Share News

పాదరసం ముప్పుపై ప్రపంచ సమరం!

ABN , Publish Date - Oct 05 , 2026 | 07:12 AM

ప్రపంచవ్యాప్తంగా మానవ ఆరోగ్యం, పర్యావరణంపై తీవ్ర ప్రభావం చూపుతున్న పాదరసం (మెర్క్యురీ) కాలుష్యంపై శాస్త్రీయ పరిశోధనలు, విధానాలు, సాంకేతిక పరిజ్ఞానం, భవిష్యత్‌ కార్యాచరణపై చర్చలకు సంగారెడ్డి జిల్లా కంది పరిధిలోని ఐఐటీ హైదరాబాద్‌ వేదికగా మారింది.

పాదరసం ముప్పుపై ప్రపంచ సమరం!
mercury pollution conference

  • ఐఐటీహెచ్‌ వేదికగా ‘ఐసీఎంజీపీ-2026’ సదస్సు

  • హాజరవుతున్న 26 దేశాల నుంచి శాస్త్రవేత్తలు, విధాన నిర్ణేతలు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు

  • తొలిసారి భారత్‌లో సదస్సు..

  • ఈ నెల 9 వరకు చర్చలు

కంది, అక్టోబరు 4 (ఆంధ్రజ్యోతి): ప్రపంచవ్యాప్తంగా మానవ ఆరోగ్యం, పర్యావరణంపై తీవ్ర ప్రభావం చూపుతున్న పాదరసం (మెర్క్యురీ) కాలుష్యంపై శాస్త్రీయ పరిశోధనలు, విధానాలు, సాంకేతిక పరిజ్ఞానం, భవిష్యత్‌ కార్యాచరణపై చర్చలకు సంగారెడ్డి జిల్లా కంది పరిధిలోని ఐఐటీ హైదరాబాద్‌ వేదికగా మారింది. ఆదివారం ఐఐటీలోని కన్వెన్షన్‌ సెంటర్‌లో ‘పాదరసం కాలుష్యంపై అంతర్జాతీయ సదస్సు (ఐసీఎంజీపీ)-2026 ప్రారంభమైంది. ఈ నెల 9వ తేదీ వరకు జరిగే ఈ అంతర్జాతీయ సదస్సులో 26 దేశాల నుంచి శాస్త్రవేత్తలు, విధాన నిర్ణేతలు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు, పర్యావరణ నిపుణులు, పరిశ్రమలు, శాస్త్రీయ ప్రచురణ సంస్థలు, సాంకేతిక నిపుణులు, ప్రభావిత వర్గాల ప్రతినిధులు పాల్గొంటున్నారు. ఇప్పటివరకు 17సార్లు ఈ సదస్సును నిర్వహించగా.. ఈసారి తొలిసారిగా భారత్‌లో జరుగుతుండటం గమనార్హం. మినమాటా ఒప్పందం కుదిరి పదేళ్లయిన సందర్భంగా విజయాలు, సవాళ్లు, భవిష్యత్‌ కార్యాచరణ అనే ప్రధాన ఇతివృత్తంతో ఈ సదస్సు జరుగుతోంది.


జపాన్‌లోని మినమాటా నగరం పేరుతోనే..

1940-60 మధ్య జపాన్‌లోని మినమాటా నగరం శివార్లలో ఉన్న చిస్సో కార్పొరేషన్‌ అనే సంస్థ సుమారు 27 టన్నుల మేర పాదరసం (మెర్క్యురీ) రసాయనాలను పక్కనే ఉన్న సముద్ర ప్రాంతంలోకి వదిలిపెట్టింది. ఆ పాదరసం చేపలు, రొయ్యలు, ఇతర సముద్ర జీవరాశుల్లో చేరింది. వాటిని ఆహారంగా తీసుకోవడంతో మనుషుల్లోకి చేరింది. మనుషులకు పాదరసం విషపూరితం. నాడీ వ్యవస్థ దెబ్బతిని.. మతిమరుపు, కండరాల బలహీనత, చెవుడు, పక్షవాతం వంటి సమస్యలు వస్తాయి. మినమాటా ప్రాంతంలో వేలాది మందికి ఈ సమస్యలు రావడంతో పరిశోధన చేసి.. పాదరసం కాలుష్యాన్ని గుర్తించారు. పాదరసం కాలుష్యంతో వచ్చే వ్యాధికి ఆ నగరం పేరిటే ‘మినమాటా’ అని పేరుపెట్టారు.


తాజా సదస్సులో మినమాటా ప్రాంతానికి చెందిన, ఆ వ్యాధి బాధితుల్లో ఒకరు తన అనుభవాలను వివరించనున్నట్టు నిర్వాహకులు తెలిపారు. ఇక సదస్సులో పాదరసం కాలుష్యాన్ని నియంత్రించేందుకు ప్రపంచ దేశాలు చేపట్టిన చర్యలు, సాధించిన పురోగతి, ఎదురవుతున్న సవాళ్లు, రాబోయే దశాబ్దంలో అనుసరించాల్సిన శాస్త్రీయ, సాంకేతిక, విధానపరమైన మార్గాలపై విస్తృతంగా చర్చించనున్నారు. తొలిరోజున ఐఐటీ హైదరాబాద్‌ ప్రొఫెసర్‌, సదస్సు చైర్‌ ప్రొఫెసర్‌ అసిఫ్‌ ఖురేషీ, శాస్త్రవేత్త జగన్నాథ్‌ బిశ్వకర్మ మాట్లాడారు. చైనా శాస్త్రవేత్త క్వింగ్‌రూవూ కు ఐసీఎంజీపీ ఎమర్జింగ్‌ రీసెర్చర్‌ అవార్డుతో పాటు.. భారత్‌తోపాటు వివిధ దేశాలకు చెందిన విద్యార్థులు, యువ పరిశోధకులకు సదస్సులో పాల్గొనేందుకు ట్రావెల్‌ అవార్డులు అందించారు.


ఇవి కూడా చదవండి...
ఏసీబీ కష్టపడి పట్టుకున్న నిందితులను లోపాయికారీగా వదిలేస్తారా?

హైదరాబాద్‌లో జర్నలిస్టులకు త్వరలో ఇళ్ల స్థలాలు: మంత్రి పొంగులేటి

టీమార్స్‌ చీఫ్‌ ఎవరో?

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 05 , 2026 | 07:12 AM