ఉప సంఘాలు.. ఉత్తుత్తివేనా?
ABN , Publish Date - Apr 27 , 2026 | 05:06 AM
సంక్షేమ పథకాల అమలు, ప్రజలకు సంబంధించిన అంశాలు, క్లిష్టమైన సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఏర్పాటవుతున్న మంత్రి వర్గ ఉప సంఘాల పని తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏదైనా అంశంపై లోతైన అధ్యయనం......
రెండున్నరేళ్లలో 22 సబ్ కమిటీల ఏర్పాటు
వాటిలో నివేదికలిచ్చింది నాలుగైదు కమిటీలే.. మిగతా విషయాల్లో ఇప్పటిదాకా ఏమీ తేల్చని పరిస్థితి
కాలయాపన కోసమే ఈ తతంగమంటూ విమర్శలు.. అధికారులతోనూ కమిటీలు.. వాటి పనితీరు అంతంతే
హైదరాబాద్, ఏప్రిల్ 26 (ఆంధ్రజ్యోతి): సంక్షేమ పథకాల అమలు, ప్రజలకు సంబంధించిన అంశాలు, క్లిష్టమైన సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఏర్పాటవుతున్న మంత్రి వర్గ ఉప సంఘాల పని తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏదైనా అంశంపై లోతైన అధ్యయనం చేయాలని, సమగ్ర వివరాలతో నివేదిక తెప్పించుకోవాలని ప్రభుత్వం భావిస్తే.. మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక దాదాపు 22 ఉప సంఘాలు ఏర్పాటు కాగా.. వీటిలో చాలా వరకు నివేదికలు కూడా ఇవ్వకపోవడం, కొన్ని కమిటీలు ఉనికిలో కూడా లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలో 2023 డిసెంబరు 7న కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైంది. 6 గ్యారెంటీల అమలు మొదలుకుని అప్పటికప్పుడు తెరపైకి వచ్చిన అనేక అంశాలపై లోతైన విశ్లేషణ కోసం ప్రభుత్వం మంత్రి వర్గ ఉపసంఘాలను ఏర్పాటు చేసింది. ఇలా.. 2024 జనవరి నుంచి 2026 ఏప్రిల్ 17 వరకు దాదాపు 22పైగా క్యాబినెట్ సబ్ కమిటీలను నియమించింది. కమిటీల నియామకం వరకు బాగానే ఉన్నా.. వాటి పని తీరే చర్చనీయాంశంగా మారుతోంది. ఉద్దేశం భాగానే ఉన్నా.. కొన్ని కమిటీల పనితీరు ఆశించిన స్థాయిలో లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అలాగే, పలు ప్రభుత్వ శాఖల ముఖ్య అధికారులతోనూ కొన్ని కమిటీలను ఏర్పాటు చేయగా.. వాటి పని తీరు అంతంతమాత్రంగానే ఉందన్న వాదన వినిపిస్తోంది. ఆర్టీసీ సమస్యల పరిష్కారం కోసం వేసిన కమిటీలు సరైన సమయంలో నివేదిక ఇవ్వకపోవడం వల్లే... కార్మికులు సమ్మెకు వెళ్లారని పలువురు గుర్తు చేస్తున్నారు.
నివేదికలు కొన్నే..
ఇప్పటి వరకు ఏర్పాటైన మంత్రి వర్గ ఉప సంఘాల్లో కొన్ని మాత్రమే నివేదికలు ఇవ్వగా, మిగిలిన కమిటీలు కాలయాపన చేస్తున్నాయన్న విమర్శలు ఉన్నాయి. ఉదాహరణకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక 6 గ్యారెంటీల అమలు కోసం ఒక కమిటీని నియమించింది. వీటిలో కొన్ని పథకాలు మాత్రమే ప్రస్తుతం అమలవుతున్నాయి. అమలుకు నోచుకోని పథకాలను ఎలా ముందుకు తీసుకెళ్లాలన్న దానిపై సంబంధిత కమిటీ ఇంతవరకూ పూర్తిస్థాయి నివేదిక ఇవ్వలేదని తెలిసింది. అదే సమయంలో రాష్ట్ర గేయం, లోగో కోసం ఏర్పాటు చేసిన కమిటీ.. తన నివేదికను అందించింది. దాంతో రాష్ట్ర గేయాన్ని రెండు వర్షన్లలో ప్రభుత్వం విడుదల చేసింది. లోగో విషయం మాత్రం ఇంకా ఖరారు కాలేదు. అలాగే, కుల సర్వే నిర్వహణ, నివేదికల రూపకల్పనకు సంబంధించిన అంశాలపై ఏర్పాటైన ఉప సంఘం ప్రభుత్వానికి గతంలోనే నివేదిక సమర్పించింది. అయితే, కుల సర్వే వివరాలను వెల్లడించిన తర్వాత కులాల పేర్లు, వివరాలు తప్పుగా ఉన్నాయంటూ ఫిర్యాదులు వెల్లువెత్తినా.. ఈ అంశంపై క్యాబినెట్ సబ్ కమిటీ భేటీ కాలేదు. ఇటీవల ఆయా కులాల్లోని జనాభా లెక్కలను విడుదల చేయడంతో సబ్ కమిటీ భేటీ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఇక, సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఎస్సీ వర్గీకరణ కోసం పలువురు మంత్రులతో కూడిన కమిటీని నియమించగా, ఆ కమిటీ పలుమార్లు భేటీ అయి నివేదిక ఇచ్చింది. ఆ తర్వాతే అసెంబ్లీ వేదికగా ఎస్సీ వర్గీకరణ అమలుకు మార్గం సుగమమైంది. తెలుగు సినిమా పరిశ్రమ అభివృద్ధి, సమస్యల పరిష్కారానికి ఒక కమిటీని వేయగా, ఇంతవరకూ కమిటీ భేటీ కాలేదని సంబంధిత వర్గాల సమాచారం. అలాగే, ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు, జీవో 317 కోసం ఏర్పాటైన కమిటీ కూడా ఆశించిన స్థాయిలో పనిచేయలేదని, ఆ కారణంగానే ఉద్యోగులు మళ్లీ ఆందోళనకు పిలుపునిచ్చారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా విద్యాభివృద్ధి కోసం ఏర్పాటైన కమిటీ కూడా పూర్తిస్థాయి నివేదిక ఇవ్వలేదని సమాచారం. అలాగే, రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటు, పెట్టుబడుల కోసం ఒక సబ్ కమిటీని నియమించారు. ఈ కమిటీ సైతం ఇప్పటివరకు నివేదిక ఇవ్వకపోగా, పరిశ్రమలకు ప్రోత్సాహం దిశగా తీసుకున్న చర్యలు కూడా ఏమీ లేవనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కేవలం దావోస్, గ్లోబల్ సమ్మిట్ సమయంలో పెట్టుబడి ఒప్పందాలు మినహా కొత్తగా ఎలాంటి పెట్టుబడులు రాలేదన్న చర్చ జరుగుతోంది. ఇక, ఆదాయ పెంపు కోసం ఏర్పాటైన కమిటీ కొద్దిరోజుల పాటు వరుస భేటీలు నిర్వహించింది.
తాజాగా నాలుగైదు రోజుల నుంచి ఈ కమిటీ భేటీ అవుతోంది. కానీ ఈ సమావేశాల్లోనూ ఎలాంటి నిర్ణయాలు తీసుకోవడం లేదనే అభిప్రాయాలున్నాయి. మూసీ పునరుజ్జీవం కోసం ఒక కమిటీని ఈ ఏడాది మార్చిలో నియమించారు. ఈ ప్రాజెక్టు విషయంలో భిన్నాబిప్రాయాలు వ్యక్తమవడంతోపాటు కొన్నిచోట్ల ఘర్షణ వాతావరణం నెలకొనడంతో ఇప్పటికీ పూర్తి స్థాయి నివేదికను ప్రభుత్వానికి సమర్పించలేదు. నిజాం చక్కెర పరిశ్రమ ఫ్యాక్టరీ పునరుద్ధరణ కోసం ఏర్పాటైన కమిటీ పలుమార్లు భేటీ అయినా.. ఆదిశగా ఎలాంటి నిర్ణయం వెలువడలేదు. వెరసి పలు కమిటీలు కేవలం కాలయాపన కోసమేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సబ్ కమిటీలతో ఆశించిన ఫలితాలు రావడంలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
క్యాబినెట్ సబ్ కమిటీలు ఇవే..
మూసీ పునరుజ్జీవంపై డిప్యూటీ సీఎం భట్టి చైర్మన్‌గా 2026 మార్చి 27న కమిటీ నియామకం.
99 రోజుల యాక్షన్‌ప్లాన్ అమలుకోసం డిప్యూటీ సీఎం భట్టి చైర్మన్‌గా 2026 ఫిబ్రవరి 26న కమిటీ నియామకం.
ఉన్నత విద్యాలయాల్లో వివక్ష నిర్మూలన కోసం భట్టి చైర్మన్‌గా 2026 ఏప్రిల్17న కమిటీ.
పరిశ్రమలకు ప్రోత్సాహం అందించేందుకు 2024 ఫిబ్రవరి 24న డిప్యూటీ సీఎం భట్టి ఛైర్మన్‌గా కమిటీ నియామకం.
ఆదాయం పెంపు కోసం డిప్యూటీ సీఎం భట్టి చైర్మన్‌గా 2024 ఫిబ్రవరి 24న కమిటీ నియమాకం.
ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం డిప్యూటీ సీఎం భట్టి చైర్మన్‌గా 2024 నవంబరు 8న కమిటీ నియామకం.
గోదావరి పుష్కరాల కోసం 2026 మార్చి 2న మంత్రి శ్రీధర్‌బాబు చైర్మన్‌గా కమిటీ ఏర్పాటు.
జీవో 317పై మంత్రి రాజనర్సింహ చైర్మన్‌గా 2024 ఫిబ్రవరి 24న కమిటీ ఏర్పాటు.
ఇవి కాకుండా ప్రజాపాలన దరఖాస్తులు, 6 గ్యారెంటీల అమలు, నిజాం షుగర్స్ పునరుద్ధరణ, విద్యాభివృద్ధి, సినీ పరిశ్రమ, డీఎస్సీ అభ్యర్ధుల సమస్యలు, కాళేశ్వరం ప్రాజెక్టు, కులసర్వే, ఎస్సీ వర్గీకరణపై కమిటీలు ఏర్పాటయ్యాయి.