Share News

ఫోన్ ట్యాపింగ్ కేసు సిద్దిపేటకు బదిలీ.. హరీశ్ రావుపై ఎఫ్ఐఆర్ నమోదు..

ABN , Publish Date - Nov 01 , 2026 | 08:24 PM

తెలంగాణ రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్ రావుపై చక్రధర్ గౌడ్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సిద్దిపేట వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.

ఫోన్ ట్యాపింగ్ కేసు సిద్దిపేటకు బదిలీ.. హరీశ్ రావుపై ఎఫ్ఐఆర్ నమోదు..
Phone Tapping Case

సిద్దిపేట: తెలంగాణ రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్ రావుపై చక్రధర్ గౌడ్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సిద్దిపేట వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఇప్పటికే హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఈ కేసును భౌగోళిక పరిధి కారణంగా సిద్దిపేటకు బదిలీ చేశారు. దీంతో పోలీసులు కొత్తగా 496/2026 క్రైమ్ నంబర్‌తో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించిన ఎఫ్‌ఐఆర్ కాపీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చేతికి చిక్కింది. ఈ ఎఫ్‌ఐఆర్ కాపీతో పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.


ఈ సందర్భంగా చక్రధర్ గౌడ్ తన మూడు ఫోన్ నంబర్లను అక్రమంగా ట్యాప్ చేసినట్లు ఫిర్యాదులో ఆరోపించారు. తన ఫోన్లతో పాటు భార్య ఫోన్‌ను కూడా ట్యాప్ చేసి, వ్యక్తిగత సంభాషణలు, కీలక సమాచారాన్ని సేకరించినట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా తన కుటుంబ సభ్యులు, బంధువులు, అనుచరులపైనా నిఘా పెట్టినట్లు తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ ద్వారా సేకరించిన సమాచారాన్ని ఉపయోగించి తనను రాజకీయంగా ఇబ్బందులకు గురిచేశారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. రాజకీయ కార్యక్రమాలు నిర్వహించకుండా బెదిరింపులకు పాల్పడ్డారని, బీఆర్ఎస్‌లో చేరాలని ఒత్తిడి తీసుకొచ్చారని ఆరోపించారు. పార్టీలో చేరకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించినట్లు చక్రధర్ గౌడ్ ఫిర్యాదులో ప్రస్తావించారు.


గతంలో తనపై తప్పుడు కేసులు నమోదు చేసి వేధింపులకు గురిచేశారని చక్రధర్ గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. హరీశ్ రావు తన రాజకీయ అధికారాన్ని ఉపయోగించి పోలీసుల ద్వారా ఒత్తిడి తీసుకొచ్చారని ఆరోపించారు. గతంలో పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ కేసు నమోదు చేయలేదని పేర్కొన్నారు. దీంతో తెలంగాణ హైకోర్టును ఆశ్రయించగా.. కేసు నమోదు ప్రక్రియ ముందుకు సాగినట్లు చక్రధర్ గౌడ్ తెలిపారు. కాగా, మొదట హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో Cr.No.1205/2024 క్రైమ్ నంబర్‌తో కేసు నమోదైంది. భౌగోళిక పరిధి కారణంగా తాజాగా దీనిని సిద్దిపేటకు బదిలీ చేశారు. ఇకపై సిద్దిపేట పోలీసులు ఈ కేసును విచారించనున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

ఓట్‌చోరీపై రాంలీలా మైదాన్‌లో పోరాటం చేస్తాం: సీఎం రేవంత్ రెడ్డి

ఫంక్షన్‌కు వెళ్లి వచ్చేసరికి.. ఇంట్లో 29 తులాల బంగారం మాయం

Updated Date - Nov 01 , 2026 | 08:29 PM