Share News

CP Sajjanar: ది ఫ్యూచర్ ఈజ్ ఫీమేల్.. మహిళలను కించపరిస్తే దేశానికే నష్టం: సీపీ సజ్జనార్

ABN , Publish Date - Jan 14 , 2026 | 04:11 PM

మహిళా అధికారులపై ఉద్దేశపూర్వక దుష్ప్రచారం ఆందోళనకరమని సీపీ సజ్జనార్ అన్నారు. ఇకపై మహిళలను అవమానిస్తే సహించేది లేదని సీపీ వ్యాఖ్యలు చేశారు.

CP Sajjanar: ది ఫ్యూచర్ ఈజ్ ఫీమేల్.. మహిళలను కించపరిస్తే దేశానికే నష్టం: సీపీ సజ్జనార్
CP Sajjanar

హైదరాబాద్, జనవరి 14: తెలంగాణలో మహిళా ఐఏఎస్ అధికారిపై అసభ్యకర కథనాలు ప్రసారం ఘటన తీవ్ర దుమారాన్ని రేపుతోంది. మహిళా ఐఏఎస్ అధికారిని కించపరిచిన కేసును విచారించేందుకు ప్రత్యేక దర్యాప్తు సంస్థ(సిట్‌)ను ఏర్పాటు చేస్తూ తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ సీపీ సజ్జనార్ (CP Sajjanar) నేతృత్వంలో సిట్ నడువనుంది. ఇదిలా ఉండగా.. మహిళా అధికారిపై అసత్య కథనాలు ప్రసారం చేయడంపై సీపీ సజ్జనార్ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా స్పందించారు. మహిళా అధికారులపై ఉద్దేశపూర్వక దుష్ప్రచారం ఆందోళనకరమని అన్నారు. ఇకపై మహిళలను అవమానిస్తే సహించేది లేదని సీపీ సజ్జనార్ సంచలన వ్యాఖ్యలు చేశారు.


సీపీ సజ్జనార్ ట్వీట్ ఇదే..

‘మహిళలపై విమర్శ కాదు.. దుష్ప్రచారం నేరం. ప్రజా జీవితంలో విమర్శలు సహజమే. కానీ మహిళలపై వ్యక్తిగత దాడులు, చరిత్ర హననం, అసభ్య వ్యాఖ్యలు విమర్శలు కావు.. అవి క్రూరత్వం. ప్రభుత్వ ఉద్యోగి అయినా, ప్రైవేట్ ఉద్యోగి అయినా, గృహిణి అయినా మహిళ గౌరవం అపరిమితం. టీవీ చర్చలు, సోషల్ మీడియా పోస్టులు, వార్త కథనాల పేరుతో మహిళలపై దూషణలు అసహ్యకరం. నేడు ప్రతి పనిలో మహిళలు ముందువరుసలో నాయకత్వం వహిస్తున్నారు. పాలన, పోలీసు శాఖ, శాస్త్ర రంగం, మీడియా సహా ప్రజాజీవితంలో మహిళలు కీలకపాత్ర పోషిస్తున్నారు. ఇల్లు-ఉద్యోగం రెండింటినీ సమతుల్యం చేస్తున్నారు మహిళలు. కనిపించని బాధ్యతలతో కుటుంబాన్ని నడుపుతూ.. సమాజాన్ని ముందుకు తీసుకెళ్తున్న మహిళలపై దాడులు ప్రగతిపై దాడులే.

భారతీయ సంప్రదాయం చెబుతున్న సందేశం ప్రకారం ‘యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః’ .. మహిళలకు గౌరవం ఉన్న చోటే సుభిక్షం ఉంటుంది. మహిళా అధికారులపై ఉద్దేశపూర్వక దుష్ప్రచారం ఆందోళనకరం. వ్యక్తిగతంగా దెబ్బతీయడం, ప్రతిష్ఠను నాశనం చేయడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. మహిళలను గౌరవించని సమాజం భవిష్యత్తును కోల్పోతుంది. ముందుండి నడిపిస్తున్న మహిళలను కించపరచడం దేశానికే నష్టం. స్పష్టమైన సందేశం ఒక్కటే.. మహిళలపై అవమానం, వివక్ష, చరిత్ర హననం ఇక సహించబోము. ది ఫ్యూచర్ ఈజ్ ఫీమేల్.. ఆ భవిష్యత్తు గౌరవంతోనే నిర్మితమవుతుంది.. అవమానంతో కాదు’ అంటూ సీపీ సజ్జనార్ ట్వీట్ చేశారు.


ఇవి కూడా చదవండి...

అర్ధరాత్రి జర్నలిస్టుల అరెస్ట్ సరికాదు: జగ్గారెడ్డి

గొంతుకోసిన చైనా మాంజా.. వాహనదారుడు మృతి

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jan 14 , 2026 | 04:58 PM