మూడంతస్తుల భవనంలో అగ్నిప్రమాదం.. 23 మంది సేఫ్
ABN , Publish Date - Apr 13 , 2026 | 11:33 AM
హైదరాబాద్‌లోని నాంపల్లి రెడ్‌హిల్స్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
హైదరాబాద్, ఏప్రిల్ 13: నాంపల్లి రెడ్‌హిల్స్‌లోని మూడంతస్తుల భవనంలో ఈరోజు(సోమవారం) భారీ అగ్నిప్రమాదం సంభవించింది. భవనం మూడో అంతస్తులో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాద సమయంలో భవనంలో 23 మంది నివాసితులు ఉన్నారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. మంటలు వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉన్నప్పటికీ, అగ్నిమాపక శాఖ సిబ్బంది త్వరితగతిన స్పందించి.. మంటలు ఇతర ఫ్లోర్లకు వ్యాపించకుండా నివారించారు. చివరకు మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చారు.
భవనంలో చిక్కుకున్న 23 మందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని, ప్రాణనష్టం ఏమీ లేదని అధికారులు తెలిపారు. భవనంలో ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. మంటలు పూర్తిగా అదుపులోకి రావడం, ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. అగ్నిప్రమాదంపై స్థానిక పోలీసులు, అగ్నిమాపక అధికారులు దర్యాప్తు మొదలుపెట్టారు.
ఇవి కూడా చదవండి...
కోతుల కోసం పెట్టిన విషాహారం తిని నాలుగేళ్ల బాలుడి మృతి
డ్యూటీ నుంచి తిరిగి వస్తుండగా ప్రమాదం.. కానిస్టేబుల్ మృతి
Read Latest Telangana News And Telugu News