దమ్ముంటే సిద్దిపేటలో పోటీచెయ్
ABN , Publish Date - Nov 21 , 2026 | 04:47 AM
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దమ్ముంటే వచ్చే ఎన్నికల్లో సిద్దిపేట నుంచి పోటీ చేయాలని బీఆర్‌ఎస్ శాసనసభాపక్ష ఉపనేత తన్నీరు హరీశ్‌రావు సవాలు విసిరారు.
కృష్ణా జలాల వాటాలపై ఆరోపణలు నిరూపించు
తెలంగాణకు ద్రోహం.. రేవంత్ విధానం: హరీశ్
హైదరాబాద్, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దమ్ముంటే వచ్చే ఎన్నికల్లో సిద్దిపేట నుంచి పోటీ చేయాలని బీఆర్‌ఎస్ శాసనసభాపక్ష ఉపనేత తన్నీరు హరీశ్‌రావు సవాలు విసిరారు. కృష్ణా జలాల అంశంలో బీఆర్‌ఎస్‌పై చేసిన ఆరోపణలను నిరూపించాలని, లేదంటే సీఎం తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డిలో కోవర్టు, సబ్‌వర్ట్, పర్వర్ట్ లక్షణాలున్నాయని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సిద్దిపేట వేదికగా గురువారం జరిగిన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై హరీశ్ స్పందించారు. బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్‌లో శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
రేవంత్ రెడ్డి చేతగాని పాలన, అవినీతి వల్ల కాంగ్రెస్ పార్టీ మరో 20 ఏళ్ల వరకు చతికిలపడడం ఖాయమన్నారు. తనని తాటి చెట్టుతో పోల్చిన రేవంత్ రెడ్డి ఓ గంజాయి చెట్టు అని హరీశ్ విమర్శించారు. గంజాయి చెట్టు సమాజానికి చీడ అని ఎద్దేవా చేశారు. జనంతోపాటు సొంత పార్టీ ఎమ్మెల్యేలే రేవంత్ రెడ్డి పాలనను విమర్శిస్తున్నారని అన్నారు. నిజాలు మాట్లాడిన వారిని పిచ్చి కుక్కలు అంటావా ? అని హరీశ్ నిలదీశారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు ద్రోహం చేసింది కాంగ్రెస్ పార్టీ అయితే సీఎం రేవంత్ బీఆర్‌ఎస్‌పై నిందలు వేయడం తగదన్నారు. కృష్ణా జలాలకు సంబంధించి 299:512 వాటాల విషయంలో తాము సంతకం పెట్టామని నిరూపిస్తే తాను తన పదవికి రాజీనామా చేస్తానని, నిరూపించకపోతే రేవంత్ రెడ్డి రాజీనామా చేస్తారా ? అని సవాల్ విసిరారు.
అవినీతి దాహం, తెలంగాణకు ద్రోహం చేయడమే రేవంత్ రెడ్డి విధానమన్నారు. ముఖ్యమంత్రి పదవి పరువు తీస్తూ... తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీ కాళ్ల దగ్గర తాకట్టు పెడుతున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రాన్ని కరువుపాలు చేసి.. ఆంధ్రా నీటి దొంగతనానికి లోపాయికారిగా సహకరించడం వంటి వాటి నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే సిద్దిపేటలో సీఎం సభ పెట్టారని విమర్శించారు. సభలో ఇందిరమ్మ జీవిత బీమా పథకం కోసం ఒక్కమాట చెప్పలేదని, కేటీఆర్ గడ్డం, హరీశ్ రావు ఎత్తుపై వికృత వ్యాఖ్యలు చేసేందుకు సీఎం సిద్దిపేటకు రావాలా? అని ప్రశ్నించారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలే తనని విమర్శిస్తున్నారని ఆక్రోశంతో ఉన్న సీఎం రేవంత్.. తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు సిద్దిపేట సభ పేరిట సర్కస్ ఫీట్లు చేశారని ఆరోపించారు. సిద్ధిపేట సభలో విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్న రేవంత్ 63సార్లు కేసీఆర్ పేరు, 24 సార్లు కేటీఆర్ పేరును, అలాగే, 53 సార్లు తన పేరును ప్రస్తావించారని హరీశ్ వెల్లడించారు. గురుదక్షిణ చెల్లించుకునేందుకు రేవంత్ ఏపీకి వెయ్యి టీఎంసీల నీళ్లు వదిలిపెట్టారని హరీశ్ ఆరోపించారు.
ఈ వార్తలనూ చదవండి:
వీసా, మాస్టర్ కార్డ్, జేపీ మోర్గాన్‌పై సైబర్ దాడి.. కస్టమర్ల సమాచారం లీక్!
ఆపరేషన్ మిడ్‌నైట్ హ్యామర్.. 37 గంటల మిషన్‌లో ఏం జరిగిందంటే..