు. కాగా, ఈ ఘటన హెచ్‌సీయూలో కలకలం రేపుతోంది.


ఈ వార్తలు కూడా చదవండి

ప్రభుత్వ భూముల ఆక్రమణలకు పాల్పడితే ఉపేక్షించం: మంత్రి పొంగులేటి

కేసీఆర్‌ పాల్పడిన అరాచకానికి ప్రకృతి శిక్షిస్తుంది: సీఎం రేవంత్‌రెడ్డి

Updated Date - Oct 30 , 2026 | 07:45 PM