మాజీ ఎమ్మెల్యే రేఖానాయక్ ఇంట్లోఈడీ సోదాలు
ABN , Publish Date - Nov 21 , 2026 | 04:18 AM
సీఎంఆర్ ధాన్యం పక్కదారి పట్టిన కేసులో నిర్మల్ జిల్లా ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నాయకురాలు అజ్మీరా రేఖానాయక్ ఇల్లు, కార్యాలయంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు శుక్రవారం సోదాలు నిర్వహించారు.
సీఎంఆర్ ధాన్యం మాయం కేసులో కాంగ్రెస్ నేతపై విచారణ
కార్యాలయం, మిల్లులోనూ తనిఖీలు
30 లక్షల నగదు, పత్రాలు స్వాధీనం?
నా ఇంట్లో దొరికింది రూ.200
మీడియాతో రేఖానాయక్
హైదరాబాద్/ ఖానాపూర్, నవంబరు 20(ఆంధ్రజ్యోతి): సీఎంఆర్ ధాన్యం పక్కదారి పట్టిన కేసులో నిర్మల్ జిల్లా ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నాయకురాలు అజ్మీరా రేఖానాయక్ ఇల్లు, కార్యాలయంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు శుక్రవారం సోదాలు నిర్వహించారు. ఆమెకు సంబంధించిన ఏఆర్‌ఎస్ ఇండస్ట్రీస్ రైస్ మిల్లులో కూడా సోదాలు కొనసాగాయి. దాదాపు రూ.40.96 కోట్ల విలువైన 9,639 మెట్రిక్ టన్నుల ధాన్యం ఏఆర్‌ఎస్ ఇండస్ట్రీస్ నుంచి గల్లంతైందని పౌరసరఫరాల శాఖ అధికారులు గత ఆగస్టులో ఖానాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో ఏఆర్‌ఎస్ ఇండస్ట్రీస్ యజమాని అయిన రేఖా నాయక్‌తో పాటు మరికొందరిపై బీఎన్‌ఎ్‌స 316(2), 316(5), 318(4) సెక్షన్లతో పాటు నిత్యావసర వస్తువుల చట్టంలోని సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
ఆ కేసు ఆధారంగా ఇటీవల మనీలాండరింగ్ కోణంలో ఈసీఐఆర్ నమోదు చేసిన ఈడీ అధికారులు.. తాజాగా సోదాలు నిర్వహించారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సోదాలు కొనసాగాయి. నివాసంలోని బీరువా తాళాలు అందుబాటులో లేకపోవడంతో కట్టర్‌ను తెప్పించి దానిని తెరిచారు. ఈ సోదాల్లో రూ.30 లక్షల నగదుతో పాటు మనీలాండరింగ్‌కు సంబంధించి పలు కీలక ఆధారాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.
ప్రజలను దోచుకోలేదు: రేఖానాయక్
తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రజల సంపద దోచుకోలేదని, వారి మనసులు మాత్రమే దోచుకున్నానని రేఖానాయక్ అన్నారు. ఈడీ సోదాలు ముగిసిన తర్వాత ఆమె తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. పదేళ్లపాటు ప్రజల మధ్య ఉండి పనిచేశానని తెలిపారు. ఈడీ తనిఖీలకు పూర్తిగా సహకరించామని చెప్పారు. మిల్లు ఎప్పటి నుంచి ఉంది? దానిని స్వయంగా చూసుకుంటారా? రైస్ మిల్లు వ్యాపారంపై అవగాహన ఉందా? అని ఈడీ అధికారులు తనను ప్రశ్నించినట్లు ఆమె తెలిపారు. రైస్‌మిల్ వ్యాపారంపై తనకు పూర్తి అవగాహన లేదని వారికి చెప్పినట్లు వెల్లడించారు.
మిల్లు తన పేరుపైనే ఉన్నా.. వ్యాపారంలో ఏం జరిగిందో తనకు పూర్తిగా తెలియదని చెప్పారు. ధాన్యం తేడాలకు సంబంధించి రూ.12 కోట్ల అసలు బకాయికి పెనాల్టీ, వడ్డీ కలిపితే సుమారు రూ.22 కోట్లు అవుతుందని వివరించారు. సత్తెనపల్లిలోని ఏఆర్‌ఎస్ రైస్‌మిల్లును విక్రయించి ప్రభుత్వానికి బకాయిలు చెల్లిస్తామని కోర్టుకు గతంలోనే తెలిపినట్లు చెప్పారు. బీరువా లాకర్‌లో రూ.200 మాత్రమే ఉన్నాయని తెలిపారు. రాష్ట్రంలో 142 మంది మిల్లర్లపై కేసులు న మోదైతే.. తనపై మాత్రమే ఈడీ విచారణ జరుగుతోందని రేఖా నాయక్ ఆవేదన వ్యక్తంచేశారు. తనను అరె స్టు చేసినట్లు కొందరు తప్పుడు ప్రచారం చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఈ వార్తలనూ చదవండి:
వీసా, మాస్టర్ కార్డ్, జేపీ మోర్గాన్‌పై సైబర్ దాడి.. కస్టమర్ల సమాచారం లీక్!
ఆపరేషన్ మిడ్‌నైట్ హ్యామర్.. 37 గంటల మిషన్‌లో ఏం జరిగిందంటే..