Share News

ఓట్‌చోరీపై రాంలీలా మైదాన్‌లో పోరాటం చేస్తాం: సీఎం రేవంత్ రెడ్డి

ABN , Publish Date - Nov 01 , 2026 | 01:33 PM

ఓట్ల తొలగింపు వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దేశవ్యాప్తంగా 13.5 కోట్ల ఓట్లు తొలగించారని, పేదల ఓట్లను సైతం తొలగిస్తున్నారని ఆరోపించారు.

ఓట్‌చోరీపై రాంలీలా మైదాన్‌లో పోరాటం చేస్తాం: సీఎం రేవంత్ రెడ్డి
Revanth Reddy

ఢిల్లీ, నవంబర్ 1: దేశంలో ఓట్ల తొలగింపు వ్యవహారంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో స్పందించారు. ఓట్‌చోరీకి వ్యతిరేకంగా ఢిల్లీలోని రాంలీలా మైదాన్ వేదికగా యుద్ధం చేస్తామని ప్రకటించారు. దేశవ్యాప్తంగా ఇప్పటికే 13.5 కోట్ల ఓట్లను తొలగించారని.. ముఖ్యంగా పేదల ఓట్లను లక్ష్యంగా చేసుకుని తొలగిస్తున్నారని ఆరోపించారు. ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్తులో మొత్తం 20 కోట్ల ఓట్లు తొలగిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో ఓటు అనేది ప్రతి పౌరుడికి రాజ్యాంగం కల్పించిన హక్కు అని.. అలాంటి ఓటు హక్కును కాలరాసే ప్రయత్నాలను సహించబోమని స్పష్టం చేశారు. ఓట్ల తొలగింపు ద్వారా మరోసారి అధికార పీఠాన్ని దక్కించుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ కుట్రలు చేస్తున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు. దేశంలోని పేదలు, సామాన్య ప్రజల ఓటు హక్కును కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు.


రాంలీలా మైదాన్‌లో నిర్వహించనున్న పోరాటానికి పెద్దఎత్తున ప్రజలు తరలిరావడంపై సీఎం రేవంత్ రెడ్డి స్పందిస్తూ.. రైళ్లు ఇవ్వకపోయినా భారీ సంఖ్యలో జనం ఢిల్లీకి చేరుకున్నారని అన్నారు. ప్రజల్లో ఓటు హక్కు పరిరక్షణపై ఉన్న చైతన్యానికి ఇదే నిదర్శనమని వ్యాఖ్యానించారు. ఓట్ల తొలగింపు వ్యవహారాన్ని దేశవ్యాప్త సమస్యగా అభివర్ణిస్తూ.. దీనిపై రాంలీలా మైదాన్ వేదికగా తమ పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ప్రజల ఓటు హక్కును కాపాడటం.. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత ఉండేలా చూడటం తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. మళ్లీ అధికారంలోకి రావాలనే ఉద్దేశంతో ప్రజాస్వామ్య వ్యవస్థను ప్రభావితం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఓట్‌చోరీ అంశంపై ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు, ఓటర్ల జాబితాలో తమ పేర్లు ఉన్నాయో లేదో ప్రతి ఒక్కరూ పరిశీలించుకోవాలని పిలుపునిచ్చారు.


ఇవి కూడా చదవండి:

భారత క్రికెట్ భవిష్యత్తుకు వైభవ్ మంచి పెట్టుబడి: సనత్ జయసూర్య

పాక్ విజయంపై పోస్ట్.. ఇంత బిల్డప్ అవసరమా అంటూ ప్రధాని షరీఫ్‌పై ట్రోల్స్!

Updated Date - Nov 01 , 2026 | 02:11 PM