బంగారు మాటల మోసగాళ్లు
ABN , Publish Date - Mar 11 , 2026 | 04:54 AM
హైదరాబాద్ కేపీహెచ్‌బీలో గత ఏడాది మాట ఇది! మ్యాట్రిమోనీ సైట్‌లో ఓ వ్యక్తి తానో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ను అని ప్రొఫైల్ పెట్టుకున్నాడు.
ఒంటరి మహిళలు, పెళ్లీడు యువతులే లక్ష్యం
మ్యాట్రిమోనీ సైట్లు, సోషల్ మీడియా ద్వారా వల
టెకీ, బడా వ్యాపారవేత్తలమని చెప్పి పెళ్లి పేరుతో ముగ్గులోకి
ఆపై నగలు తీసుకొని ఉడాయింపు.. అడిగితే తిరిగి బెదిరింపులు
చాటింగ్‌లు, ఫొటోలు బయటపెడతామని బాధితులకు బ్లాక్‌మెయిల్
పసిడి ధర ఆకాశాన్నంటుతుండటంతో పెరుగుతున్న నయా మోసాలు
తెలుగు రాష్ట్రాల్లో వెయ్యి కేసులు.. స్వీయ అప్రమత్తతతోనే రక్షణ
హైదరాబాద్, మార్చి 10 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ కేపీహెచ్‌బీలో గత ఏడాది మాట ఇది! మ్యాట్రిమోనీ సైట్‌లో ఓ వ్యక్తి తానో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ను అని ప్రొఫైల్ పెట్టుకున్నాడు. ఓ మహిళ అతడిని సంప్రదిస్తే మాటలు కలిపాడు. ఆమెను ప్రేమలోకి దింపాడు. పెళ్లి చేసుకుంటాననీ చెప్పాడు. ఒకానొకరోజు.. ‘ఇంట్లో పూజ ఉంది. నీ నగలు తీసి ఇస్తే పసుపు, కుంకుమ పెట్టి ఇస్తాను’ అని చెప్పి.. ఆమె నుంచి 15 తులాల బంగారు నగలు తీసుకున్నాడు. తర్వాత మళ్లీ ఆమెను అతడు కలిస్తే ఒట్టు!!. బాధితురాలు పోలీసులను ఆశ్రయిస్తే.. మోసాలకు పాల్పడమే అతడు వృత్తిగా పెట్టుకున్నాడని.. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్, బిజినెస్‌మన్ పేర్లతో మ్యాట్రిమోనీ సైట్లలో ప్రొఫైల్స్ పెట్టి ఐదుగురు మహిళలను మోసం చేసినట్లు విచారణలో తేల్చారు. విడాకులు తీసుకున్న, ఒంటరి మహిళలనే అతడు లక్ష్యంగా చేసుకుంటాడని.. వారిని ప్రేమలోకి దించి, వివాహ నిశ్చితార్థం చేసుకుందామని నమ్మించి.. ఖరీదైన హోటళ్ల చుట్టూ తిప్పి.. ఆలయాలకు తీసుకెళ్లి దగ్గరైనట్లుగా నమ్మిస్తాడని చెప్పారు. ఆ వ్యక్తిపై గచ్చిబౌలి, కేపీహెచ్‌బీ, మియాపూర్ స్టేషన్లలో పలు కేసులు నమోదయ్యాయి. అతడిని పోలీసులు అరెస్టు చేసి.. 40 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నారు. బంగారం ధర బాగా పెరగడం.. తులం ధర వేలల్లోంచి లక్షకు చేరి.. లక్షన్నర కూడా దాటేయడంతో పసిడి దొంగలు మోపయ్యారు. చైన్ స్నాచర్లుగా మెడల్లోంచి నగలు లాగేసుకోకుండా.. టిప్‌టా్‌పగా ఆడవాళ్లకు ప్రేమ పేరుతో దగ్గరవుతున్నారు. మ్యాట్రిమోనీ సైట్ల ద్వారానో, పెళ్లి చూపుల పేరుతోనో మహిళలకు వలేస్తున్నారు. విడాకులు తీసుకొని ఒంటరిగా ఉంటున్న మహిళలనైతే వారి చేదు జీవితగాథను విని.. సానుభూతి ఒలకబోస్తున్నారు. దిగులు పడొద్దని.. పెళ్లితో కొత్త జీవితం ప్రారంభిద్దామని భరోసా వచనాలు పలుకుతారు.
పెళ్లీడు యువతులకేమో తాము బడా వ్యాపారవేత్తలమని నమ్మించి.. వివాహం తర్వాత విలాసవంతమైన జీవితంపై ఆశలు కల్పిస్తున్నారు. ఆ తర్వాతే తమ దోపిడీ ప్రణాళికను అమల్లోకి తెస్తున్నారు. ‘నీ నగలు పాతకాలం నాటివి.. మన పెళ్లికి కొత్త డిజైన్లు చేయిద్దాం’ అనో లేదంటే ‘బిజినెస్‌లో చిన్న సమస్య వచ్చిపడింది.. నీ నగలిస్తే తాకట్టు పెట్టి మళ్లీ విడిపిస్తా’ అనో సెంటిమెంటు పండిస్తున్నారు. ఆ మాయమాటలను నమ్మి మహిళలు తమ నగలను వారి చేతుల్లో పెట్టగానే ఉడాయిస్తున్నారు. కొందరు కేటుగాళ్లేమో ఆ తర్వాత కూడా బాధితుల కళ్లెదుటే దర్జాగా తిరుగున్నారు. నగలు తిరిగివ్వాలని అడిగితే బాధిత మహిళలపైనే ఉల్టా బ్లాక్‌మెయిల్‌కు దిగుతున్నారు. తమ మధ్య జరిగిన చాటింగ్‌ను, కలిసి దిగిన ఫొటోలను బయటపెడతామని హెచ్చరిస్తున్నారు. ఈ నయా దోపిడీదార్లను పోలీసులు గోల్డ్ బెగ్గర్స్/గిగ్గర్స్ (పసిడి మోసాలు)గా పిలుస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంతో పాటు పలు జిల్లా కేంద్రాల్లో ఈ తరహా పసిడి దొంగలు మోపయ్యారు. గత 12నెలల్లో ఈ తరహా కేసులు రాష్ట్రంలో 480కి పైగా, ఏపీలో 450కిపైగా నమోదయ్యాయి. పరువు పోతుందనే భయంతో చాలామంది ఫిర్యాదుకు దూరంగా ఉంటున్నారని, ఆ రకంగా బాధితుల సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉంటుందని పోలీసులు చెబుతున్నారు.
కొన్ని మోసాలు
మల్కాజిగిరికి చెందిన చిన్న రంగానాయక్ అనే ఘరానా మోసగాడు, మీర్‌పేటకు చెందిన ఒక మహిళను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మాయమాటలతో ఆమె నుంచి రూ.30లక్షల విలువైన బంగారాన్ని కాజేశాడు.
విశాఖలో ఒక యువకుడు ఇన్‌స్ట్రాగ్రామ్, ఇన్‌ఫ్లుయెన్సర్ పేరుతో కాలేజీ యువతులు, ఒంటరి మహిళలను వలలో వేసుకునేవాడు. తన రిచ్ లైఫ్ స్టైల్‌ను చూపిస్తూ.. మహిళలను ఆకర్షించేవాడు. ఖరీదైన బైక్‌లపై తిరుగుతూ యువతులకు బహుమతులిచ్చేవాడు. పరిచయం ముదిరా క.. బిజినెస్ అవసరం దృష్ట్యా డబ్బు అవసరం వచ్చిందని, నగలిస్తే తాకట్టుపెట్టి రెండు రోజుల్లో విడిపించి తిరిగిచ్చేస్తానని నమ్మించేవాడు. పోలీ సు రికార్డుల ప్రకారం..ఇతడు ఏడాదిలో 8మంది మహిళలనుంచి 25తులాల బంగారం కాజేశాడు.
విజయవాడలో ఒక ముఠా గోల్డ్ బెగ్గర్స్ తరహాలో పనిచేస్తోంది. మధ్యతరగతి మహిళలను లక్ష్యంగా చేసుకుని కుటుంబసభ్యులకు తెలియకుండా పెళ్లి చేసుకుందామని నమ్మించి ఇంటి నుంచి నగలతో బయటకు వచ్చేలా వారిని ప్రోత్సహిస్తోంది.. గుంటూరుకు చెందిన మహిళ తన వద్ద ఉన్న 10 తులాల బంగారం తీసుకుని ముఠాలోని ఓ వ్యక్తి వద్దకు వెళ్లగా ఆమెకు అతడు మత్తు మందిచ్చి నగలతో ఉడాయించాడు.
చిత్తూరుకు చెందిన చల్లా నారాయణ అలియాస్ కృష్ణ అనే వ్యక్తి మ్యాట్రిమోనీ సైట్లలో సూటు, బూటు వేసుకుని లగ్జరీ కార్లతో ఫొటోలు పెట్టి మహిళలను నమ్మించేవాడు. ఆపై జ్యువెలరీ షాపులో తక్కువ ధరకే కొత్త డిజైన్ చేయిస్తా అని వారి నుంచి నగలు తీసుకొని మాయమయ్యేవాడు. పెళ్లి చూపుల పేరుతో వెళ్లి మహిళల మెడలోని నగలను పరిశీలిస్తున్నట్లు నటించి మాయమాటలతో వాటిని తీసుకుని కారులో ఉడాయించేవాడు. చల్లా నారాయణ అనే సదరు వ్యక్తి అంతర్రాష్ట్ర మోసగాడని.. వితంతువులే లక్ష్యంగా మాట్రిమోనీ సైట్లలో వల వేస్తాడని, ఇతడిపై తెలుగు రాష్ట్రాల్లో డజనుకు పైగా కేసులున్నాయని పోలీసులు వెల్లడించారు.
తాను అమెరికాలో సెటిల్ అయ్యానని అత్యవసరంగా ఇండియాకొచ్చానంటూ ఒక వ్యక్తి వరంగల్‌కు చెందిన మహిళను నమ్మించాడు. తనకు కస్టమ్స్ క్లియరెన్స్ కోసం డబ్బు తక్కువైందని, తాత్కాలికంగా నగలు ఇస్తే విడిపించుకుని తిరిగి ఇచ్చేస్తానని నమ్మించాడు. ఆమె నగలు తీసుకున్నాక ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి మాయమయ్యాడు. బాధితుల్లో మహిళలే కాదు పురుషులూ ఉంటున్నారు. వరంగల్‌లో ఒక యువతి పెళ్లి చేసుకున్న కొద్దిరోజులకే రూ.2లక్షల నగదు, 8 తులాల బంగారంతో పరారైంది. ఆమెకు గతంలోనే వివాహమైందని, ఇదే తరహాలో ఐదుగురిని మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు.
తస్మాత్ జాగ్రత్త
సోషల్ మీడియా లేదా మ్యాట్రిమోనీ సైట్ల ద్వారా ఎవరైనా పరిచయమైతే వారి ఆర్థిక స్థితిగతులు, ఉద్యోగం గురించి పూర్తిస్థాయిలో ఆరా తీయకుండా వ్యక్తిగత వివరాలు చెప్పొద్దు. పరిచయమయ్యారు కదా అని ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు. బాధితుల్లో చాలా మంది పరువు పోతుందనే భ యంతో మోసాన్ని మౌనంగా భరిస్తున్నారు. మోసపోయినట్లు గుర్తించగానే 1930 (సైబర్ క్రైమ్) లేదా 100కి కాల్ చేయడమో.. స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచిస్తున్నారు.
దగ్గరకు వచ్చే వ్యక్తి అవసరం ఏమై ఉంటుందో గ్రహించాలి..
ప్రేమించిన వ్యక్తి అయినా సరే పెళ్లికి ముందే నగలను అడిగితే అది కచ్చితంగా మోసమే అని గుర్తించండి. అతడిని వెంటనే అనుమానించాలి. మ్యాట్రిమోనీ సైట్లలో ప్రొఫైల్స్ చూసి గుడ్డిగా నమ్మకుండా వారి ఆఫీసులకు వెళ్లి లేదంటే తెలిసినవారి ద్వారా విచారణ చేయాలి. పెళ్లి సంబంధం కుదుర్చుకునేటప్పుడు వారి నేపథ్యాన్ని లోతుగా విచారించడం అవసరం. ఏమైనా కొత్త పరిచయాలు ఏర్పడితే ఇంట్లో వారికి తెలియజేయాలి.
- జవహార్‌లాల్ నెహ్రూ. పి సీనియర్ సైకాలజిస్ట్, హైదరాబాద్
వైద్యురాలికే టోకరా
ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన జోగాడ వంశీకృష్ణ అలియాస్ హర్ష చెరుకూరి (33) పలు మ్యాట్రిమోనీ సైట్లలో యానాంకు చెందిన ఎమ్మెల్యే ఫొటోతో వివరాలు నమోదు చేశాడు. తానో సాఫ్ట్‌వేర్ ఉద్యోగినంటూ కలరింగ్ ఇచ్చాడు. మూడు పదుల వయసు దాటిన, రెండో వివాహం కోసం చూస్తున్న మహిళలనే లక్ష్యంగా చేసుకున్నాడు. తన తల్లి అమెరికాలో వైద్యురాలని, తాను స్థానికంగా వ్యాపారం చేస్తుంటానని, అమెరికా నుంచి అమ్మ రాగానే పెళ్లి చేసుకుందామంటూ నమ్మించేవాడు. నిరుడు మార్చిలో జూబ్లీహిల్స్‌కు చెందిన వైద్యురాలికి మ్యాట్రిమోనీ వెబ్‌సైట్ ద్వారా పరిచయమై అత్యవసర ఖర్చులంటూ రూ.10లక్షలకుపైగా విలువైన నగలు తీసుకుని ముఖం చాటేశాడు. నగలు తిరిగివ్వాలని ఆమె అడిగితే.. నగ్న వీడియోలు తయారు చేయించి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌చేస్తానని బెదిరించాడు. బాధితురాలి ఫిర్యాదుతో అతడిని అరెస్ట్ చేశారు. ఇతడిపై ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకలో 24 కేసులున్నాయి. దాదాపు 50 మంది మహిళలు/యువతుల నుంచి రూ.2.50 కోట్ల నగదు, బంగార నగలు కాజేసినట్లు పోలీసుల విచారణలో తేలింది.