సర్కారీ ఆస్పత్రుల్లో నెల రోజులుపని చేయండి
ABN , Publish Date - Mar 13 , 2026 | 05:05 AM
కార్పొరేట్ ఆస్పత్రుల వైద్యులు ఏడాదిలో ఒక నెల రోజులు ఏదైనా ప్రభుత్వాస్పత్రిలో పనిచేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూచించారు.
ఏడాదికోసారి ఇలా సేవలందించండి
మానవత్వంతో చికిత్స చేస్తేనే ఆస్పత్రులు, డాక్టర్లపై ప్రజలకు నమ్మకం కలుగుతుంది
మెడికవర్ ఆస్పత్రి ప్రారంభోత్సవంలో కార్పొరేట్ వైద్యులకు సీఎం రేవంత్‌రెడ్డి పిలుపు
నెట్‌ఫ్లిక్స్ వచ్చిందంటే హాలీవుడ్ వచ్చినట్లే!
ఫోర్త్ సిటీలో నెట్‌ఫ్లిక్స్ విస్తరణకు భూమి ఇస్తాం
నెట్‌ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియో ప్రారంభోత్సవంలో సీఎం
నిజాం స్ఫూర్తితో మూసీ పునరుజ్జీవం
ఆధునిక వసతులతో పర్యావరణహితంగా అభివృద్ధి
నేడుమూసీ అభివృద్ధి ప్రణాళిక ఆవిష్కరణ
హైదరాబాద్ సిటీ, మార్చి 12 (ఆంధ్రజ్యోతి): కార్పొరేట్ ఆస్పత్రుల వైద్యులు ఏడాదిలో ఒక నెల రోజులు ఏదైనా ప్రభుత్వాస్పత్రిలో పనిచేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూచించారు. ‘‘ఏడాదిలో 11 నెలలు మీ కోసం, మీ కుటుంబం కోసం, మీరు పనిచేస్తున్న సంస్థల కోసం పనిచేయండి. ఒక్క నెల మాత్రం మీకు దగ్గరలో ఉన్న ఏదైనా ప్రభుత్వ ఆస్పత్రిలో పనిచేయడానికి ప్రయత్నించండి. దాని వల్ల మీరు మరింత నేర్చుకునేందుకు అవకాశం లభిస్తుంది. ప్రజలకు మీపై నమ్మకం కలుగుతుంది. ప్రభుత్వాలు మిమ్మల్ని గౌరవించే విధానం మారుతుంది. ఇందుకోసం ఓ వెబ్‌సైట్ ప్రారంభించనున్నాం. మీకు తీరిక దొరికినప్పుడు వచ్చి సేవలందించండి. అందుకు అవసరమైన ఏర్పాట్లు మేం చేస్తాం’’ అని సీఎం కార్పొరేట్ ఆస్పత్రుల వైద్యులకు పిలుపునిచ్చారు. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన మెడికవర్ హాస్పిటల్‌ను గురువారం వైద్య ఆరోగ్య మంత్రి దామోదర రాజనర్సింహతో కలిసి సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అత్యున్నత ప్రమాణాలతో కూడిన మెడికవర్ ఆస్పత్రులకు దేశంలోనే ప్రత్యేక గుర్తింపు ఉందని కొనియాడారు. ప్రైవేట్ డాక్టర్లు కూడా ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాల్లో భాగమైతే, పేదలకు మరింత మెరుగైన వైద్యం అందుతుందని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు పెట్టే భోజనం ఎన్ని కేలరీలు ఉంటుందనేది రియల్ టైమ్‌లో తెలుసుకునేందుకు ఓ యాప్‌ను తీసుకురాబోతున్నామని తెలిపారు. ఈ యాప్ గురించి ఇటీవలే ఓ డాక్టర్ తనకు వివరించారని, ఈ తరహా నిర్మాణాత్మక సూచనలను ప్రభుత్వం స్వాగతిస్తుందని చెప్పారు. వైద్యం అనేది యాంత్రికంగా చేసేది కాదని, పేదలకు మానవత్వంతో చికిత్స చేసినప్పుడే ఆస్పత్రులు, వైద్యులపై నమ్మకం కలుగుతుందని అన్నారు. దేశంలో హైదరాబాద్ నుంచే 40 శాతం ఫార్మా ఎగుమతులు జరుగుతున్నాయని, కొవిడ్ వ్యాక్సిన్లలో మూడు ఇక్కడి జినోమ్ వ్యాలీలో తయారవడం గర్వకారణమని తెలిపారు.
ఏటా 8-10 లక్షల మంది రోగుల రాక..
ఆరోగ్య పరంగా తెలంగాణ ఎంతో ముందు ఉందని సీఎం రేవంత్ చెప్పారు. ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి మెరుగైన వైద్యం కోసం తెలంగాణకు ఏటా 8-10 లక్షల మంది రోగులు వస్తున్నారని తెలిపారు. వీరిలో విదేశీయులు 2 లక్షల మంది ఉంటున్నారన్నారు. ఎయిర్ కనెక్టివిటీ బాగుంటే ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంటుందని, ఆ దిశగా కేంద్ర పౌర విమానయాన శాఖతో చర్చలు జరుపుతున్నామని చెప్పారు. పశ్చిమాసియా, పొరుగు దేశాల నుంచి నేరుగా హైదరాబాద్‌కు విమానాలు ఉంటే వైద్య పర్యాటకం మరింత పెరుగుతుందని తెలిపారు. మహిళ ఆరోగ్యంగా ఉంటే కుటుంబం ఆరోగ్యంగా ఉంటుందన్నారు. ఆ దిశగా కూడా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. 20 ఏళ్ల ఆరోగ్యశ్రీ సమాచారాన్ని విశ్లేషించి, ఏయే ప్రాంతాల్లో ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామని వివరించారు. క్యాన్సర్‌పై ప్రత్యేకంగా దృష్టి సారించామని, డాక్టర్ నోరి దత్తాత్రేయుడిని సలహాదారుగా నియమించుకొని ఆయన సలహాల ప్రకారం చర్యలు చేపడుతున్నామని చెప్పారు. ఆరోగ్యశ్రీ, సీఎంఆర్‌ఎఫ్ కోసం దాదాపు రూ.1800 కోట్లు ఖర్చు చేశామన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో పడకలు పెంచేందుకు, కొత్తగా మౌలిక సదుపాయాల కల్పనకు రూ.10 వేల కోట్లు వెచ్చిస్తున్నట్లు తెలిపారు. ఇటీవలి కాలంలో వైద్య ఖర్చులు విపరీతంగా పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 60 లక్షల మందికి త్వరలోనే డిజిటల్ హెల్త్ కార్డులు అందజేయనున్నట్లు చెప్పారు. తెలంగాణలో 1.30 కోట్ల కుటుంబాలకు జీవిత బీమా కల్పించాలని తమ ప్రభుత్వం ఆలోచిస్తోందని తెలిపారు.
నర్సరీ నుంచి 12వ తరగతి దాకా..
విద్యావిధానంలో సంస్కరణలు తీసుకురాబోతున్నామని సీఎం రేవంత్ చెప్పారు. నర్సరీ నుంచి 12వ తరగతి వరకు నాణ్యమైన విద్యను పాఠశాలల్లోనే అందించేలా చర్యలు తీసుకోబోతున్నామన్నారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి పాఠశాల విద్యలోనే ఇంటర్మీడియట్ విద్యను కలిపేయనున్నట్లు తెలిపారు. తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు చేసి భోజన వసతితో పాటు రవాణా సౌకర్యం కూడా అందించే ఏర్పాట్లు చేయనున్నామని వివరించారు. విద్యార్థుల్లో నైపుణ్యం కోసం స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేశామన్నారు. నాణ్యమైన విద్య అందించగలిగితే సంక్షేమ పథకాలను ఎక్కువగా ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ.. విద్య, వైద్యం, సామాజిక భద్రతపై తమ ప్రభుత్వం ఎక్కువగా దృష్టి సారించిందని, ఆ ఫలితాలను ఇప్పుడు చూస్తున్నామని తెలిపారు. దాదాపు 90 శాతం వైద్యచికిత్సలు జిల్లా స్థాయిలోనే జరిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. కాగా, ముఖ్యమంత్రి పిలుపుకు మెడికవర్ హాస్పిటల్స్ ఈడీ డాక్టర్ ఎ.శరత్‌రెడ్డి స్పందించారు. తామందరం ఒక నెల పాటు ముఖ్యమంత్రి కోరినట్లుగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేయడానికి సిద్ధమేనన్నారు. ముఖ్యమంత్రి ఆశయాల్లో మెడికవర్ భాగస్వామిగా ఉంటుందని హామీ ఇచ్చారు. ప్రభుత్వం దూరదృష్టితో ప్రత్యేక వైద్య సేవలను అందించేలా ఆస్పత్రులను తీర్చిదిద్దడం వల్ల తాము కూడా మెరుగైన వైద్య సేవలను అందించడానికి పోటీ పడాల్సి వస్తోందన్నారు. డిజిటైజేషన్ ఆలోచన అద్భుతమని, రాబోయే మూడు నాలుగేళ్లలో ఆరోగ్య సంరక్షణ పరంగా తెలంగాణ అగ్రగామిగా నిలిచేందుకు ఇది తోడ్పడుతుందన్నారు. మెడికవర్ హాస్పిటల్స్ ఇండియా ఎండీ అనిల్‌కృష్ణ మాట్లాడుతూ.. హైదరాబాద్ వాసులకు ప్రపంచ స్థాయి వైద్య సేవలందించాలన్న లక్ష్యంతో ఈ ఆస్పత్రిని ప్రారంభించామన్నారు.