Share News

అన్ని జోన్లలో పర్యటిస్తా.. రోడ్లు శుభ్రంగా లేకపోతే సస్పెండ్ చేస్తా .. సీఎం రేవంత్ వార్నింగ్

ABN , Publish Date - Feb 17 , 2026 | 04:51 PM

మున్సిపల్ అధికారులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. త్వరలోనే ప్రతి జోన్‌లో పర్యటిస్తానని.. రోడ్డు శుభ్రంగా లేకపోతే అధికారులను అక్కడికక్కడే సస్పెండ్ చేస్తానని సీఎం హెచ్చరించారు..

అన్ని జోన్లలో పర్యటిస్తా.. రోడ్లు శుభ్రంగా లేకపోతే సస్పెండ్ చేస్తా .. సీఎం రేవంత్ వార్నింగ్
CM Revanth Reddy

హైదరాబాద్, ఫిబ్రవరి 17: పురపాలక శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఈరోజు (మంగళవారం) కీలక సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ అధికారులు, కమిషనర్లు, సిబ్బందిపై సీఎం సీరియస్ అయ్యారు. త్వరలోనే ప్రతి జోన్‌లో వ్యక్తిగతంగా పర్యటించి పరిస్థితులను పరిశీలిస్తానని స్పష్టం చేశారు. రోడ్లు శుభ్రంగా లేకపోతే అక్కడికక్కడే అధికారులపై చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. కమిషనర్లు, జోనల్ కమిషనర్లు ఉదయం నుంచే ఫీల్డ్‌లో ఉండాలని, రోజూ సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు.


చాలా మంది అధికారులు ఫీల్డ్‌లోకి వెళ్లడం లేదని, అలాంటి వారిని సస్పెండ్ చేస్తానని ముఖ్యమంత్రి వార్నింగ్ ఇచ్చారు. హైదరాబాద్‌తో పాటు మూడు కార్పొరేషన్లలో శానిటేషన్, పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. నూతనంగా ఎన్నికైన మేయర్లు, డిప్యూటీ మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లకు ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.


నగరంలో స్మార్ట్ పోల్స్ ఏర్పాటు పైన అధ్యయనం చేయాలన్నారు సీఎం. ట్రాఫిక్ బాగా ఉన్న చోట పీపీపీ విధానంలో స్కై వాక్ బ్రిడ్జిల ఏర్పాటుపై అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. నెక్లెస్ రోడ్ రైల్వే స్టేషన్ సమీపంలో మల్టీలెవల్ కార్ పార్కింగ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అడ్వటైజింగ్ బోర్డుల ఏర్పాటుపై జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వానికి వచ్చే ఆదాయానికి గండి పడకుండా చర్యలు ఉండాలని సీఎం తెలిపారు.


ప్రభుత్వ కార్యక్రమాల కోసం 10 శాతం అడ్వటైజింగ్ బోర్డులు కేటాయించాలని ముఖ్యమంత్రి చెప్పారు. అడ్వటైజింగ్ బోర్డుల నుంచి సంవత్సరానికి ఒక సారి ఫీజు వసూలు చేయాలని అధికారులకు సూచించారు. అనధికార అడ్వటైజింగ్ బోర్డులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నగరంలో వీధి దీపాల నిర్వహణలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వీధి దీపాల నిర్వహణ విషయంలో యూనికోడ్ ఉండాలన్నారు. జంక్షన్‌ల వద్ద స్మార్ట్ పోల్స్ ఏర్పాటు చేయాలని తెలిపారు. జీహెచ్‌ఎంసీ విభజన విషయంలో తలెత్తిన పలు సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనలు చేశారు. ఈ సమావేశంలో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సీఎంఓ సెక్రటరీ మాణిక్ రాజ్, హెచ్ ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ పాల్గొన్నారు.


ఇవి కూడా చదవండి..

విషాదం.. టిప్పర్ లారీ కింద పడి ఐటీఐ విద్యార్థి మృతి

నటి ప్రత్యూష కేసులో నిందితుడికి సుప్రీంకోర్టులో చుక్కెదురు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Feb 17 , 2026 | 05:47 PM