Share News

సీఎం రేవంత్‌కు కొండా సురేఖ రాఖీ కడతారా..?

ABN , Publish Date - Aug 28 , 2026 | 10:27 AM

ప్రతి సంవత్సరం సీఎం రేవంత్‌కు మంత్రులు సీతక్క, కొండా సురేఖ ఆప్యాయంగా రాఖీ కట్టేవారు. అయితే ఈసారి వివాదంలో చిక్కుకున్న సురేఖ ఎప్పటిలాగే సీఎంకు రాఖీ కడతారా? అని చర్చ నడుస్తోంది.

సీఎం రేవంత్‌కు కొండా సురేఖ రాఖీ కడతారా..?

ఇంటర్నెట్ డెస్క్: రాఖీ పండగ రోజున తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్‌లో ఒకటే చర్చ నడుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి కొండా సురేఖ రాఖీ కడతారా.. లేదా..? అని సర్వత్రా ఆసక్తి నెలకొంది. తెలంగాణ కేబినెట్‌లో ఇద్దరంటే ఇద్దరే మహిళా మంత్రలున్నారు. ఒకరు సీతక్క.. మరొకరు సురేఖ. వీరిద్దరూ ఏటా రేవంత్ రెడ్డికి ఆత్మీయంగా రాఖీ కట్టేవారు. అయితే కూతురు కామెంట్స్ నేపథ్యంలో సమస్యల్లో చిక్కుకున్న కొండా సురేఖ ఈ సంవత్సరం సీఎంకు రాఖీ కట్టి, రక్షా బంధన్ శుభాకాంక్షలు తెలుపుతారా.. అని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

కొన్ని రోజులుగా మంత్రి కొండా సురేఖ పేరు చెబితేనే కాంగ్రెస్ శ్రేణులు ఆగ్రహంతో ఊగిపోతున్న విషయం తెలిసిందే. సురేఖ కుమార్తె సుస్మిత ముఖ్యమంత్రిపై చేసిన వ్యాఖ్యలే ఇందుకు కారణం. ఇలాంటి సమయంలో రేవంత్‌కు రాఖీ కట్టడానికి సురేఖ ముందుకొస్తారా..? అని ప్రశ్నలు వినబడుతున్నాయి. అయితే ఆమె రాఖీ కట్టడానికి సీఎం అపాయింట్‌మెంట్ కోరారని సమాచారం. కానీ ఇంకా సీఎం అపాయింట్‌మెంట్ దొరకలేదని తెలుస్తోంది. పరకాల టికెట్ విషయంలో సుస్మిత ఎపిసోడ్ తరువాత ఇప్పటివరకు సీఎంను సురేఖ కలవలేదు. ఒకవేళ సురేఖకు సీఎం అపాయింట్‌మెంట్ లభిస్తే.. వివాదం తరువాత ఆమె రేవంత్‌ను కలవడం ఇదే మొదటిసారి అవుతుంది. సురేఖ సంగతి ఎలా ఉన్నా సీతక్క మాత్రం ఈరోజు ఉదయం 9 గంటలకు ముఖ్యమంత్రికి రాఖీ కట్టనున్నారు.

Updated Date - Aug 28 , 2026 | 10:28 AM