సస్పెన్షన్ వేటు పడిన డీఎస్పీ భీమ్‌రెడ్డికి మరో షాక్
ABN , Publish Date - Sep 03 , 2026 | 10:20 AM
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సస్పెన్షన్ వేటు పడిన డీఎస్పీ భీమ్‌రెడ్డికి మరో షాక్ తగిలింది. మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎంట్రీ ఇచ్చింది. అతడిపై ఈసీఐఆర్ (ECIR) కేసును ఈడీ నమోదు చేసింది.
హైదరాబాద్, సెప్టెంబర్ 03: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సస్పెన్షన్ వేటు పడిన డీఎస్పీ భీమ్‌రెడ్డికి మరో షాక్ తగిలింది. మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎంట్రీ ఇచ్చింది. అతడిపై ఈసీఐఆర్ (ECIR) కేసును ఈడీ నమోదు చేసింది. పీఎంఎల్‌ఏ (PMLA) కింద దర్యాప్తు చేపట్టింది. అతడికి రూ.150 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్లు ఇప్పటికే గుర్తించారు. ఈ నేపథ్యంలో భీమ్‌రెడ్డి ఆస్తులపై ఈడీ దృష్టి సారించింది. అక్రమాస్తుల కేసులో అతడిపై ఇప్పటికే ఏసీబీ కేసు నమోదు చేసింది.
ఈ కేసు ఆధారంగా చేసుకుని ఈడీ విచారణ చేపట్టనుంది. అవినీతి ద్వారా వచ్చిన నగదును ఆస్తుల్లోకి మళ్లించారా? అనే అంశంపై ఈడీ ఆరా తీస్తుంది. మణికొండ, గచ్చిబౌలి, తెల్లాపూర్ నుంచి బెంగళూరు వరకు తన ఆస్తులను భీమ్‌రెడ్డి విస్తరించినట్లు ఇప్పటికే గుర్తించారు. అలా దాదాపు 20 ఆస్తుల వరకు గుర్తించారు. వాటిలో అధికంగా బినామీల పేర్లతో ఉన్నట్లు సందేహం వ్యక్తమవుతుంది.
భీమ్‌రెడ్డిపై ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌లో రూ.2.4 కోట్ల అక్రమాస్తులు ఉన్నట్లు నమోదు చేశారు. కానీ సోదాల్లో మాత్రం రూ.150 కోట్లకుపైగా ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు. దీంతో భీమ్‌రెడ్డి పెట్టుబడులపై ఐటీ శాఖలోని బినామీ విభాగం కూడా విచారణ చేపట్టింది. భీమ్‌రెడ్డి కేసును ఈడీ దర్యాప్తుతో మరింత ఉత్కంఠగా మారింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జూలై 6న భీమ్‌రెడ్డి అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే.