ధరణి అక్రమాలపై ప్రభుత్వానికి ఉన్నతస్థాయి కమిటీ నివేదిక
ABN , Publish Date - Jan 24 , 2026 | 08:53 PM
ధరణి పోర్టల్‌లో జరిగిన అక్రమాలపై ఉన్నతస్థాయి కమిటీ.. తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. ధరణి అక్రమాలపై ఫోరెన్సిక్ ఆడిట్‌లో పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది.
హైదరాబాద్: ధరణి పోర్టల్‌లో జరిగిన అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నతస్థాయి కమిటీ తన నివేదికను సమర్పించింది. భూభారతి పోర్టల్ ద్వారా చేపట్టిన లోతైన ఆడిట్, ఫోరెన్సిక్ విచారణల్లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా ధరణి పోర్టల్‌లో ఉన్న లోపాల వల్లే భూకబ్జాలు, అక్రమ రిజిస్ట్రేషన్లు చోటుచేసుకున్నట్లు నివేదికలో స్పష్టమైంది.
సిద్దిపేట, సిరిసిల్ల జిల్లాల్లో భారీ స్థాయిలో అక్రమాలు జరిగినట్లు కమిటీ గుర్తించింది. ధరణి లొసుగులను ఆసరాగా చేసుకుని ప్రభుత్వ భూములను కాజేసే ప్రయత్నాలు జరిగినట్టు ఫోరెన్సిక్ ఆడిట్‌లో తేలింది. ఈ అక్రమాల్లో స్థానికంగా పెద్దల పాత్రపై కూడా విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే 9 జిల్లాల్లోని 35 మండలాల్లో జరిగిన అక్రమాలపై లోతైన విచారణ జరిపిన అధికారులు, మొత్తం 48 మందిపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. 4,848 భూ లావాదేవీల్లో లోటుపాట్లు గుర్తించినట్లు నివేదిక వెల్లడించింది. అలాగే 1,109 డాక్యుమెంట్లకు సంబంధించి సుమారు రూ.4 కోట్ల మేర ప్రభుత్వానికి చెల్లింపులు బాకీ ఉన్నట్టు తేలింది.
భవిష్యత్తులో ఇలాంటి అక్రమాలు జరగకుండా ధరణి వ్యవస్థను పూర్తిగా సంస్కరించాల్సిన అవసరం ఉందని కమిటీ సూచించింది. దీనిలో భాగంగానే భూభారతి పోర్టల్ ద్వారా ఆడిట్‌ను కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. త్వరలోనే రాష్ట్రంలోని మొత్తం 31 జిల్లాల్లో ఫోరెన్సిక్ ఆడిట్‌ను విస్తరించనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రభుత్వ భూముల కాజేయడంలో సంబంధం ఉన్న పెద్దల పాత్రపై కూడా సమగ్ర విచారణ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. అక్రమాలకు బాధ్యులైన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. ధరణి అక్రమాలపై వచ్చిన ఈ నివేదిక రాష్ట్ర రాజకీయ, పరిపాలనా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఈ వార్తలు కూడా చదవండి...
నాంపల్లి ఫర్నీచర్ గోదాంలో భారీ అగ్నిప్రమాదం
ఫోన్‌ట్యాపింగ్ కేసులో దోషులకు కఠిన శిక్షలు తప్పవు: మంత్రి జూపల్లి
Read Latest Telangana News And Telugu News