Share News

సైబర్‌ వలలో రూ.45.77 లక్షలు

ABN , Publish Date - Oct 17 , 2026 | 06:38 AM

సైబర్‌ నేరగాళ్లు ముందుగా చిన్న లాభాలు చూపించి నమ్మిస్తున్నారు. ఆ తర్వాత భారీగా పెట్టుబడులు పెట్టిస్తున్నారు. చివరకు విత్‌డ్రా సమయంలో ఫీజులు, చార్జీల పేరుతో మరింత గుంజుతున్నారు.

సైబర్‌ వలలో రూ.45.77 లక్షలు
Cyberabad Cyber Crime

  • క్యాష్‌బ్యాక్‌, ట్రేడింగ్‌, లాటరీ...

  • విదేశీ ఉద్యోగం, కుక్కపిల్ల పేరుతో మోసాలు

  • సైబరాబాద్‌ పరిధిలో ఆరు కేసులు నమోదు

  • చైనా వ్యక్తికి మ్యూల్‌ ఖాతాలు

  • సమకూరుస్తున్న నలుగురి అరెస్టు

హైదరాబాద్‌ సిటీ, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి): సైబర్‌ నేరగాళ్లు ముందుగా చిన్న లాభాలు చూపించి నమ్మిస్తున్నారు. ఆ తర్వాత భారీగా పెట్టుబడులు పెట్టిస్తున్నారు. చివరకు విత్‌డ్రా సమయంలో ఫీజులు, చార్జీల పేరుతో మరింత గుంజుతున్నారు. ఇదే పంథాలో ఆరు కేసుల్లో రూ.45.77 లక్షలు కాజేశారు. బాధితుల ఫిర్యాదులతో సైబరాబాద్‌ సైబర్‌ క్రైం పోలీసులు కేసులు నమోదు చేశారు. మోసాల వివరాలు ఇవీ... ‘ఎస్డీ పే’ యాప్‌లో రోజువారీ క్యాష్‌బ్యాక్‌ ఆశ చూపి మంచిరేవులకు చెందిన ఐటీ ఉద్యోగి నుంచి రూ.18.70 లక్షలు కాజేశారు. ‘స్వాస్థిక రీసెర్చ్‌’ పేరుతో స్టాక్‌ ట్రేడింగ్‌ లాభాలంటూ ఇంజనీర్‌ (26) నుంచి తొలుత రూ.30 వేల పెట్టుబడితో మొదలుపెట్టించి చివరకు రూ.11.18 లక్షలు దోచుకున్నారు. టెలిగ్రామ్‌ గ్రూప్‌ ద్వారా ఫారెక్స్‌ ట్రేడింగ్‌ పేరుతో బాచుపల్లికి చెందిన గృహిణి నుంచి రూ.5.08 లక్షలు తీసుకుని మోసం చేశారు.


కేరళ లాటరీలో రూ.8 లక్షల బహుమతి వచ్చిందని ఆ సొమ్ము తీసుకోవాలంటే పలు చార్జీలు చెల్లించాలంటూ సుచిత్ర వాసి నుంచి రూ.3.27 లక్షలు వసూలు చేశారు. అలాగే సింగపూర్‌లోని జేపీ మోర్గాన్‌ చేజ్‌లో సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ పోస్టు ఇప్పిస్తామని... నల్లగండ్లకు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి(56) నుంచి సర్టిఫికేషన్‌, బ్యాక్‌గ్రౌండ్‌ వెరిఫికేషన్‌, వైద్య పరీక్షల పేరుతో రూ.3.01 లక్షలు వసూలు చేశారు. మరో రూ.2.80 లక్షలు అడగడంతో ఆయనకు అనుమానం వచ్చి ఇకపై చెల్లించలేనని, ఇప్పటివరకు ఇచ్చినది తిరిగివ్వాలని కోరగా స్పందించలేదు. మరో కేసులో ఇన్‌స్టాగ్రామ్‌లో అలబాయ్‌ కుక్కపిల్లను అమ్ముతామని నమ్మించి ఖానాపూర్‌కు చెందిన యువకుడి(23) నుంచి రూ.4.50 లక్షలు తీసుకుని ఫోన్లు స్విచ్చాఫ్‌ చేశారు.


కాగా మరో ఘటనలో పోలీసులు మ్యూల్‌ ఖాతాల ముఠా గుట్టురట్టు చేశారు... సైబర్‌ మోసాల సొమ్మును మళ్లించేందుకు ఓ ముఠా చైనా వ్యక్తికి మ్యూల్‌ ఖాతాలు, సిమ్‌ కార్డులు సమకూరుస్తోంది. ఈ ముఠాలో నలుగురిని నగర సైబర్‌ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌ పేరుతో నగర మహిళ నుంచి రూ.37.40 లక్షలు కాజేసిన కేసు దర్యాప్తులో ఈ ముఠా వెలుగులోకి వచ్చింది. భువనగిరికి చెందిన ప్రధాన నిందితుడు పాండురాజు అభిషేక్‌(26) భీమవరానికి చెందిన ముగ్గురి ద్వారా 20 బ్యాంకు ఖాతాలు తెరిపించాడు. ఒక్కో ఖాతాకు రూ.10 వేలు ఇచ్చాడు. ఆ ఖాతాల్లో పడిన సొమ్మును చైనా వ్యక్తి ఖాతాలకు బదిలీ చేస్తూ 4 శాతం కమీషన్‌ తీసుకునేవాడు. కాగా ఈ ఖాతాలపై దేశవ్యాప్తంగా 54 కేసులు నమోదయ్యాయి. వీటి ద్వారా సుమారు రూ.10 కోట్ల లావాదేవీలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. 20 ఖాతాలను ఫ్రీజ్‌ చేశారు. నిందితుల నుంచి 9 ఫోన్లు, 10 డెబిట్‌ కార్డులు, 6 పాస్‌బుక్‌లు, 8 చెక్‌బుక్‌లు స్వాధీనం చేసుకున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

సీనియర్‌ సిటిజన్స్‌ కమిషన్‌ చీఫ్‌ కమిషనర్‌గా జస్టిస్‌ తిరుమలాదేవి

త్వరలో యూఎల్‌సీ మార్గదర్శకాలు?

సొంత మనుషులపై మరిగే నీళ్లు పోయడం కేటీఆర్‌ నైజం

Read Latest AP News And Telangana News And International

Updated Date - Oct 17 , 2026 | 06:38 AM