అంబర్‌పేటలో కుటుంబం ఆత్మహత్య ఘటన.. డీసీపీ ఏం చెప్పారంటే
ABN , Publish Date - Mar 02 , 2026 | 03:17 PM
హ్యాండ్‌లోన్ వేధింపుల కారణంగా అంబర్‌పేటలో రామ్‌రాజ్ కుటుంబం ఆత్మహత్య చేసుకున్నట్లు సికింద్రాబాద్ జోన్ డీసీపీ రక్షిత మూర్తి తెలిపారు. ఈ ఘటనలో నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారన్నారు.
హైదరాబాద్, మార్చి 2: సికింద్రాబాద్ పరిధిలోని అంబర్‌పేట్‌లో కుటుంబం ఆత్మహత్య కేసును పోలీసులు ఛేదించారు. గత నెల 24న రామ్‌రాజ్‌తో పాటు అతడి భార్య మాధవి, కుమారుడు శశాంక్ రాజ్ బలవన్మరణానికి పాల్పడిన విషయం తెలిసిందే. కుటుంబం ఆత్మహత్యకు గల కారణాలను సికింద్రాబాద్ జోన్ డీసీపీ రక్షిత మూర్తి మీడియాకు తెలియజేశారు. అధిక వడ్డీతో హ్యాండ్‌లోన్ తీసుకుని తిరిగి ఇచ్చే వ్యవహారంలో వేధింపులకు గురి చేసిన కారణంగానే కుటుంబం ఆత్మహత్య చేసుకున్నట్లు డీసీపీ తెలిపారు. ఈ ఘటనలో నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారన్నారు.
‘మృతుడు రామ్‌రాజ్.. మల్లాపూర్, చక్రిపురం ప్రాంతంలో 'కింగ్స్ బిర్యానీ' హోటల్‌ను నిర్వహిస్తున్నారు. హోటల్ నిర్వహణ కోసం పలువురి నుంచి సుమారు 57 లక్షల రూపాయలు అప్పుగా తీసుకున్నారు. ఈ మొత్తాన్ని తిరిగి చెల్లించే విషయంలో అధిక వడ్డీ తీసుకుని, బ్లాక్ చెక్కులు, ప్రామిసరీ నోట్లు, ఒరిజినల్ భూమి డాక్యుమెంట్లు తీసుకుని తీవ్ర వేధింపులకు గురిచేశారు నిందితులు. ఆత్మహత్య చేసుకునే రోజు కూడా వేధింపులు కొనసాగించడంతో మనస్తాపంతో రామ్‌రాజ్ తన భార్య, కుమారుడితో కలిసి ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతుడి కుమార్తె అమూల్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు అంబర్‌పేట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు’ అని సికింద్రాబాద్ జోన్ డీసీపీ వెల్లడించారు.
మృతుడు రాసిన సూసైడ్ నోట్‌లో నలుగురు నిందితుల పేర్లు ప్రస్తావించడంతో పోలీసులు వారిని గుర్తించి అరెస్టు చేశారన్నారు సికింద్రాబాద్ జోన్ డీసీపీ. నిందితులు మహమ్మద్ వాసి, రాజశేఖర్ రెడ్డి, మహమ్మద్ నవాజ్, సయ్యద్ మాజీద్‌లను పట్టుకున్నట్లు తెలిపారు. హ్యాండ్‌లోన్‌ల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సికింద్రాబాద్ జోన్ డీసీపీ రక్షిత మూర్తి సూచించారు.
ఇవి కూడా చదవండి...
ప్రయాణికులకు అలర్ట్.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో విమానాలు రద్దు
పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం.. తెలంగాణ భవన్‌లో కంట్రోల్ రూమ్
Read Latest Telangana News And Telugu News