ఏదుల నుంచే డిండికి నీళ్లు
ABN , Publish Date - Oct 24 , 2026 | 04:52 AM
డిండి ఎత్తిపోతల పథకానికి నీటిని ఎక్కడి నుంచి తరలించాలనే ఉత్కంఠకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెరదించారు.
అచ్చంపేట ఎత్తిపోతల పథకానికి కూడా..
పాలమూరు నీటికి గండి పడకుండా
అదనంగా శ్రీశైలం నుంచి ఏదుల వరకు
0.6 టీఎంసీల ఎత్తిపోత
నీటి తరలింపు సమస్యకు సీఎం పరిష్కారం
ఇరిగేషన్ ప్రాజెక్టులపై సమీక్షలో ప్రతిపాదన
తుమ్మిడిహెట్టి బ్యారేజీపై
త్వరలోనే మహారాష్ట్రతో చర్చలు
152 మీటర్ల ఎత్తు బ్యారేజీకి ఒప్పించేలా
వాదనలుండాలన్న ముఖ్యమంత్రి
హైదరాబాద్, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): డిండి ఎత్తిపోతల పథకానికి నీటిని ఎక్కడి నుంచి తరలించాలనే ఉత్కంఠకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెరదించారు. ఈ అంశంపై ఉమ్మడి మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల ప్రజాప్రతినిధుల మధ్య నెలకొన్న వివాదానికిముగింపు పలుకుతూ పరిష్కారం దిశగా నిర్ణయం తీసుకున్నారు. డిండి ప్రాజెక్టుతోపాటు అచ్చంపేట ఎత్తిపోతల పథకానికి కూడా ఏదుల రిజర్వాయర్ నుంచే నీటిని తీసుకోవాలని నిర్ణయించారు.
ఏదుల రిజర్వాయర్ నుంచి డిండి ప్రాజెక్టుకు 0.5 టీఎంసీలు, అచ్చంపేట ఎత్తిపోతల పథకానికి 0.1 టీఎంసీల నీటిని లిఫ్ట్ చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ రెండు ప్రాజెక్టులకు అవసరమయ్యే 0.6 టీఎంసీల నీటిని శ్రీశైలం నుంచి అదనంగా సమకూర్చుకునే ఏర్పాట్లు చేయాలన్నారు. శుక్రవారం డాక్టర్ మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి, మంత్రులు జూపల్లి కృష్ణారావు, శ్రీధర్‌బాబు, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి, నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో సీఎంసమీక్ష నిర్వహించారు.
శ్రీశైలం నుంచి నార్లాపూర్‌కు, అక్కడి నుంచి ఏదుల రిజర్వాయర్ వరకు ఈ అదనపు నీటిని లిఫ్ట్ చేసేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలన్నారు. ఎక్కడెక్కడ పంపులు, పంప్‌హౌ్‌సలు అవసరం? ఇప్పుడున్న కెనాల్స్, సొరంగం సామర్థ్యం సరిపోతుందా? ఎక్కడ కాల్వల సామర్థ్యం పెంచుకోవాలి? వంటి అంశాలపై అధ్యయనం చేసి.. డిజైన్లు తయారు చేసుకోవాలని ఆదేశించారు. దీనివల్ల పాలమూరు ప్రాజెక్టు నీటి అవసరాలకు కోత పడదని అన్నారు.
అభ్యంతరాలపై విస్తృత చర్చ..
డిండికి నీటిని ఏదుల నుంచి తీసుకోవాలా? లేక నార్లాపూర్ నుంచి తీసుకోవాలా? అనే విషయంలో మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల ప్రజాప్రతినిధుల అభ్యంతరాలు, విజ్ఞప్తులపై సీఎం నిర్వహించిన సమావేశంలో విస్తృతంగా చర్చ జరిగింది. ఈ సందర్భంగా.. నార్లాపూర్ నుంచి నీటిని తరలిస్తే ఎంత ఖర్చు అవుతుంది, ఏదుల నుంచి తీసుకుంటే ఎంత అవుతుందనే విషయాన్ని అధికారులు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. అనుకూలతలు, ప్రతికూలతలన్నింటినీ తెలిపారు.
మధ్యేమార్గంగా పాలమూరు ప్రాజెక్టు నీటికి ఢోకా లేకుండా డిండి, అచ్చంపేట ఎత్తిపోతలకు నీటిని లిఫ్ట్ చేేసందుకు వీలుగా అదనపు నీటిని తెచ్చుకునే పనులు చేపట్టాలని ముఖ్యమంత్రి చేసిన సూచనకు మంత్రులు మద్దతు తెలిపారు. ఇక తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణంపై మహారాష్ట్ర ప్రభుత్వంతో త్వరలో జరిగే చర్చలకు సిద్ధంగా ఉండాలని అధికారులను సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ఈ నెల 23 తర్వాత చర్చలకు ఆహ్వానిస్తానని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ ఇటీవలే సూచనప్రాయంగా తెలియజేశారని వెల్లడించారు.
కాగా, తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణంతో మహారాష్ట్ర పరిధిలో ఎక్కడా గ్రామాలు ముంపునకు గురయ్యే ప్రమాదం లేదని అధికారులు వివరించారు. 152 మీటర్ల ఎత్తున బ్యారేజీ నిర్మిస్తే దాదాపు 2300 ఎకరాల భూములు ముంపునకు గురవుతాయని, 150 మీటర్ల ఎత్తున నిర్మిస్తే వెయ్యి ఎకరాల లోపే ముంపు ప్రభావం ఉంటుందని తెలిపారు. దీంతో మహారాష్ట్రలో ముంపు ప్రభావాన్ని అంచనా వేసుకొని, సాధ్యమైనంత నీటిని తెచ్చుకునేందుకు వీలుగా ఈ బ్యారేజీ నిర్మించాలని సీఎం ఆదేశించారు.
తుమ్మిడిహెట్టి వివరాలు సీడబ్ల్యూసీకి ఇవ్వండి..
తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణంతో చోటుచేసుకునే ముంపుపై కచ్చితమైన వివరాలతో సిద్ధంగా ఉండాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇటీవల ఢిల్లీలో కేంద్ర జలవనరుల సంఘం (సీడబ్ల్యూసీ) ఆధ్వర్యంలో జరిగిన సమావేశాల వివరాలు, అక్కడ చర్చించిన అంశాలు, కోరిన సమాచారాన్ని సీడబ్ల్యూసీకి అందజేయాలన్నారు. అటవీ, గిరిజన ప్రాంతం, అత్యంత వెనుకబడిన ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు ఈ బ్యారేజీ నిర్మిస్తున్నామని తెలిపారు. ఆ లక్ష్యాన్ని సాధించే సంకల్పంతో మహారాష్ట్ర ప్రభుత్వంతో సానుకూల చర్చలు, సంప్రదింపులు జరగాలని ఆకాంక్షించారు.
గతంలోనే 148 మీటర్ల ఎత్తుకు మహారాష్ట్ర అంగీకరించిందని, అయితే అంత తక్కువ ఎత్తున బ్యారేజీ నిర్మిేస్త ఆశించినంత నీటిని తెచ్చుకునే వీలుండదని సీఎం అన్నారు. అందుకే 152 మీటర్ల ఎత్తున బ్యారేజీ నిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించేందుకు అవసరమైన సాంకేతిక నివేదికలు, నీటి లభ్యత, ముంపు విస్తీర్ణం, ఇతర అంశాలకు సంబంధించిన పూర్తి వివరాలను సిద్ధంగా ఉంచాలన్నారు. తెలంగాణ నీటి అవసరాలను తెలియజేసి, మన వాదనను సమర్థంగా వినిపించాలని మంత్రులకు సీఎం సూచించారు.
‘డిండి’ విషయంలో సీఎం నిర్ణయంపై సీపీఐ హర్షం
డిండి ఎత్తిపోతల పథకానికి ఏదుల నుంచి నీటిని ఎత్తిపోసేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులకు సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలు జారీ చేయడంపై సీపీఐ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఫ్లోరైడ్ పీడిత దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాలకు తాగు, సాగునీటి కోసం ఉద్దేశించిన డిండి ప్రాజెక్టు పూర్తి చేయడానికి ప్రభుత్వం సముచిత నిర్ణయం తీసుకుందని సీపీఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం శుక్రవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. ఏడాది క్రితం పిలిచిన టెండర్లలో ఎలాంటి జాప్యం లేకుండా ఎత్తిపోతల పనులు చేయాలని కోరారు. డిండికి కేటాయించిన 0.5 టీఎంసీల నీటి విషయంలో సీఎం చూపిన చొరవపై అభినందనలు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
Read Latest Telangana News And Telugu News