డ్రగ్స్ పెడ్లర్ల ఆర్థిక మూలాలపై ఈగల్ నజర్
ABN , Publish Date - Oct 12 , 2026 | 05:50 AM
గోవా నుంచి హైదరాబాద్‌కు డ్రగ్స్ తరలిస్తున్న ముఠాలపై కొన్నాళ్లుగా దృష్టి పెట్టిన ఈగల్ బృందాలు తాజాగా ప్రధాన పెడ్లర్ ఫెర్నాండెజ్ అలియాస్ క్రిస్టీని అరెస్టు చేశాయి.
గోవాకుచెందిన పెడ్లర్ క్రిస్టీ అరెస్టు..
అతని ఖాతాకు పలువురి నుంచి రూ.48.4 లక్షలు
అతని ఫోన్‌లో తెలంగాణకు చెందిన 25 మంది నంబర్లు..
విచారిస్తున్న ఈగల్
హైదరాబాద్, అక్టోబరు 11(ఆంధ్రజ్యోతి): గోవా నుంచి హైదరాబాద్‌కు డ్రగ్స్ తరలిస్తున్న ముఠాలపై కొన్నాళ్లుగా దృష్టి పెట్టిన ఈగల్ బృందాలు తాజాగా ప్రధాన పెడ్లర్ ఫెర్నాండెజ్ అలియాస్ క్రిస్టీని అరెస్టు చేశాయి. గోవాకు చెందిన క్రిస్టీ కోసం ఈగల్ అధికారులు చాలాకాలంగా వెతుకుతున్నారు. అతను గోవాలోని కాలంగుట్, అగర్‌వాడ్డో, బార్జెజ్ ప్రాంతం నుంచి డ్రగ్స్ దందా సాగిస్తున్నాడని గుర్తించారు. అలాగే గోవా నుంచి డ్రగ్స్ పంపిస్తున్న వారికి డబ్బు ఎలా చేరుతోందనే విషయంపై దృష్టి సారించి.. క్రిస్టీ ఆర్థిక నెట్‌వర్క్‌పై నిఘా పెట్టారు. అరెస్టు చేసిన తర్వాత అతని బ్యాంకు ఖాతాలను పరిశీలించగా.. కొద్ది కాలంలోనే రూ.48.4 లక్షలు వివిధ వ్యక్తుల నుంచి వచ్చినట్లు గుర్తించారు.
తెలంగాణకు చెందిన 25 మంది వ్యక్తులు క్రిస్టీ ద్వారా డ్రగ్స్ కొన్నట్లు ఆన్‌లైన్ చెల్లింపులను బట్టి అనుమానిస్తున్నారు. ఈ మేరకు క్రిస్టీ మొబైల్ ఫోన్‌లోని కాంటాక్టు నంబర్లు, పేర్లును విచారిస్తున్నామని ఈగల్ అధికారులు తెలిపారు. ఈ ఏడాది మే 9న పంజాగుట్ట పోలీసులు కేశవ్‌రాజ్ సింగ్ అనే వ్యక్తిని డ్రగ్స్ విక్రయిస్తుండగా పట్టుకున్నారు. అతని కారు డాష్‌బోర్డు నుంచి 13 గ్రాముల ఎండీఎంఏ, 7 గ్రాముల చరస్ స్వాధీనం చేసుకున్నారు. పోలీసు విచారణలో మారేడ్‌పల్లికి చెందిన వేదాంక్, గోవాకు చెందిన క్రిస్టీల వద్ద నుంచి కేశవ్ డ్రగ్స్ కొని హైదరాబాద్‌లో విక్రయిస్తున్న విషయం బయటపడింది. గోవాలో ఉంటూ డ్రగ్స్ దందా చేస్తున్న నైజీరియన్ నిగికి క్రిస్టీకి మధ్య సంబంధాలు ఉన్నట్లు ఈగల్ అధికారులు అనుమానిస్తున్నారు.
క్రిస్టీ ఫోన్‌లో ఉన్న పేర్లు
తెలంగాణకు చెందిన 25మంది క్రిస్టీతో కాంటాక్ట్ అయ్యారన్న విషయాన్ని ఆన్‌లైన్ చెల్లింపుల ద్వారా గుర్తించిన పోలీసులు ఆ వివరాలను మీడియాకు అందజేశారు. రాష్ట్రంలో నివసిస్తున్న తరుణ్, అవ్యక్త్ రెడ్డి, శ్రీరామ్, విక్రాంతు, రిచు, గోకుల్, విష్ణు, సూద్, చేతన్, అరవింద్, హమీద్, సునీల్, అజయ్‌వర్మ, సలీత్, పరాజిత్, వినీత్, అర్జున్, ఈశ్వర్, శరణ్, కరణ్, ప్రీతమ్, తేజ్‌దీప్, రవీందర్, మనోజ్, అది్‌పల పేర్లు క్రిస్టీ కాంటాక్ట్ లిస్టులో ఉన్నాయని పేర్కొన్నారు. కేవలం పేరు, నంబరు ఉండటంతోనే వారు డ్రగ్స్ తీసుకున్నారని నిర్ధారించలేమని, ఒక వేళ నిర్ధారణ అయితే చట్టప్రకారం చర్యలు ఉంటాయని ఈగల్ ఫోర్స్ డైరెక్టర్ సందీప్ శాండిల్య తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి:
ఏఐ వినియోగంలో జవాబుదారీతనం ముఖ్యం
భర్తను చెట్టుకు కట్టేసి కొట్టి చంపిన భార్య
Read Latest AP News And Telangana News